- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఊహల్లో విశ్వనగరం ఊరిస్తూనే ఉంది’
దిశ, తెలంగాణ బ్యూరో : ‘విశ్వనగరం’ అనే మాట ఊహల్లో తప్ప కళ్లముందు కానరాదు.. దశాబ్దాలుగా ఊరిస్తూనే ఉంది.. ఎన్ని సర్కార్లు పోయినా.., ఎంత మంది ప్రజాప్రతినిధులు మారినా.., ఎక్కడ వేసిన గొంగళి అక్కడే తప్ప ఒక్క అడుగు ముందుకు పడింది లేదు.. ఆ పదం వినీవిని ప్రజలు విసిగిపోయే పరిస్థితి.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా నాయకుల వెంట వచ్చే మాటే తప్ప గెలిచిన తర్వాత ఆచరణకు నోచుకోని దౌర్భాగ్యం.. డల్లాస్, ఇస్తాంబుల్, సింగపూర్ వంటి నగరాల పేర్లు చెప్పి పబ్బం గడుపుకోవడం పార్టీలకు అలవాటుగా మారింది.. మెరుగుపడిన ఆ నగరాలను చూపించడమే కానీ, మహానగర పరిస్థితి మరింత ‘మురుగు’పడుతూనే ఉంది.
విశ్వనగరం చేస్తాం. డల్లాస్, ఇస్తాంబుల్ వంటి నగరాలుగా తీర్చిదిద్దుతాం. అనేక సదుపాయాలు కల్పిస్తాం.. అంటూ ప్రభుత్వాలు చేసిన ప్రకటనలు, రూపొందించిన ప్రతిపాదనలు అడుగు ముందుకు పడడం లేదు. ప్రపంచ నగరాలుగా పేరుగాంచిన టోక్యో, సిలికాన్ వ్యాలీ, సింగపూర్ వంటి నగరాల గురించి నాయకులు నిత్యం ప్రస్తావిస్తున్నారు. అత్యధిక వేగంతో రైల్వే లైన్లను వేసిన టోక్యో, హైటెక్ ఇండస్ర్టీస్తో విరాజిల్లుతోన్న సిలికాన్ వ్యాలీ 27 ఏండ్లల్లో సాధించిన ప్రగతి నివేదికను వివరిస్తున్నారు.
ఏ జీవజాలమూ మనుగడ సాధించలేనంత మురికిగా ఉండే సింగపూర్ నగరం సాధించిన అభివృద్ధి ఆదర్శమన్నారు. అక్కడికి బృందాలను పంపి అధ్యయనం చేసి వచ్చారు. దశాబ్ద కాలంలో ఆయా నగరాలు మరింత మహాద్భుతంగా మారాయి. కానీ మన నగరం మాత్రం ఎక్కడా అభివృద్ధి సాధించింది లేదు. కనీసం వర్షమొస్తే ముంపు నుంచి కాపాడుకునే వ్యవస్థను పునరుద్ధరించుకోలేక పోయామన్న విమర్శలు ఉన్నాయి. పైగా, లక్షల కుటుంబాలను ఆదుకునేందుకు చేసిన ‘సాయం’ పథకం అబాసుపాలైన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా ఆచరణ సాధ్యం కాని హామీలే మరోమారు ఎన్నికల ప్రచారంలో వినిపిస్తున్నాయి.
విసిగిన జనం..
విశ్వనగర ప్రతిపాదనలతో నగరవాసులు విసిగిపోయారు. మౌలిక సదుపాయాల కల్పన సరిపోద్దంటూ బదులిస్తున్నారు. చివరకు నాయకులపై నమ్మకాలు సన్నగిల్లి, తమ అవసరాలను లిఖితపూర్వకంగా రాయించుకునే పరిస్థితి దాపురించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే 17 మంది మంత్రులు, 85 మంది ఎమ్మెల్యేలు, 32 మంది ఎమ్మెల్సీలు, 14 మంది ఎంపీలు డివిజన్ కు ఒకరు చొప్పున ఇన్చార్జిలుగా వచ్చారు. మరి వరదలప్పుడు ఎందుకు రాలేదని అధికార పార్టీపై తిరుగుబాటు లేవనెత్తుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల వైఖరిని కూడా కడిగి పారేస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కన్నెత్తి చూడని నాయకులపై దుమ్మెత్తి పోస్తున్నారు.
