బతికున్న మహిళ చనిపోయిందంట.. కేటీఆర్‌కు ఫిర్యాదు

by  |
బతికున్న మహిళ చనిపోయిందంట.. కేటీఆర్‌కు ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యం అందట్లేదన్న విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఆస్పత్రిలో ఒక మహిళ చనిపోతే మరో మహిళ చనిపోయిందని ఆమె బంధువులకు ఫోన్ చేశారు. దీంతో ఆ మహిళ తమకు తెలియదని, ఆస్పత్రిలో ఉన్న వారి కుటుంబీకురాలు బతికే ఉందని చెప్పారు. మరో పేషెంట్ సహాయకుడు ఆస్పత్రిలో డాక్టర్లు సకాలంలో స్పందించడం లేదంటూ ఏకంగా మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు కూడా చేశాడు.

బతికున్న మహిళ చనిపోయిందని..

ఒక మహిళ చనిపోతే.. మరో మహిళ చనిపోయిందంటూ డాక్టర్లు కుటుంబీకులకు ఫోన్ చేశారు. కాగా, ఒకే పేరుతో ఉన్న ఇద్దరు మహిళలు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య కోసం చేరారు. తలాబ్ కట్టకు చెందిన మహిళ(55) ఈ నెల 20న ఆస్పత్రి క్యాజువాలిటీలో చేర్చుకున్నారు. ఆమె భర్త కూడా అక్కడే ఉన్నాడు. ఈ నెల 21న గుర్తు తెలియని మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆస్పత్రి సిబ్బంది పొరపాటున తలాబ్ కట్టకు చెందిన మహిళ మృతి చెందిందని బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబీకులు అక్కడకు చేరుకుని బతికున్న మహిళ చనిపోయిందని చెప్పడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది పొరపాటున ఫోన్ చేయడం సమస్యకు కారణమైందని, దీనిపై విచారణ జరుపుతున్నామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి ఉన్నతాధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని మార్చురీలో భద్రపర్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్ సోమవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని డాక్టర్ నాగేందర్‌ను కలిసి ఏం జరిగిందని విచారణ జరిపారు.

పని ఒత్తిడిలో సిబ్బంది..

ఉస్మానియా ఆస్పత్రికి కొద్దికాలంగా రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. కరోనా లక్షణాలైన దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యలతో రోగులు వస్తుండడం దాని ప్రభావం జనరల్ మెడిసిన్‌లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, సిబ్బందిపై నేరుగా పడుతోంది. దీంతో అదనపు సిబ్బందిని నియమించే వరకు విధులకు హాజరు కాబోమని పీజీలు రెండు రోజులుగా విధులు బహిష్కరిస్తుండడంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆస్పత్రిలోని ఇతర విభాగాల నుంచి వైద్యులను జనరల్ మెడిసిన్ విభాగం పని చేయించి సమస్యకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ దిశకు చెప్పారు. ఆస్పత్రికి నిత్యం 50 నుంచి 60 మంది వరకు కరోనా లక్షణాలతో రోగులు వస్తున్నారని, వీరికి పరీక్షలు జరిపి మైల్డ్, మోడరేట్, సివీరియర్‌గా విభజించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక్కడ మొదట్లో కోవిడ్ రోగులకు 24 బెడ్స్ మాత్రమే ఉండగా, ప్రస్తుతం 43 బెడ్స్ ఏర్పాటు చేశారు. పీజీలు వైద్య సేవలు బహిష్కరించినా దాని ప్రభావం రోగులపై పడకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు.

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం: ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్

ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొంది చివరి నిమిషంలో రోగులు ఉస్మానియాకు వస్తున్నారు. వెంటిలేటర్లు లేవని చెప్పి ఏ ఒక్క కేసునూ తిప్పి పంపలేదు.. ఇలా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు భయాందోళనలకు గురవుతారు.


Next Story

Most Viewed