- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోకోణం : హుజూరాబాద్ ఓటెవరికి!?
రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8వరకు నామినేషన్లకు గడువు ఉండగా, 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఫలితంగా జరుగుతున్న ఈ ఉపఎన్నిక అటు సీఎం కేసీఆర్‌కు, ఇటు బీజేపీలో చేరిన ఈటలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పక్కా రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్, ఆయన తనంతట తానే పార్టీ నుంచి వైదొలగేలా, ఎమ్మెల్యే పదవిని వదులుకునేలా చేయగలిగారు. ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. కేసులు.. బెదిరింపుల మధ్య కొత్త పార్టీ ఆలోచనను పక్కన పెట్టిన ఈటల చివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులను ఆశ్రయించారు.
కాగా, మోడీ ప్రభుత్వ సహకారంతో హుజూరాబాద్‌లో జూలై-ఆగస్టుల్లోనే ఉపఎన్నిక జరుగుతుందని, నియోజకవర్గంలో ఈటల వైపు తీవ్ర సానుభూతి పవనాలున్నాయి కనుక ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే, ఏ కారణం వల్లనో అలా జరగలేదు. మమతా బెనర్జీ పోటీచేసే భవానీపూర్ సహా బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లోని నాలుగు సీట్లకు కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) ఎన్నికల షెడ్యూలును ప్రకటించినా అందులో హుజూరాబాద్‌ను చేర్చకపోవడం అందరినీ ఆశ్చర్యపరచింది. నెల తర్వాత అకస్మాత్తుగా ఇప్పుడు ఎన్నికలు ప్రకటించడంలో మతలబేమిటంటూ చర్చలు కూడా మొదలయ్యాయి.
ఈసీ తన నిర్ణయాలను ప్రకటించిన రెండు సందర్భాల్లోనూ కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. మోడీ-షా ద్వయంతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ విషయంపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఈటల రాజీనామా చేసిన క్షణం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపుపై కన్నేసిన గులాబీ అధినేత అక్కడ అనేక దఫాలుగా సర్వేలు నిర్వహించారని, మొగ్గు రాజేందర్ వైపే ఉండడంతో ఢిల్లీకి వెళ్లి చక్రం తిప్పారని, పోలింగ్ వాయిదా వేయించారని చాలా మంది భావించారు. ఉపఎన్నిక ఇప్పట్లో జరగదని, దసరా-దీపావళి పండగల తర్వాతే షెడ్యూలు వెలువడుతుందన్న వార్తల నేపథ్యంలో ఈటల క్యాంపు బాగా డీలా పడింది.
మోకాలి నొప్పితో పాదయాత్రను సగంలో ఆపేసిన మాజీ మంత్రి ఒంటరిగానే గ్రామాలు తిరుగుతున్నారు. మీడియాలోనూ ఆయన హడావుడి తగ్గింది. ఎప్పుడు జరుగుతాయో తెలియని ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఖర్చు పెట్టుకుంటూ పోతే భారం తడిసి మోపెడవుతుందని కూడా ఆయన భావించారని తెలిసింది. ఇక, బీజేపీ రాష్ట్ర కీలక నేతలెవరూ ఇప్పటివరకూ అక్కడికి వెళ్లింది లేదు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఇద్దరూ హుజూరాబాద్ బయటే పాదయాత్రలు చేశారు. స్థానిక కమలదళం కూడా ఈటల బలగంతో అంటీముట్టనట్లుగానే ఉంటోందని సమాచారం.
ఇదే అదునుగా అధికార టీఆర్ఎస్ విజృంభించింది. ఎంత ఖర్చయినా సరే.. ఈటలను ఒక్క ఓటు తేడాతోనైనా ఓడించాల్సిందేనన్న అధినేత ఆదేశాలతో ప్రచార ఊపును ముమ్మరం చేసింది. ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు అక్కడే మకాం వేసి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈటల వర్గానికి చెందిన అనేక మంది స్థానిక నేతలను నయానో భయానో లోబర్చుకుని పార్టీలో చేర్చుకున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర చిన్నా పెద్ద నేతలు పల్లెలు, పట్టణాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ 100 మంది ఓటర్ల ప్రాతిపదికన ఒక ఇన్చార్జిని నియమించి ఇంటింటా తిరుగుతున్నారు. మరోవైపు, దళితబంధు పథకం అమలై అనేక మంది ఎస్సీ కుటుంబాలకు రూ. పది లక్షలు బ్యాంకు అకౌంట్లలో పడ్డాయి. ఆ సొమ్ముతో పలువురికి కార్లు, ట్రాక్టర్ల వంటి వాహనాలు సమకూరాయి. కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ప్రధాన రహదారులన్నీ తళతళా మెరుస్తున్నాయి. ఊరూరా సీసీ రోడ్లు వేస్తున్నారు. డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. పెండింగ్ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో హుజూరాబాద్ ఎన్నికల నగారా మోగింది. బహుశా ఇటీవలి సర్వేల్లో ఓటర్ల మొగ్గు టీఆర్ఎస్ వైపుందని తెలిసే కేసీఆర్ మరోసారి ఢిల్లీ పెద్దలను కలిశారని, ఫలితంగానే షెడ్యూలు వెలువడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు నిజమేనా? ఇప్పుడు పోలింగ్ జరిగితే ఎవరికి లాభం? వాస్తవంగా అక్కడ టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి ఉందా? అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ఓట్లు రాల్చుతుందా? ఈటల పరిస్థితి ఏమిటి? సానుభూతి పవనాలు ఆయనను గెలిపిస్తాయా? ఇవన్నీ వెంటనే సమాధానం దొరకని ప్రశ్నలు. అయితే, ఆ నియోజకవర్గ ఓటర్లను పలకరిస్తే మాత్రం మనం కొన్ని విషయాలను పోలింగ్‌కు ముందే పసిగట్టవచ్చు.
