‘జో’పావురం వేటలో ఆసీస్

by Shyam |
‘జో’పావురం వేటలో ఆసీస్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నుంచి ఇంకా తేరుకోకముందే ‘బర్డ్ ఫ్లూ’ భయాలు మొదలయ్యాయి. కోళ్లతో పాటు, అనేక పక్షులూ మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ పావురం అమెరికా బార్డర్ క్రాస్ చేసి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. దాని వల్ల బయోడైవర్సిటీ రిస్క్‌లో పడనుందని, వెంటనే ఆ పావురాన్ని పట్టుకుని చంపేయాలని ఆస్ట్రేలియా ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు.

బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకు అంతగా ప్రమాదం లేకపోయినా, కొవిడ్ మాదిరిగానే బర్డ్ ఫ్లూ కూడా పక్షుల్లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో పక్షిజాతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశంఉంది. వేలాది పక్షులు మరణించొచ్చు. ఈ విషయమై అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. అమెరికాకు చెందిన ‘జో’ అనే రేసింగ్ పావురం, ఓరేగావ్‌లో గతేడాది అక్టోబర్ 29 నుంచి కనిపించకుండా పోయినట్లు అమెరికా పావురాల రేసింగ్ యూనియన్ తెలిపింది. అది అమెరికా నుంచి 13వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆస్ట్రేలియా చేరినట్లు ఆఫీసర్లు గుర్తించారు. అమెరికా నుంచి వచ్చిన ఆ పావురం వల్ల ఆస్ట్రేలియాలో ప్రమాదకర వైరస్‌(ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా, న్యూకాజిల్ డిసీజ్, పీజియన్ పారామిక్సోవైరస్ టైప్ 1 (పిపిఎంవి -1) ఇన్ఫెక్షన్, ఏవియన్ పారామిక్సోవైరస్ టైప్ 3 (ఎపిఎంవి -3) ఇన్ఫెక్షన్ , ఈక్విన్ వైరల్ ఎన్సెఫలోమైలిటిస్)లు వ్యాపించే అవకాశం ఉందని, దేశ పౌల్ట్రీ పరిశ్రమకు, ఇక్కడి పక్షిజాతుల ఆరోగ్యానికి ప్రత్యక్ష ముప్పు ఉందని ఆస్ట్రేలియా అధికారులు భావిస్తున్నారు. దాన్ని చంపేయడమే శ్రేయస్కరం అనే నిర్ణయానికి వచ్చారు.

మెల్‌బోర్న్‌కు చెందిన కెవిన్ సెల్లి అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో ఇటీవలే ఓ విదేశీ పావురాన్ని చూడగా అది చాలా నీరసించి ఉండటాన్ని అతను గమనించాడు. అదే పావురం మళ్లీ రెండో రోజూ రావడంతో ఆ పావురాన్ని పరిశీలించగా దాని కాలుకు ఏదో (యూఎస్ ఐడెంటిఫికేషన్ బ్యాండ్) ట్యాగ్ ఉండటం గమనించాడు. అధికారుల ప్రకటనతో వాళ్లు వెతుకుతున్న పక్షి ఇదేనని కెవిన్ నిర్ధారణకు వచ్చి..అధికారులకు సమాచారం అందించాడు. దాన్ని చంపడానికి సాయం చేయాల్సిందిగా అధికారులు కెవిన్‌ను కోరారు. కానీ, అది మళ్లీ కనిపించకుండా పోయింది. అయితే పావురాన్ని చంపేయాలనే నిర్ణయాన్ని పక్షి ప్రేమకులు, పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed