- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నీరజ్’ను ఆకాశానికి ఎత్తేసి.. రెండు స్వర్ణాల హీరోను మరుస్తారా..?
దిశ, ఫీచర్స్ : 121 ఏండ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై ప్రశంసలు వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే నీరజ్ చోప్రా పసిడి పతకాన్ని అందుకున్న రోజుకు గుర్తింపుగా.. ఇకపై ప్రతి ఏటా ఆగస్ట్ 7వ తేదీని జావెలిన్ త్రో దినోత్సవంగా (Javelin Throw Day) జరుపుకోనుండగా, భారత్ మరో అద్భుత జావెలిన్ త్రో క్రీడాకారుడ్ని మరిచిపోయింది. ఇప్పటికే రెండు స్వర్ణ పతకాలు అందుకుని, టోక్యో పారా ఒలింపిక్స్‌లో మూడో గోల్డ్ ఒడిసిపట్టుకునేందుకు కదులుతున్న ఆ ఇండియన్ ఆటగాడే దేవేంద్ర జజారియా.
రాజస్థాన్‌కు చెందిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జజారియా రెండు పారా ఒలింపిక్ స్వర్ణ పతకాలు(ఏథెన్స్, రియో) సాధించిన భారతదేశ ఏకైక అథ్లెట్. కాగా ప్రస్తుతం టోక్యో క్రీడల కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ 40 ఏళ్ల ట్రాక్ అథ్లెట్ జీవితంలో ఊహించలేని సవాళ్లు ఉన్నప్పటికీ ఆటలో తన ప్రతిభతో యావత్ భారతావణి మురిసిపోయేలా పతకాలు సాధించాడు. జావెలిన్ త్రోలో 62.15 మీటర్లతో ప్రపంచ రికార్డ్ కలిగి ఉండగా, ప్రతిష్టాత్మక పద్మశ్రీ పొందిన మొదటి పారా అథ్లెట్‌గానూ దేవేంద్ర గుర్తింపు పొందాడు. క్రీడా రంగంలో ఆయన చేసిన కృషికిగానూ 2004లో అర్జున అవార్డు కూడా లభించింది. ఒంటి చేతితోనే ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవేంద్ర ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
విషాదం-విజయం..
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో రైతు కుటుంబంలో జన్మించాడు. ఎనిమిది ఏళ్ల వయస్సులో చెట్టు ఎక్కుతుండగా 11వేల వోల్ట్ కేబుల్‌ను తాకడంతో తన ఎడమచేయిని కోల్పోయాడు. అయినా ఆ ఒంటి చేత్తోనే ప్రతిరోజూ పాఠశాల క్రీడా మైదానాల్లో గేమ్స్ ప్రాక్టీస్ చేసేవాడు. వెదురు బొంగుతో జావెలిన్‌ను తయారుచేసి సాధన చేశాడు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా, కష్టాలు వెక్కిరిస్తున్నా వెనక్కి తగ్గలేదు. అలా టోక్యో క్రీడలకు అర్హత సాధించే క్రమంలో అతడు తన సొంత రికార్డును అధిగమిస్తూ 65.71 మీటర్లు జావెలిన్ విసిరి చరిత్ర సృష్టించాడు.
‘చేతులు, కాళ్లు లేని చాలా మందిని చూశాను. నా కుడి చేయి ఉండటం అదృష్టంగా భావించాను. ప్రపంచానికి బలహీనంగా కనిపించకుండా ఉండటానికి ప్రయత్నించాను. ఆటలో చాంపియన్‌గా నిలవాలని క్రీడలపై దృష్టి పెట్టాను. 10వ తరగతిలో జావెలిన్ త్రో ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తూ.. అతి తక్కువ సమయంలోనే ఓపెన్ కేటగిరీలో జిల్లా చాంపియన్ అయ్యాను. అలాగే నిరంతరాయంగా శిక్షణ తీసుకుంటూ జాతీయ, ప్రపంచస్థాయిలో విజయాలకోసం తీవ్రంగా శ్రమించాను. ఆ కృషికి ఫలితమే 2004 ఏథెన్స్, 2016 రియోలో బంగారు పతకాలు. టోక్యో కోసం కోచ్ సునీల్ తన్వర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాను. ఈసారి కూడా బంగారు పతకం సాధిస్తానని నమ్మకం ఉంది. అయితే మనదేశంలో పారా అథ్లెట్స్‌కు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. మీరు విదేశాలకు వెళితే, పారా అథ్లెట్‌ల కోసం మల్టీపర్పస్ స్టేడియమ్స్ ఉండగా, వీల్‌చైర్‌లో ఉన్న వ్యక్తులు ఎక్కడికైనా వెళ్లి ఏదైనా క్రీడ ఆడవచ్చు. కానీ ఇక్కడ అలాంటివి లేవు’