1. ఇరవై ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని తెలంగాణ సాధన కోసం ఊరూరా ఉద్యమాలు చేసి ప్రతి ఇంటితోనూ ఈటల కనెక్ట్ అయి ఉన్నారు. అప్పటిదాకా కేసీఆర్‌కు కుడిభుజంగా ఉన్న ఆయన కేటీఆర్‌ను సీఎం చేయడాన్ని వ్యతిరేకించడంతోనే కావాలని బలిపశువును చేసి బయటకు పంపారనే టాక్ జనంలో విస్తృతంగా ఉంది. అధికార మీడియాలో భూకబ్జా ఆరోపణలు చేసి వేధించడంతోనే ఆయన టీఆర్ఎస్‌ను వదిలారనే సానుభూతి పవనాలున్నాయి.
2. ఈటలకు కూడా వందలాది ఎకరాల భూములు, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నా అందరూ ఆ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. రాజకీయ నాయకుల్లో సంపాదించుకోని వాళ్లెవరంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం కూడా ఆస్తులు పెంచుకుంటోంది కదా అంటున్నారు. ఈటల ఎదురు తిరగకుండా లొంగిపోయి ఉంటే ఈ ఆరోపణలు వచ్చేవి కావని బల్లగుద్ది చెబుతున్నారు.
3. హుజూరాబాద్ ఉపఎన్నికే టార్గెట్‌గా కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు ఎస్సీ ఓటర్లను అధికార పార్టీ దరికి చేరుస్తుందా.. అంటే ఎవరూ నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. ఓ యాభై శాతం పడుతాయనుకున్నా ఈ పథకం కారణంగా అంతకంటే ఎక్కువే బీసీల ఓట్లను కోల్పోయే ప్రమాదముందనే భావన ఉంది.
4. గత ఏడేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీగా ప్రజల్లో ఉండే ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం నియోజకవర్గంలో అంతగా కనిపించడం లేదని, ఇటీవల ఊరూరా చేపట్టిన అభివృద్ధి పనులు ఇందుకు కారణం కావచ్చునంటున్నారు.
5. హరీశ్‌రావు రంగంలోకి దిగాక పరిస్థితి మారిందంటున్నారు. గ్రామగ్రామాన తిరుగుతూ ఈటల అనుచరులను బుట్టలో వేసుకోవడంలో ఆయనకున్న టాలెంట్‌ను పార్టీ కేడర్ మెచ్చుకుంటున్నారు. ప్రచారసభల్లోనూ ప్రజలను బాగా కన్విన్స్ చేస్తున్నారని, పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ ఆయన దిట్ట అని గుర్తు చేస్తున్నారు.
6. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరి ఓట్లను ఎక్కువ చీల్చుతారనే విషయం కూడా గెలుపులో కీలకమే. మామూలుగా అయితే అధికార పార్టీకే నష్టం ఎక్కువ అనే అభిప్రాయం ఉన్నా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కనుక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఈటలకు దెబ్బ అంటున్నారు. ఎస్సీ నిలబడితే టీఆర్ఎస్, బీసీ బరిలో నిలుస్తే ఇరుపార్టీల ఓట్లూ చీలుతాయని చెబుతున్నారు.
7. నియోజకవర్గంలో నక్సలైటు ఉద్యమ సానుభూతిపరులు, మాజీ మిలిటెంట్లు ఎక్కువ. చిరకాలంగా వీళ్లు ఈటల వెంటే ఉన్నా ఇప్పుడాయన బీజేపీ నుంచి పోటీ చేస్తుండడంతో డోలాయమాన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ వీళ్లు తమ వైఖరిని తేల్చుకోలేదని, చివరిక్షణంలో ఎవరి వైపు మొగ్గు చూపుతారోననే ఉత్కంఠ కొనసాగుతోంది.
చివరగా, ఈ ఉపఎన్నికలో ప్రలోభాల ప్రభావం గురించి చెప్పాలి. ఉపఎన్నిక జరగడం ఖాయమని తెలిసిన నాటి నుంచి నియోజకవర్గ పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. రాత్రయితే చాలు.. గుంపులు గుంపులుగా కార్యకర్తలు ఒక్కచోట చేరుతున్నారు. విందుల్లో మునిగిపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధుల సారథ్యంలోనే ఈ తతంగం జరుగుతుండడంతో పోలీసులు సహా ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఈ కార్యక్రమాల కోసం ప్రతి సర్పంచుకూ రోజుకు కొంత మొత్తాన్ని ఓ పార్టీ అందజేస్తుంటే.. మరోపార్టీ ఊరూరా గతంలోనే డబ్బులు డంప్ చేసిందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీలు వందలాది కోట్ల రూ.లు ఖర్చు చేశాయని, పోలింగ్‌కు ముందు నోట్ల జాతర జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని నాకు తెలిసిన చాలా మంది మిత్రులు చెప్పారు.
పార్టీలు వెదజల్లే నోట్లకు ఓటర్లు అంత సులువుగా లొంగిపోతారా? ఇరుపక్షాల నుంచీ డబ్బులు తీసుకుని చివరకు ఎవరికి ఓటేస్తారు? ఇవీఎం వద్దకు వెళ్లినప్పుడు వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వారికే వేస్తారా? తమ మనస్సాక్షి ప్రకారం నడుచుకుంటారా? ఈటల గెలుస్తారా? కేసీఆర్ పంతం నెగ్గుతుందా? ఈ ప్రశ్నలకు మాత్రం ఎవరి వద్దా సరైన సమాధానం లేదు. మీ వద్ద ఉందా..?