'WHO’ ఈజ్ రెస్పాన్సిబుల్?

by sudharani |   ( Updated:2020-03-27 06:33:30.0  )
WHO’ ఈజ్ రెస్పాన్సిబుల్?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పు చేసిందా? కరోనా వల్ల ఇంతటి అల్లకల్లోలం జరగడానికి కారణం ప్రపంచపు అత్యున్నత ఆరోగ్య సంస్థేనా? ప్రపంచ ఆరోగ్యాన్ని తన చేతుల్లో పెడితే… ఏకపక్షంగా వ్యవహరించి నమ్మకాన్ని వమ్ము చేసిందా? బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిందా? అంటే ఔను అనే అంటున్నాయి అన్ని దేశాలు. ప్రపంచ ప్రజలంతా సోషల్ మీడియాలో ఇదే చెప్తున్నారు. కేవలం అంటే కేవలం డబ్ల్యూహెచ్ఓ చేసిన తప్పు వల్లే ఇన్ని మరణాలు సంభవించాయని… యముడు విలయతాండవం చేశాడని మండిపడుతున్నారు.

చైనాలోని వూహాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలోనే డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం కావాల్సిందని.. కానీ ఏమీ పట్టనట్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్‌పై ప్రపంచ దేశాలు ప్రశ్నించినా… చైనాలో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ జరిగాయని … కరోనా మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే వైరస్ కాదని జనవరి 14న ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్ సంక్రమిస్తుందన్న అపోహతో వర్తక, వ్యాపారాలను అదుపుచేయొద్దని దేశాలకు సూచించారు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెయెసస్. ప్రయాణ నిబంధనలు విధిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని … కరోనా వల్ల కాకుండా నిబంధనల వల్లే నష్టం అధికంగా ఉంటుందని ఫిబ్రవరి 1న వెల్లడించారు. దీంతో దేశాలన్నీ కరోనాను ముప్పుగా పరిగణించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థే చెప్పింది కదా అని… ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాయి. కానీ… అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేవలం రెండు అంటే రెండు నెలల్లో ప్రపంచంలో మరణమృదంగం మోగింది. 165 దేశాల్లో మృత్యువు విలయ తాండవం చేసింది. ఏమి జరుగుతుంది… ? అసలు ఏం చేయాలి? దేశ ప్రజలను ఎలా రక్షించుకోవాలో తెలియని కొన్ని దేశాలు కన్నీళ్లు కూడా పెట్టుకున్నాయి. అప్పుడు కానీ… కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించలేకపోయింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

పైగా ఈ విషయాన్ని వెల్లడించేందుకు డబ్ల్యూహెచ్ఓ అధికారులు చాలానే కష్టపడ్డారు. కారణం వారి నిర్లక్ష్యం వల్లే ప్రపంచ దేశాల రాజకీయ, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినబోతోందని. కానీ అప్పటికి కూడా నిర్లక్ష్య ధోరణిలో ఉంటే మరింత ముప్పువాటిల్లే ప్రమాదం ఉండడంతో…. కక్కలేక మింగలేక మార్చి 12న ప్రకటన చేసింది. అప్పటికే దాదాపు లక్షా 21వేల మంది కరోనా బారిన పడ్డారు. చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్లక్ష్యం, నిస్సహాయత వల్ల ఇతర దేశాలకు 13 రెట్ల వేగంతో ఈ మహమ్మారి వ్యాప్తి చెందింది. ఆ తర్వాత చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు చేతులు శుభ్రం చేసుకోండి.. సామాజిక దూరం పాటించండని సూచనలిచ్చింది.

అందుకే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇలాంటి సంస్థకు చరమగీతం పాడడమే సరైనది అంటున్నారు. చైనా వరల్డ్ బయో టెర్రిరిస్ట్‌గా మారిందని కళ్లకు కట్టినట్లు కనపడుతున్నా… డబ్ల్యూహెచ్ఓ సపోర్ట్ చేస్తుందని బాధిత ప్రజలు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఇంత మంది ఉసురు తీసుకున్న మీ సంస్థ ప్రపంచానికి అవసరమే లేదంటూ… #WHOLiedPeopleDied పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

కోవిడ్ 19 వ్యాధి కారణంగా కరోనా వైరస్ పుట్టిన చైనా దేశంలో కాకుండా అత్యధికంగా మరణాలు సంభవించింది ఇటలీలోనే. అత్యధిక కేసులు నమోదైంది అమెరికాలో. దీంతో చైనాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థపై పలు ఆరోపణలు చేశారు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్. కరోనా విజృంభణకు చైనాతో పాటు ఆ దేశానికి వత్తాసు పలుకుతున్న డబ్ల్యూహెచ్ఓ సంస్థలే కారణమని మండిపడ్డారు. కరోనా వైరస్ విషయంలో తొలి నుంచి చైనా ప్రపంచ దేశాలను మోసం చేస్తూనే ఉందన్నారు. ఈ విషయంలో పలు దేశాలు అసంతృప్తి వ్యక్తం చేయగా… చైనాతో సంబంధాలు తెంచుకునేందుకు సిద్ధం అయ్యాయి. కరోనా కల్లోలం నుంచి బయటపడ్డాక ఓ నిర్ణయానికి వచ్చేలా ఉన్నాయి.

Tags : CoronaVirus, Covid19, WHO, China, America, India

Advertisement

Next Story