రన్స్ మెషిన్.. ఎక్కడ తేడా కొట్టింది.. ఆందోళనలో టీమ్ మేనేజ్‌మెంట్

by Shyam |
రన్స్ మెషిన్.. ఎక్కడ తేడా కొట్టింది.. ఆందోళనలో టీమ్ మేనేజ్‌మెంట్
X

దిశ, స్పోర్ట్స్: ఇప్పుడంటే కింగ్ కోహ్లీ అని అందరూ పిలుచుకుంటున్నారు కానీ.. ఒకప్పుడు కోహ్లీని రన్ మెషిన్ అనేవాళ్లు. మీడియలో కోహ్లీ పేరు ముందు ‘పరుగుల యంత్రం’ అని తప్పకుండా రాసే వాళ్లు. టార్గెట్ సెట్ చేయాలన్నా.. ఛేదించాలన్నా కోహ్లీ ఉండాల్సిందే. సచిన్‌కి కూడా సాధ్యం కాని ఎన్నో రికార్డులను విరాట్ కోహ్లీ సాధించాడు. ముఖ్యంగా ఎంతో ఒత్తిడితో కూడిన ఛేదనల్లో విరాట్ కోహ్లీకి ఉన్న రికార్డు మరెవరికీ లేదు. తొలుత బ్యాటింగ్ చేసినప్పటి సగటు కంటే.. కోహ్లీకి ఛేదనలోనే అధిక సగటు ఉన్నది. వైట్ బాల్ క్రికెట్‌లో కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు 32.72గా ఉంటే అదే సెకెండ్ ఇన్నింగ్స్‌లో 84.26గా ఉన్నది. టీమ్ ఇండియాకు ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించాడు.

భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడినప్పుడు కోహ్లీకి అనేక రికార్డులు ఉన్నాయి. సిరీస్ విజయాలు అందించడంలో కూడా మిగతా కెప్టెన్ల కంటే ముందున్నాడు. అలాంటి కోహ్లీ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి నిరాశలో ఉన్నాడు. కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ రాక దాదాపు 2 ఏళ్ల అవుతున్నది. అంతే కాదు కెప్టెన్ అయ్యాక కోహ్లీ ఇంత వరకు ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ నెగ్గలేదు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఓడిపోగా.. 2019 వరల్డ్ కప్ సెమీస్‌లో వెనుదిరిదింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా అక్కడా పరాభవం తప్పలేదు. ఒకవైపు బ్యాటర్‌గానే కాకుండా మరోవైపు కెప్టెన్‌గా కూడా విమర్శలు ఎదుర్కుంటున్నాడు.

కీలక దశలో..

విరాట్ కోహ్లీపై పని ఒత్తిడి పెరిగిందన్న మాట వాస్తవమే. ఎందుకంటే ప్రపంచంలో వేరే ఏ జట్టును తీసుకున్నా వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించింది. అలా కాకున్నా టెస్టు ఫార్మాట్‌కు ఒక కెప్టెన్‌ను నియమిస్తే వైట్ బాల్ క్రికెట్‌కు మరో కెప్టెన్‌ను నియమించుకున్నాయి. అంతే కాకుండా ఆటగాళ్ల రొటేషన్ ఫార్ములాను కూడా అనుసరిస్తున్నాయి. కేవలం టీమ్ ఇండియాకు మాత్రమే అన్ని ఫార్మాట్లలోనూ ఒకే కెప్టెన్ ఉన్నాడు. ఒకే డ్రైవర్ లాంగ్ జర్నీ చేస్తూ గేర్లు మార్చినట్లు.. కోహ్లీ ఏడాదంతా డిఫరెంట్ ఫార్మాట్లలో ఆడాల్సి వస్తున్నది. ఈ ఒత్తిడి ఈ మధ్య బ్యాటింగ్ కూడా పడింది. దీంతో జట్టుకు బ్యాటర్‌గా అందించాల్సిన పరుగులను అందించలేకపోతున్నాడు.

దీంతో పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి గుడ్ చెప్పాడు. భారత జట్టు రాబోయే మూడేళ్లలో కీలకమైన టోర్నీలు ఆడాల్సి ఉన్నది. టీ20 వరల్డ్ కప్ 2021తో పాటు 2022లో ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 వరల్డ్ కప్ కూడా ఆడాలి. ఇక 2023లో ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. అప్పటి వరకు జట్టులో ఉండాలంటే ఫిట్‌నెస్ కాపాడు కోవాలి. కెప్టెన్‌గా ఉంటే అది కష్టం కాబట్టే.. ఒక ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. మధ్యలో కొన్ని సిరీస్‌లకు అందుబాటులో లేకుండా విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఉన్నది.

ట్రోఫీలు గెలిచేనా?

కెప్టెన్‌గా ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ గెలిపించాలనేది విరాట్ కోహ్లీ కోరిక. కానీ దాన్ని కూడా నెరవేర్చుకోలేక పోయాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచే కెప్టెన్‌గా అతడికి చివరిది. ఇక అతడు టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించేది రాబోయే టీ20 వరల్డ్ కప్‌లోనే. కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ నెగ్గాలన్నా అతడికి మిగిలిన ఛాయిస్ కూడా రాబోయే మెగా టోర్నీనే. అయితే ఐపీఎల్‌లో విఫలమైన వెంటనే టీ20 వరల్డ్ కప్ బరిలోకి దిగుతుండటంతో కోహ్లీ సమర్ధతపై టీమ్ మేనేజ్‌మెంట్ ఆందోళన చెందుతుంది. బ్యాటర్‌గా కూడా సరైన ఫామ్‌లో లేని కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్‌లో జట్టును ఎలా నడిపిస్తాడో అని అనుమానిస్తున్నది. ధోనీని మెంటార్‌గా బీసీసీఐ తీసుకోవడం వెనుక కారణం కూడా ఇదే అని విశ్లేషకులు చెబుతున్నారు.

శారీరిక థారుడ్యంలో ప్రస్తుతం కోహ్లీ స్టాండర్ట్స్‌ను అందుకోవడం చాలా మంది క్రికెటర్లకు కష్టమే. కానీ కోహ్లీ మానసిక ధారుఢ్యం గురించే అందరి ఆందోళన. కోహ్లీ ఈ మధ్య మైదానంలో అంపైర్లపై ప్రవర్తించే తీరుకూడా అతడి మానసిక స్థితిని తెలియజేస్తున్నదని నిపుణులుఅంటున్నారు. కోహ్లీ ఎంత త్వరగా కోలుకుంటే.. అతడికే కాకుండా జట్టుకు కూడా లాభమని చెబుతున్నారు. మరి చివరి సారిగా టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా టీమ్ ఇండియాను నడిపించనున్న కోహ్లీ.. వరల్డ్ కప్ తెస్తాడా? లేదా అది కూడా కలగా మిగులుతుందా అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story