ప్రకృతి పునర్నిర్మాణం…

by Shyam |   ( Updated:2021-07-15 03:29:29.0  )
Wildlife SOS
X

దిశ, ఫీచర్స్ : ‘అనగనగా ఓ అడవి’.. అందులో సింహాలు, పులులు, జింకలు, కుందేళ్లు, నక్కలు, దుప్పులు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, పాములు, తేళ్లు, పక్షులతో పాటు బోలెడన్ని జీవులు అక్కడ నివసించేవని పిల్లలకు కథ చెబుతుంటాం. వాస్తవంగా కూడా అదే జరుగుతోంది. ఒకప్పుడు అరణ్యమంతా జీవరాశులదే. కానీ మృగరాజుని మించిన మానవుడు అక్కడ పాగా వేయడం మొదలుపెట్టడంతో అడవులన్నీ ‘కాంక్రీటు భూములు’గా మారిపోతున్నాయి. తిండి, గూడు కరువై కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో జీవజాతులన్నీ జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ఎకాలజీ దెబ్బతినడమే కాకుండా, ఎన్నో జీవులు అంతరించిపోతున్నాయి. జాతుల విపత్తును ఆపడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం ప్రధాన పర్యావరణ సవాల్‌గా మారింది. ఇందుకు పరిష్కారమే ప్రకృతి పునరుద్ధరణ(రీవైల్డింగ్). 1.4 బిలియన్ల జనాభా కలిగిన దేశంలో అన్ని రకాల డిమాండ్లు, అవసరాలతో, సమతుల్యత అవసరాన్ని పరిష్కరించడం ఎలా సాధ్యమవుతుందో తెలుసుకుందాం.

ఆవరణ వ్యవస్థలోని ప్రతీ సూక్ష్మజీవి కూడా జీవావరణ సమతుల్యతకు కారణమవుతుంది. మొక్కలు, జంతువులు, పక్షులు రకరకాల జీవజాతులన్నీ ప్రకృతిలో భాగమే. ఇలాంటి విభిన్న అంశాల జీవవైవిధ్యం(బయో డైవర్సిటీ) ఎంత ఎక్కువగా ఉంటే పర్యావరణానికి అంత ప్రయోజనకరం. అయితే గడిచిన 200ఏళ్లలో భారతదేశం తన విభిన్న అటవీ భూములను మానవ ప్రభావం(హౌసింగ్, పరిశ్రమ, మౌలిక సదుపాయాలు, మైనింగ్, వేట ఇది సుదీర్ఘమైన జాబితా)వల్ల కోల్పోయింది. ప్రస్తుతం భారతదేశ భూభాగంలో 5% మాత్రమే రక్షిత అటవి భూమి(ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియా) ఉంది. ఇందులో వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ రిజర్వ్స్ ఉన్నాయి. రకరకాల కారణాల వల్ల ఇవి కూడా తగ్గిపోతుండటం విచారకరం. అభయారణ్యాలు, ఉద్యానవనాలు ఆదాయ భూములు(పొలాలు, గృహాలు, హోటళ్లు, రహదారులు, విద్యుత్ ప్లాంట్లు, గనులు)గా మారాయి. రక్షిత అడవుల చుట్టూ బఫర్ జోన్ ఉంటుంది. అక్కడ విస్తృత శ్రేణి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యకలాపాలు నిషేధం. కానీ కాలక్రమంలో వీటని కూడా వదలడం లేదు. దాంతో బఫర్ జోన్ పరిధి 5 కి.మీ నుంచి 1 కి.మీ మేరకు తగ్గిపోయినట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మనదేశంలోనే కాదు, ఆధునికీకరణ ప్రభావంతో జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ బయోడైవర్సిటీకి ప్రాముఖ్యతనిస్తున్నాయి. దాంతో జీవవైవిధ్యానికి భారత్ మరింత ప్రాధాన్యమిస్తూ అనేక రకాలుగా కృషి చేస్తుంది.

రీవైల్డింగ్ :

ప్రకృతి సమతుల్యతను పునరుద్ధరించే మార్గమే ‘రీవైల్డింగ్’. అంతరించిపోతున్న జీవజాతులను పరిరక్షిస్తూ, వాటిని పునరుద్ధరించడం ఇందులో భాగం. ఒక్కమాటలో చెప్పాలంటే భూమిని వన్యప్రాణులకు, వన్యప్రాణులను భూమికి తిరిగి ఇవ్వడమే దీని ఉద్దేశం. జీవవైవిధ్యాన్ని పెంచడంతో పాటు, సెల్ఫ్ సస్టైనబుల్ ఎన్విరాన్‌మెంట్ సృష్టించడానికి, వాతావరణ మార్పుల ప్రభావాలను నియంత్రించడానికి సహాయపడే స్ట్రాటజీ ‘రీవైల్డింగ్’. అంతరించిపోతున్న జాతులు తిరిగి వృద్ధి చెందడానికి తగిన ప్రాంతాన్ని ఇవ్వడం, వాటి జనాభా పెరుగుదలకు కీలకమైన స్థానిక జాతులను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల ప్రకృతిని పునరుద్ధరించవచ్చు. ఈ విధంగా రీవైల్డింగ్ ప్రకృతి సహజ సమృద్ధికి, జీవవైవిధ్య స్థితిని తిరిగి స్థాపించే అవకాశాన్ని అందించి పర్యావరణ సమతుల్యానికి ప్రాణం పోస్తుంది. అంతేకాదు ప్రకృతితో మనం తిరిగి ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్నిస్తుంది. నేచర్ రీవైల్డింగ్ జరిగితే అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షపాతాలు తగ్గిపోతాయి. వన్యప్రాణి ప్రెజెంటర్, ఫిల్మ్‌మేకర్ గోర్డాన్ బుకానన్ తెరకెక్కించిన ‘స్కాట్లాండ్ : ద ఫస్ట్ రీవైల్డింగ్ నేషన్’ అనే షార్ట్ ఫిల్మ్‌‌ రీవైల్డింగ్ ప్రయోజనాలను వర్ణిస్తూనే.. వన్యప్రాణులు మళ్లీ ప్రకృతిలో భాగం కావడాన్ని వివరిస్తుంది.

