కరోనాను రాజకీయం చెయ్యొద్దు : డబ్ల్యూహెచ్‌వో

by vinod kumar |
కరోనాను రాజకీయం చెయ్యొద్దు : డబ్ల్యూహెచ్‌వో
X

కరోనా మహమ్మారి విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అథనోమ్ అన్నారు. డబ్ల్యూహెచ్‌వో చైనా పట్ల పక్షపాత వైఖరి చూపుతోందని.. ఆ దేశానికి తొత్తుగా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలపై టెడ్రోస్ స్పందించారు. డబ్ల్యూహెచ్‌వోకు జాతి, కుల, మత, వర్ణ బేధాలు ఉండవని.. అందరం కలసి కరోనా మహమ్మారిని ఎదుర్కుందామని ఆయన అన్నారు. ట్రంప్ డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపేస్తామన్న హెచ్చరికపై టెడ్రోస్ స్పందిస్తూ.. ‘మేం ప్రతీ ఒక్క దేశానికి ఆత్మీయులం. మా సంస్థలకు వర్ణాంధత్వం ఉంది.. రంగులతో మాకు పని లేదు అని వ్యాఖ్యానించారు. మా సంస్థ తరపున నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి జాతీయ సమైక్యత పాటించడం, రెండోది ప్రపంచ సంఘీభావం’ అని అన్నారు. ఈ కరోనా క్లిష్టపరిస్థితుల్లో దేశాల అధ్యక్షులు రాజకీయం చేయడం మాని అంతర్జాతీయ ప్రయోజనాల కోసం కృషి చేయాలని హితవు పలికారు. ఈ సమయంలో కలసి నడవని దేశం ఎంత గొప్పదైనా కష్టాల్లో పడుతుందని ఆయన అమెరికాను పరోక్షంగా హెచ్చరించారు. దేశాల మధ్య ఉండే విభేదాలను ఈ సమయంలో పక్కన పెట్టకపోతే కరోనా మరింతగా విజృంభించే అవకాశం ఉందని టెడ్రోస్ స్పష్టం చేశారు. మరోవైపు యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రాస్ కూడా డబ్ల్యూహెచ్‌వోకు బాసటగా నిలిచారు. ప్రపంచ దేశాలు కరోనాను గెలవాలంటే డబ్ల్యూహెచ్‌వోకు సహాయం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, ఈ రోజు (గురువారం) యూఎన్ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. దీనిలో చైనా, అమెరికా మధ్య నెలకొన్న వివాదం గురించి అనధికార చర్చ జరిగే అవకాశం ఉంది.

Tags: UN, WHO, nailed, US, behave, dire consequences, impartial, china

Advertisement

Next Story

Most Viewed