డిప్యూటీ సెక్రెటరీ వేతనాల్లో ఏంటి మతలబు..

by Shyam |
డిప్యూటీ సెక్రెటరీ వేతనాల్లో ఏంటి మతలబు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : పీఆర్సీ జీవోల్లో మతలబు చోటు చేసుకుంది. ఆయా శాఖల్లో డిప్యూటీ సెక్రెటరీల వేతనాల్లో భారీ మార్పు జరిగింది. ఉదాహరణగా సచివాలయం, రాజ్​భవన్​, తెలంగాణ పబ్లిక్​ సర్వీసు కమిషన్​ను తీసుకుంటే డిప్యూటీ సెక్రెటరీ 2014 వేతనం రూ. 56,870 ఉండగా ప్రస్తుతం పెరిగిన వేతనం రూ. 89,780కి చేరింది. వాస్తవంగా వీరికి ప్రస్తుత 30 శాతం ఫిట్​మెంట్​ లెక్కలేసుకుంటే దాదాపు రూ. 81 నుంచి రూ. 83 వేలకు పెరుగాల్సి ఉంది. కానీ ఒకే ఐదువేలకుపైగా అదనంగా పెంచారు. జీవోల జారీ సందర్భంగా దీనిలో డిప్యూటీ సెక్రెటరీ హోదాలో ఏదో జరిగిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసిస్టెంట్​ సెక్రెటరీ హోదాలో రూ. 46 వేల పాత వేతనం ఉంటే… వారికి రూ. 67వేలకు పెరిగింది. ఈ లెక్కన డిప్యూటీ సెక్రెటరీలకు అంతే స్థాయి పెరుగాల్సి ఉండగా అదనంగా పెంచుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జీవోలన్నింటా కేవలం ఈ డిప్యూటీ సెక్రెటరీ పెరిగిన వేతనాన్ని ప్రత్యేక అక్షరాలతో పేర్కొన్నారు. అంటే పాత వేతనాలతో పోల్చితే కచ్చితంగా దీన్ని మార్చినట్లు ఉద్యోగులు గుర్తిస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా శాఖల్లో కేవలం డిప్యూటీ సెక్రెటరీల వేతనాల్లోనే ఈ మార్పు కనిపిస్తోందంటూ కచ్చితంగా ఏదో మతలబు ఉందని అభిప్రాయపడుతున్నారు.

అదేస్థాయిలో తెలంగాణ స్టేట్​ ఎలక్షన్​ కమిషన్​ పరిధిలోని జాయింట్​ డైరెక్టర్​ స్థాయిలో పాత వేతనాన్ని రూ. 56,870 ఉండగా… కొత్త వేతనాన్ని రూ. 83,100గా చూపించారు. కానీ ఇతర విభాగాల్లో ఇదే స్థాయిలోని డిప్యూటీ సెక్రెటరీ వేతనాన్ని మాత్రం ఎందుకు పెంచారనేది ఇప్పుడు అధికారులకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది.

Advertisement

Next Story