తెలంగాణలో లక్షల మంది చదువుకు దూరం.. వారి పరిస్థితి అంతేనా..?

by Anukaran |   ( Updated:2021-09-14 11:42:35.0  )
Residential Schools
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెసిడెన్షియల్ విద్యార్థులకు పాఠాలు వినే భాగ్యం కలుగడం లేదు. హాస్టళ్లకు మోక్షం లభించకపోవడంతో చదువులో వెనబడిపోతున్నారు. హైకోర్ట్ ఇచ్చిన వారం గడువు ముగిసి రెండు వారాలవుతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు మార్గదర్శకాలను విడుదల చేయలేదు. దీంతో రాష్ట్రంలో 910 గురుకులాల్లో, 475 కేజీబీవీల్లో, 55 డిగ్రీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న 6.82లక్షల మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ విధానంతో రెసిడెన్షియల్‌లోని ఇంటర్ విద్యార్థులకు పరీక్షల గండం ఏర్పడింది.

రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభించి 14 రోజులు గడుస్తున్నప్పటికీ రెసిడెన్షియల్ స్కూళ్ల విషయాన్ని ప్రభుత్వం తేల్చడం లేదు. కోర్టు ఇచ్చిన వారం రోజుల గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడలేదు.ఈ అంశంపై ఇప్పటి వరకు క్యాబినేట్ సమావేశం నిర్వహించడం కాని అభిప్రాయాలు సేకరించడం వంటి కార్యకలాపాలు చేపట్టలేదు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో తమ పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

6.82 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరం

ప్రభుత్వ అవలంభిస్తున్న విధానాలతో రాష్ట్రంలోని రెసిడెన్షియల్ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. పాఠశాల విద్యార్థులు ఫిజికల్ తరగతులకు హాజరవుతున్నప్పటికీ నాణ్యమైన బోధనలు అందడం లేదు. గ్రామాల్లోని విద్యార్థులకు నెట్ సదుపాయం లేకపోవడంతో ఆన్ లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నారు. రాష్ట్రంలో 910 గురుకుల్లో 5.4లక్షలు, 55 డిగ్రీ గురుకులాల్లో 49.5వేలు, 475 కేజీబీవీల్లో 87,097 మంది విద్యార్థులు మొత్తం 6.82 లక్ష మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. గురుకులాల్లో సీట్లను పొందేందుకు ప్రవేశ పరీక్షలో ప్రతిభను కనబర్చిన విద్యార్థులు ప్రస్తుతం విద్యా ప్రమాణాలను పూర్తిగా కోల్పోతున్నారు. కానీ చాలా కార్పొరేట్ విద్యాసంస్థల్లో 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ తరగతులను ఇప్పటికే ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయాలు వెలువడకపోయినా ఫిజికల్ తరగతులను నిర్వహిస్తున్నారు.

రెసిడెన్షియల్ విద్యార్థులకు ఇంటర్ పరీక్షల గండం

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తగిన ఏర్పాట్లను చేపట్టారు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఇంటర్ పరీక్షల గండం ఏర్పడింది. ఫిజికల్ తరగతులకు హాజరుకాని తాము ఆకస్మాత్తుగా నిర్వహించే పరీక్షలను ఎలా ఎదురుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫస్టియర్ సిలబస్ పై ఏ మాత్రం అవగాహన లేకుండా అధ్యాపకుల గైడ్ లైన్స్ లేకుండా, రివిజన్ తరగతులు, ప్రిపరేషన్ లేకుండా పరీక్షలను ఎలా ఎదుర్కొనాలనే అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తే రెసిడెన్షియల్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఘోరంగా పడిపోతుందని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిభ గల విద్యార్థులకు తీవ్ర అన్యాయం

ప్రభుత్వ విధానాలతో ప్రతిభగల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రవేశ పరీక్షలు రాసి సీట్లను సాధించిన విద్యార్థులు నేడు పూర్తిగా విద్యా ప్రమాణాలను కోల్పోతున్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోని 10, ఇంటర్, డిగ్రీ రెసిడెన్షియల్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలి. పరిస్థితులకు అనుగుణంగా మిగతా తరగతులను నిర్వహించాలి.
-మధుసూదన్ ఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ చైర్మన్

తిరోగామి దిశలో రెసిడెన్షియన్లు

గురుకులాలు, కేజీబీవీలు తిరోగామి దిశలో పయనిస్తున్నాయి. ఇప్పటి వరకు రెసిడెన్షియన్లను ప్రారంభించకపోవడం వలన కేజీబీవీల్లోని విద్యార్థులు పాఠశాలలకు తరలి వెళ్లిపోతున్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందనే సాకుతో ప్రభుత్వం కేజీబీవీ టీచర్లను మోడల్ స్కూళ్లకు బదిలీ చేస్తున్నారు. విద్యార్థులకు నష్టం వాటిల్లేలా నిర్ణయం తీసుకుంటున్నారు. వెంటనే రెసిడెన్షియన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించి, కోర్టు నుంచి అనుమతులను తీసుకోవాలి.
-శ్రీనివాస్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Next Story