- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇరుగుపొరుగే ట్రాఫికర్స్.. బాధితులకు భరోసానివ్వని చట్టం
దిశ, ఫీచర్స్ : బలప్రయోగం ద్వారా జంతువుల్ని లొంగదీసుకునే మనుషులు.. తమ అవసరాల కోసం సాటి మనుషులను కూడా బంధిస్తున్నారు. ‘నిరక్షరాస్యత, ఆర్థిక వెనుకబాటుతనం, ఆకలి మంట’లు ఎవరినైనా సులభంగా నమ్మేలా చేస్తే.. ఇదే అదనుగా బెదిరించి, భయపెట్టి, ప్రాణాలకు ముప్పు తలపెట్టి బానిసలుగా చేసుకుంటున్నారు. పురుషులు, మహిళలు, పిల్లలు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రధానంగా లైంగిక వ్యాపారంతో పాటు శ్రమ దోపిడీకి సంబంధించే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుండగా.. బాధితులకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచేస్తున్నారు. నమ్మకమైన వ్యక్తులే అభం శుభం తెలియని పిల్లలను వేశ్యాగృహాలకు చేరవేస్తూ జీవితాలను చిదిమేస్తున్నారు. ప్రపంచ దేశాల తీరని సమస్యగా మారిన హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ‘దిశ’ స్పెషల్ స్టోరీ..
ప్రపంచంలో అనేక దేశాలు ఎదుర్కొంటున్న అత్యంత బాధాకర సమస్యల్లో మానవ అక్రమ రవాణా(హ్యూమన్ ట్రాఫికింగ్) ఒకటి. UNODC వెబ్‌సైట్ ప్రకారం.. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే లాభాపేక్షతో ప్రజలను దోపిడీ చేసే లక్ష్యంతో బలవంతంగా, మోసపూరితంగా వ్యక్తుల నియామకం, రవాణా, బదిలీ, దాచిపెట్టడం లేదా చేర్చుకోవడం. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ప్రాంతంలో అన్ని వయసుల, అన్ని నేపథ్యాలకు చెందిన పురుషులు, మహిళలు, పిల్లలు ఈ తరహా నేరాల్లో బాధితులు కావచ్చు. ఇందుకోసం ట్రాఫికర్లు హింసతో పాటు మోసపూరిత ఎంప్లాయిమెంట్ ఏజెన్సీలను, విద్య ఉద్యోగావకాశాలకు సంబంధించిన నకిలీ వాగ్దానాలను బాధితులపై ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో భారతదేశంలోని వ్యవస్థీకృత నేరాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ టాప్ ప్లేస్‌లో ఎందుకు ఉండిపోయింది? ఇంత ప్రబలంగా పాతుకుపోయిన సమస్యకు పరిష్కారం లేదా? చట్టాలు ఏం చెప్తున్నాయి..?
ఇండియాలో ప్రధాన సమస్యగా..
హ్యూమన్ ట్రాఫికింగ్ భారతదేశంలో రెండో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా పరిగణించబడుతోంది. భారత చట్టాల ప్రకారం మానవ అక్రమ రవాణాను నిషేధించినా ఇప్పటికీ ప్రధాన సమస్యగానే ఉంది. నాగ్‌పూర్‌లోని రెడ్ లైట్ ఏరియాలో దాదాపు 700-800 మంది పిల్లలు చిక్కుకుపోయారని ‘ఫ్రీ ఎ గర్ల్ ఫౌండేషన్’ నివేదిక వెల్లడిస్తుండగా.. భారత్‌లో 20 మిలియన్ వేశ్యవృత్తిదారులతో పాటు 16 మిలియన్ మహిళలు, బాలికలు లైంగిక అక్రమ రవాణాకు గురవుతున్నారని రాయిటర్స్ అధ్యయనం తెలిపింది. లీగల్ సర్వీసుల ప్రకారం దేశంలో ప్రతీ గంటకు నలుగురు బాలికలు వ్యభిచార రొంపిలోకి ప్రవేశిస్తుండగా.. అందులో ముగ్గురు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పనిచేస్తున్నారని తేలింది. కాగా పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన దాదాపు 200 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మూడింట ఒక వంతు మహిళలే కావడం గమనార్హం.