13 పట్టణాలు ఉత్తవేనా…?
నగరం విస్తరిస్తోంది.. కొత్త అవాసాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరానికే తలమానికంగా మారిన ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ భవిష్యత్తు కేంద్రీకృతమవుతోంది. పెట్టుబడులతో ముందుకొస్తున్న కంపెనీలు ఒకవైపు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు మరో వైపు. క్షణాల్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే సౌకర్యం నడుమ అభివృద్ధికి ఔటర్ కేంద్ర బిందువుగా మారింది. ఈ క్రమంలోనే ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణంలో మరిన్ని మహా ప్రణాళికలకు రూపకల్పన జరిగిందంటూ ప్రభుత్వం ప్రచారం చేసింది.
ఇందులో భాగంగానే ఔటర్ చుట్టూ 13 పట్టణాలు (రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాల) ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్లు (టీఓజీసీ)గా పిలిచే వీటి నిర్మాణానికి కమిటీలను ఏర్పాటు చేశారు. ఔటర్ సమీపంలోనే ఐదు వేల ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ సిటీ, రేడియల్ రోడ్లు, గ్రోత్ కారిడార్ల అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రచారంతో రియల్ ఎస్టేట్ మాత్రం శరవేగంగా అభివృద్ధి చెందింది. గజం రూ.2 వేల నుంచి రూ.5 వేలుగా ఉన్న స్థలాల ధరలు ఏకంగా రూ.15 వేల నుంచి రూ.50 వేలకు చేరాయి. ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి పనులు మాత్రం ఎలాంటి పురోగతి లేకుండా ఆగిపోయాయి. ఓఆర్ఆర్ చుట్టూ 13 పట్టణాల జాడ కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మాటలకే రీజినల్ రింగ్ రోడ్డు..
ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగానే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తామంటూ కొన్నేండ్లుగా ప్రచారం చేస్తున్నారు. రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, యాదాద్రి జిల్లాల పరిధిలోని అప్పటి 24 మండలాల పరిధిలో విస్తరించనున్న ఈ ప్రతిపాదనతో జనం ఆనందంలో మునిగారు. తాము బాగుపడుతామని 125 గ్రామాల ప్రజలు సంతోషపడ్డారు. 283 కి.మీ. ఆర్ఆర్ఆర్ తో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగా సాగింది. ఇప్పటికీ అదే బూచీని చూపించి ప్లాట్లను అమ్ముతున్నారు. రూ.10 లక్షలకు ఎకరం దొరికే గ్రామాల్లో రూ.కోటికి పెంచేశారు. ఈ ప్రతిపాదనతోనే సిటీకి 50 కి.మీ. దూరంలోనూ లేఅవుట్లు వెలిశాయి. ఎలాగూ భూములకు విలువలు వస్తాయంటూ మధ్య తరగతి వర్గాలు పెట్టుబడులు పెట్టాయి. కానీ ఎన్నటికీ ఆ ప్రతిపాదన ట్రాక్ ఎక్కకపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. తాజాగా సీఎం కేసీఆర్ మరోసారి ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే తాము చేస్తామంటూ తెర మీదికి తీసుకొచ్చారు.
ప్రతిపాదనలకే పరిమితం..
– స్కైవేల్లో మూసీ కారిడార్ 42కి.మీ.ల పొడవుతో అన్నింటి కన్నా పొడవైన ఆకాశమార్గం.
– కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్, మహరాజా అగ్రసేన్(బంజారాహిల్స్ రోడ్ నెం-12 జంక్షన్), క్యాన్సర్ హాస్పిటల్(బంజారాహిల్స్ రోడ్ నెం-10 జంక్షన్), ఫిలింనగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెం-45జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్(ఆప్షన్-2), అయ్యప్ప సొసైటీ జంక్షన్ వంటి జంక్షన్ల అభివృద్ధి కార్యక్రమాలు.
– మూసీ ఈస్ట్, వెస్ట్ కారిడార్
– 111 కి.మీ. మేరకు స్కై వేల నిర్మాణం