ఎలా చేయాలి?

పునరుద్ధరణ(రీవైల్డింగ్)కు ముందుగా దాన్ని ప్రభావితం చేసే అన్ని అడ్డంకులను గుర్తించి పరిష్కరించుకోవాలి. ఇందులో భాగంగా అడవులను కాపాడుకోవడం, అంతరించిపోతున్న జీవజాతులను సంరక్షించి వాటి సంతతిని పెంచడంతో పాటు ఆయా జీవులను తిరిగి అడవుల్లోకి వదిలివేయాలి. ఈ క్రమంలోనే ఇండియాలో పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందులో చెప్పుకోవాల్సింది ప్రపంచంలోని అతిచిన్న అడవి పందుల రీవైల్డింగ్. ఈ జంతువుల్లో 100కు పైగా గువహతి సమీపంలోని ఒక కేంద్రంలో పెంచి, మూడు అభయారణ్యాలలోకి వీటిని విడుదల చేశారు. దుధ్వా టైగర్ రిజర్వ్‌లో భారతీయ ఖడ్గమృగాలను పరిరక్షించడం కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్థానికంగా అంతరించిపోతున్న పులులను సరిస్కా, పన్నా టైగర్ రిజర్వ్‌లో తిరిగి ప్రవేశపెట్టారు. అలాగే క్యాప్టివ్ బ్రీడ్ మొసళ్లను ఉత్తర భారతదేశంలోని నదుల్లో విడిచిపెడుతున్నారు. అంతేకాదు ‘న్యూ రిహబిలెషన్’ ప్రొగ్రామ్‌లో భాగంగా త్వరలో ఎనిమిది చిరుతలను దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు మార్చనున్నారు. అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే ఈ ప్రాంతం దేశంలోనే మొట్టమొదటి చిరుత అభయారణ్యం అవుతుంది. అంతేకాదు హర్యానా అటవీ, వన్యప్రాణి శాఖ సహకారంతో పిన్జోర్ సమీపంలో ‘జటాయువు’ అనే రాబందుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్). 17 ఏళ్లుగా వణ్యప్రాణుల సంరక్షణలో నిమగ్నమైన బీఎన్‌హెచ్‌ఎస్.. వైట్-బ్యాక్డ్, లాంగ్-బిల్, స్లెండర్-బిల్‌తో సహా అంతరించిపోతున్న అనేక జిప్స్ జాతులను విజయవంతంగా అడవిలోకి ప్రవేశపెడుతోంది.

అందుకే దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు రీవైల్డింగ్ ఆచరిస్తున్నాయి. ఉదాహరణకు, 21 సంవత్సరాల క్రితం అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో కొన్ని తోడేళ్ళను తిరిగి ప్రవేశపెట్టగా, ప్రస్తుతం అక్కడ వాటి సంఖ్య వందల్లో పెరిగింది. ఇవే కాదు అటవీ నిర్మూలన, వన్యప్రాణుల ఓవర్‌ పాస్‌లను నిర్మించడం, స్థానిక మొక్కలు, స్థానిక కీటకాల జాతులను తిరిగి ప్రవేశపెట్టడం కూడా రీవైల్డింగ్‌‌లో భాగమే. ఈ సంవత్సరం నుంచి మరో పదేళ్లు ‘పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ’ కోసం కేటాయించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలను ఆదేశించింది.

రీవైల్డింగ్ వల్ల పర్యాటకం గానూ కలిసి రావడంతో పాటు ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తాయి. ఇటీవలి నివేదిక ప్రకారం జీవవైవిధ్యం క్షీణిస్తూనే ఉన్నందున అన్ని దేశాల్లోనూ దీని ప్రభావం ప్రపంచ జీడీపీలో సగానికి పైగా (55%) ఉంటుందని అంచనా. జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థపై ఆధారపడ్డ సేవలు కూడా ప్రమాదంలో ఉన్నట్లే లెక్క.

హర్యానా రాష్ట్రం యమునా నగర్‌లోని ‘వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్’ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏనుగు పునరావాస కేంద్రం(ఈఆర్‌సీ) వాటి సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. దారి తప్పిపోయిన, గాయపడిన, దోపిడికి గురైన, అంగవైకల్యంతో ఉన్న ఏనుగులను కాపాడి చికిత్స అందిస్తుంది. ఇవి పూర్తిగా కోలుకున్న తర్వాత అడవిలో వదిలిపెడుతూ స్వేచ్ఛను అందించడంతో పాటు రీవైల్డింగ్‌కు కృషిచేస్తోంది.

Advertisement

Next Story