వ్యాక్సిన్ వినియోగానికి మరో రెండేండ్లు? : WHO

by vinod kumar |
వ్యాక్సిన్ వినియోగానికి మరో రెండేండ్లు? : WHO
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నివారణకు అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌లు ప్రపంచ జనాభాలో 60 నుంచి 70 శాతం మంది ప్రజలకు చేరేందుకు మరో రెండేళ‍్ల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కట్టడికి దాదాపు 40 వ్యాక్సిన్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని, వాటిలో 9 వ్యాక్సిన్లు రెండు, మూడవ దశ పరీక్షలను చేపడుతున్నాయన్నారు. కీలక దశ వ్యాక్సిన్‌ పరీక్షలను చేపడుతున్న కంపెనీలు పరీక్షల్లో వెల్లడైన అంశాలను ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రచురిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలో 60 నుంచి 70 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్‌ అందడానికి రెండేళ్ల సమయం పడుతుందని చెప్పుకొచ్చారు.

2022 ఏడాదిలో మనం ఈ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లు భారత్‌తో సహా పలు దేశాల్లో కొన్ని డాలర్లకే అందుబాటులో ఉంటాయని సౌమ్య స్వామినాథన్‌ చెప్పారు. రానున్న శీతాకాలంలో వైరస్‌ బారినపడకుండా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపరుచుకోవడం, గుమికూడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితి కొంతమేర మెరుగవడం ఊరట కలిగిస్తోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు ఆగస్ట్‌ తర్వాత మంగళవారం అతి తక్కువగా నమోదవడమే కాకుండా, మరణాల సంఖ్య కూడా 900 మార్క్‌ దిగువకు పడిపోయిందని అధికారులు వివరించారు. మరో రెండు వారాల పాటు కేసుల సంఖ్య తగ్గడం కొనసాగితే భారత్‌ కోవిడ్‌-19 ముమ్మర దశను అధిగమించినట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed