వరకట్న వేధింపులు తాళలేక.. వివాహిత ఆత్మహత్య

by Sumithra |
suicide
X

దిశ, ఆత్మకూరు(ఎస్): ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆనందంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. దీంతో పెద్దలను లెక్కచేయకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంతలో వారి దాంపత్య జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన చిత్తలూరి వెంకన్న, సోమల దంపతుల రెండో కూతురు సంధ్య(29) ఏనుభాముల గ్రామానికి చెందిన ఒర్రె మీనయ్య, ఐలమ్మల రెండో కుమారుడు నరేష్‌ ఇరువురు 2012లో ప్రేమించి, తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులకు జన్మించారు. 2018 వరకు సాఫీగా సాగిన వారి జీవితంలోకి నరేష్ వాళ్ల అమ్మనాన్న, ఆడపడుచు, మేనమామ ప్రవేశించారు. జరిగిందేదో జరిగింది ఇకనుంచి మంచిగా ఉందామని నమ్మించి నరేష్‌ను వాళ్లవైపు తిప్పుకున్నారు. కొంతకాలం పాటు ఇద్దరితో మంచిగా కలిసుకున్నారు.

అనంతరం మెల్లగా వరకట్నం కోసం నరేష్‌పై వేధింపులు ప్రారంభించారు. దీంతో నరేష్ సంధ్యల మధ్య ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. మంగళవారం ఇద్దరి మధ్య గొడవ ముదిరింది. దీంతో చేసేదేంలేక నరేష్ ఇంట్లోనుంచి బయటకు వెళ్లగానే సంధ్య పురుగులమందు తాగింది. గమనించిన స్థానికులు నరేష్‌కు సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటిన ఇంటికొచ్చిన నరేష్ సంధ్యను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. వరకట్నం కోసం నా కూతురిని వేధింపులకు గురిచేశారని, అందుకే నా కూతురు ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి తండ్రి వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ సురేష్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story