తెలంగాణ గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు ఇంకెప్పుడు..?

by Shyam |
తెలంగాణ గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు ఇంకెప్పుడు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తామని రెండేళ్ల క్రితం ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రకటించారు. అవసరమైన చర్యలు చేపట్టారు. అయినా, నేటి వరకు రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లోని ఏ ఒక్క గ్రామంలో సేవలను అందించలేదు. మిషన్ భగీరథ పైప్ లైన్లతో పాటు బ్రాడ్ బ్యాండ్ కేబుల్ పర్చారు. కొన్ని గ్రామాల్లో కేబుల్ కూడా వేయలేదు. 2022 నాటికి పూర్తి చేయాలని అందరికి అందుబాటులో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం లేకుండా పోయింది. పౌరసరఫరాల శాఖలో బయోమెట్రిక్ సిస్టంలో వస్తున్న ఇబ్బందులను తొలగించేందుకు, గ్రామపంచాయతీల సేవలు, వివరాలను పొందుపర్చేందుకు కలుగుతున్న అంతరాయం, ఆన్ లైన్ పాఠశాలకు కలుగున్న ఇబ్బందులను తొలగించేందుకు బ్రాడ్ బ్యాండ్ సేవలతో చెక్ పెడతామని ప్రభుత్వం ప్రకటించింది.

ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో డిజిటల్, మౌలిక సదుపాయాలను బలోపేతం, వివిధ విభాగాలు సాధించిన పురోగతిని సమీక్షించేందుకు శుక్రవారం బీఆర్ కేఆర్ భవన్‌లో స్టేట్ బ్రాడ్ బ్యాండ్ కమిటీ(ఎస్‌బీసీ)3వ సమావేశం నిర్వహించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధ్యక్షత వహించడం, పనితీరును సమీక్షించడం గమనార్హం. ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ.. పారదర్శకత, ఎక్కువ విజిబిలిటీని నిర్ధారించే కొత్త ఆన్ లైన్ వెబ్ పోర్టల్‌ను అనుసంధానించే పనిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడం కొసమెరుపు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డీఓటీ, బీఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story