అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నువ్వా-నేనా!

by Anukaran |   ( Updated:2020-11-04 11:10:50.0  )
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నువ్వా-నేనా!
X

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్‌ల మధ్య స్వల్ప తేడాతో ఊపిరిసల్పని ఉత్కంఠను రేపుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభంలో ఆధిక్యతను ప్రదర్శించిన జో బైడెన్ మధ్యలో కాస్త వెనుకబడ్డారు. అనూహ్యంగా దూసుకొచ్చిన డొనాల్డ్ ట్రంప్ టెక్సాస్, ఫ్లోరిడాలాంటి కీలక రాష్ట్రాలను కైవసం చేసుకున్నారు.

సాయంత్రానికి మళ్లీ బైడెన్ లీడ్‌లోకి వచ్చారు. అరిజోనాలో గెలుపును నమోదుచేసుకున్న బైడెన్ మళ్లీ దూసుకెళ్లారు. కడపటి సమాచారం అందే సమయానికి ఇద్దరి మధ్య ఓట్లల్లో రెండు శాతం తేడా మాత్రమే ఉన్నది. అమెరికా మీడియా సంస్థల ప్రకారం బైడెన్ 238 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లను గెలుపొందారు. అధ్యక్ష పీఠానికి 270 మ్యాజిక్ ఫిగర్. మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 538.

మెయిల్ ఇన్ ఓట్లు

ది అసోసియేట్ ప్రెస్ అంచనాల ప్రకారం, ట్రంప్, బైడెన్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నది. దీంతో కీలక రాష్ట్రాలుగా ఉన్న విస్కాన్సిన్, మిచిగాన్, నెవాడా, పెన్సిల్వేనియాల ఫలితాలపైకి దృష్టి మళ్లింది. ఈ రాష్ట్రాల ఫలితాలే అధ్యక్షుడిని ఖరారు చేయనున్నాయి. వీటితోపాటు మెయిల్ ఇన్ ఓట్లూ కీలక పాత్ర పోషించనున్నాయి. సాధారణంగా మెయిల్ ఇన్ ఓట్లు డెమోక్రాట్లకు అనుకూలంగా ఉంటూ వస్తున్నాయి. అందుకే హోరాహోరీ పోరులో మెయిల్ ఇన్ ఓట్లు విజయ తీరానికి చేరుస్తాయ డెమోక్రాట్లు విశ్వసిస్తున్నారు.

ఇదిలా ఉండగా తర్వాతి రోజు మెయిల్ ఇన్ ఓట్ల లెక్కింపును ట్రంప్ సవాల్ చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకెక్కునున్నట్టు హెచ్చరించారు. ఒకవేళ లెక్కింపును నిలిపేయడానికి యత్నిస్తే దాన్ని అడ్డుకోవడానికి న్యాయ బృందాన్ని సిద్ధంగా పెట్టుకున్నట్టు బైడెన్ తెలిపారు.

24 ఏళ్ల తర్వాత డెమోక్రాట్లకు అరిజోనా

గత ఆరు ఎన్నికల్లో ఎప్పుడూ రిపబ్లికన్‌లనే గెలిపించిన అరిజోనా ఈ సారి డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్‌కు పట్టం కట్టింది. 24 ఏళ్లలో తొలిసారిగా డెమోక్రాట్ అభ్యర్థి ఇక్కడ గెలుపొందారు. 72 ఏళ్లలో డెమోక్రాట్ అభ్యర్థి అరిజోనాలో గెలుపొందడం రెండోసారి. 1948లో హారీ ఎస్ ట్రూమన్ గెలిచిన తర్వాత చివరిసారిగా 1996లో బిల్ క్లింటన్ గెలిచారు. తాజాగా, బైడెన్ ఈ రాష్ట్రంలో విజయాన్ని పొందారు. అలాగే, అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోనూ బైడెన్ విజయపతాకాన్ని ఎగరేశారు.

Advertisement

Next Story

Most Viewed