మరో నాలుగు రోజుల్లో విమానం.. విరాట్ కోహ్లీ ఎక్కడ?

by Anukaran |
Captain Virat Kohli
X

దిశ, స్పోర్ట్స్: వన్డే కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ మనసు తీవ్రంగా గాయపడినట్లే అనిపిస్తున్నది. సహచర క్రికెటర్ల పుట్టిన రోజులు కూడా గుర్తుపెట్టుకొని మరీ విష్ చేసే కోహ్లీ.. వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తే కనీసం సోషల్ మీడియాలో కూడా పలకరించలేదు. రోహిత్ కెప్టెన్ అయ్యాక తన బ్రాండ్ ప్రమోషన్, యువరాజ్ పుట్టిన రోజుకు సంబంధించిన పోస్టులు పెట్టిన కోహ్లీ.. బీసీసీఐ అధికారుల ఫోన్లు మాత్రం ఎత్తడం లేదు. మరో నాలుగు రోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటన కోసం విమానం ఎక్కాల్సి ఉండగా.. కోహ్లీ మౌనం బీసీసీఐ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నది. అసలు అతడు వస్తాడా? రాడా? కోహ్లీ మనసులో ఏముందో కూడా ఎవరికీ తెలియడం లేదు. సఫారీ పర్యటనకు వెళ్లనున్న టెస్టు జట్టు మొత్తం ముంబై చేరుకోగా.. కోహ్లీ మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండా పోయాడు. మూడు రోజుల క్వారంటైన్ కోసం ఆదివారమే అందరూ ముంబైలో సమావేశం కావల్సి ఉండగా.. కోహ్లీ తప్పా అందరూ చేరుకున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.

‘కోహ్లీ అందుబాటులో లేడు’

టెస్టు జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్, సపోర్టింగ్ స్టాఫ్ అందరూ ఆదివారం సాయంత్రానికి ముంబై చేరుకోవాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీసీసీఐ అధికారులు క్రికెటర్లకు ఫోన్లు చేసి చెప్పారు. అయితే కోహ్లీ ఫోన్ మాత్రం గత మూడు రోజులుగా స్విచ్చాఫ్ చేసి ఉండటంతో అధికారుల్లో కలవరం మొదలైంది. రోహిత్ శర్మ ఆదివారం సాయంత్రానికే టీమ్ఇండియా క్యాంపునకు చేరుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ కాస్త ఆలస్యంగా వస్తానని చెప్పి.. సోమవారం మధ్యాహ్నానికి ముంబై లోని హోటల్‌కు చేరుకొని నేరుగా క్వారంటైన్ అయ్యాడు. ఇక మిగిలిన క్రికెటర్లు అందరూ అందుబాటులోకి వచ్చారు. కోహ్లీ జాడ తెలియకపోవడంతో సెలెక్టర్లు కూడా రంగంలోకి దిగారు. కోహ్లీ పర్సనల్ ఫోన్‌తో పాటు అతడి మేనేజర్‌కు కూడా కాల్స్ చేశారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ అందుబాటులో రాలేకపోతున్నాడని అవతల నుంచి సమాధానం వచ్చినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే టీమ్ ఇండియా ముంబైలో ఆదివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. క్వారంటైన్ అయ్యే ఈ మూడు రోజులు కూడా ఇండోర్ ప్రాక్టీస్ చేయనున్నది. కానీ కెప్టెన్ లేకుండానే మిగతా ఆటగాళ్లు నెట్స్‌లో పాల్గొన్నారు.

ఈ రోజు వస్తాడా?

విరాట్ కోహ్లీ గత వారంలో ఆల్ ఇండియా సీనియర్ సెలెక్టర్ల సమావేశానికి కోచ్ ద్రవిడ్‌తో కలిసి పాల్గొన్నాడు. ఆ తర్వాత నుంచి అతడు ఎవరితోనూ టచ్‌లో లేకుండా పోయాడు. టీ20 వరల్డ్ కప్ ముందు తాను పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ వదిలేస్తున్నానని.. కొన్ని రోజలు విశ్రాంతి తీసుకొని టెస్టు, వన్డే కెప్టెన్‌గా బరిలోకి దిగుతానని చెప్పాడు. కోహ్లీ అంత క్లియర్‌గా చెప్పిన తర్వాత కూడా సెలెక్టర్లు అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు. దీన్ని మనసులో పెట్టుకొనే కోహ్లీ అందరికీ దూరమైనట్లు భావిస్తున్నారు. అయితే బీసీసీఐ అధికారి ఒకరు మాత్రం మంగళవారం కోహ్లీ జట్టుతో చేరతాడని చెప్పారు. సుదీర్ఘ పర్యటన కోసం దక్షిణాఫ్రికా వెళ్తుండటం వల్ల కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతోనే ఎవరితో టచ్‌లో లేకుండా పోయాడని సదరు అధికారి వెళ్లడించారు. రోహిత్ వర్మతో కోహ్లీకి ఎలాంటి ఇబ్బందులు లేవని.. వాళ్లిద్దరూ ప్రొఫెషనల్ క్రికెటర్లగా ఒకరంటే ఒకరికి గౌరవం ఉందని సదరు అధికారి అన్నాడు. వారి గొడవలు అన్నీ మీడియా వండిన కథనాలే అని చెప్పుకొచ్చాడు. కోహ్లీ మంగళవారం టీమ్‌తో పాటు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంటాడని ఆయన స్పష్టం చేశాడు.

Advertisement

Next Story