ఈ కేసుల్లో 50 శాతం ముద్దాయిలు 25 -45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే.
ప్రతికూలంగా సుదీర్ఘ విచారణ..
కాగా ఏపీలోని హెల్ప్, వెస్ట్‌లోని గోరన్‌బోస్ గ్రామ్ బికాష్ కేంద్రం(GGBK)తో పాటు అనేక సంస్థలతో కలిసి పనిచేసిన స్నిగ్ధా సేన్ అనే పరిశోధకురాలు.. మానవ అక్రమ రవాణా కేసుల గురించి పలు విషయాలు వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో సంబంధిత కేసుల్లో 429 మంది అనుమానితుల పేర్లను పరిశీలించగా.. 198 కేసుల్లో ఒక ట్రాఫికర్ మాత్రమే దోషిగా నిర్ధారించబడినట్లు ఆమె తెలిపింది. ఈ సమస్య నుంచి ప్రాణాలతో బయటపడ్డవారికి చట్టపరమైన సహాయం లేకపోవడం, సుదీర్ఘ విచారణ కారణంగా ట్రాఫికర్లు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. ఇక ట్రాఫికర్లలో ఎక్కువ మంది (34 శాతం) ఇరుగు పొరుగువారే కాగా, విముక్తులైన 31% శాతం మందికి ట్రాఫికర్స్ ఎవరనేది తెలియదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2016 క్రైమ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. 1,100 అక్రమ రవాణా కేసులు నమోదు కాగా 2018లోగా ఈ సంఖ్య 2278కి చేరింది. ఇదే క్రమంలో వరుసగా 2019లో 2208, 2020లో 1714 కేసులు నమోదయ్యాయి. ఇక 21% కుటుంబాలు ఆర్థిక బలహీనత కారణంగా పిల్లలను బాల కార్మికులుగా పంపేందుకు సిద్ధంగా ఉన్నాయని కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ నిర్వహించిన సర్వే తెలిపింది.
లాక్‌డౌన్ సడలింపుతో పెరిగిన అక్రమ రవాణా..
2020లో పాండమిక్ పరిస్థితులు పేదరికానికి దారితీయడంతో ప్రపంచవ్యాప్తంగా 500,000 పైగా బాలికలకు బలవంతపు పెళ్లిళ్లు జరిగాయని ‘సేవ్ ది చిల్డ్రన్’ అంచనా వేసింది. జూన్, జూలైలో లాక్‌డౌన్ సడలించినప్పుడు బాల్య వివాహాల సంఖ్య పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఇది 17% పెరిగింది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్.. TVPA (విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అండ్ వయొలెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్, 2000) ప్రకారం ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ (టీఐపీ) రిపోర్ట్‌లో ప్రతీ దేశానికి నాలుగు అంచెల్లో ర్యాంక్ ఇస్తుంది. ఇటువంటి ర్యాంకింగ్స్ ఒక దేశంలో నెలకొన్న సమస్య తీవ్రతపై కాకుండా మానవ అక్రమ రవాణా నిర్మూలనకు TVPA కనీస ప్రమాణాలు నెరవేర్చే ప్రభుత్వ ప్రయత్నాల మేరకే ఉంటాయి. ఇవి సాధారణంగా పలెర్మో ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉంటాయి. కాగా భారత్ విషయానికొస్తే 2021లోనూ టైర్ 2లో నిలకడగా కనిపించింది.
భారతదేశంలో నెలకొన్న విస్తృతమైన పేదరికం, సరైన విద్య లేకపోవడం, మానవ హక్కుల ఉల్లంఘనలు మానవ అక్రమ రవాణాకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్.. లైంగిక దోపిడీ కోసం అక్రమంగా రవాణా చేయబడిన మహిళలు, బాలికలకు గమ్యస్థానంగా మారుతోంది. బాధితుల్లో 80శాతం కంటే ఎక్కువ మంది స్త్రీలు, 50 శాతంకు పైగా పిల్లలు ఉండగా… ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసి వర్గాలకు చెందిన వారే బాధితులుగా ఉన్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. అదే సమయంలో విదేశాలకు వెళ్లే కార్మికులు సైతం ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కోరల్లో చిక్కుకుపోయి జీవితాలను బలి చేసుకుంటున్నారని వివరిస్తున్నాయి.