నామినేషన్ ర్యాలీలో సీన్ రివర్స్.. ఆదిలాబాద్ BJPలో హైటెన్షన్!

by Disha Web Desk 4 |
నామినేషన్ ర్యాలీలో సీన్ రివర్స్.. ఆదిలాబాద్ BJPలో హైటెన్షన్!
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో : బీజేపీలో లొల్లి ముదురుతోంది. ఎన్నిక‌ల ప్రచారం ఊపందుకున్న స‌మ‌యంలో సైతం నేత‌ల్లో స‌ఖ్యత కుద‌ర‌డం లేదు. నామినేష‌న్ ప‌త్రాల దాఖ‌లు అంశం ఎమ్మెల్యేల మ‌ధ్య అగ్గి రాజేసింది. జ‌న స‌మీక‌ర‌ణ విష‌యంలో త‌లెత్తిన వివాదం పార్టీలో అంత‌ర్గత పోరుకు కార‌ణ‌మ‌వుతోంది. ఇంత‌కీ ఆదిలాబాద్ క‌మ‌లం పార్టీలో క‌య్యానికి కార‌ణ‌మేంటి..? శాస‌న స‌భ్యులు ఒక‌రంటే ఒక‌రికి ఎందుకు ప‌డ‌టం లేదు. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ ప‌రిధిలో బీజేపీ అభ్యర్థి ప్రక‌ట‌న నుంచి ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాట‌కు ఫుల్‌స్టాప్ ప‌ట‌డం లేదు. రోజుకో రూపంలో ఈగోలు రోజుకో అసెంబ్లీ సెగ్మెంట్‌లో తెర పైకి వ‌స్తున్నాయి. ప్రచారంలో ప‌ద‌డుగులు ముందుకు వేస్తే, వివాదాలు ఆ అడుగుల‌ను వెన‌క్కి లాగుతున్నాయి. ఎంపీ సెగ్మెంట్ ప‌రిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే మొన్నటి ఎన్నిక‌ల్లో నాలుగు స్థానాల‌ను కైవసం చేసుకుని జోరు మీదున్న బీజేపీతో అభ్యర్థి ప్రకట‌న నుంచి అల‌క‌లు, పార్టీ మార్పులు క‌మ‌లాన్ని కంగారు పెట్టి స్తున్నాయి. టిక్కెట్టు ఆశించిన నేత‌ల్లో కొంత‌మంది ప‌క్క పార్టీల్లో చేరిపోగా మ‌రికొంత మంది అటు అభ్యర్థి కోసం ప్రచారం చేయ‌లేక‌, ఇటు ఖాళీగా ఉండ‌లేక అయోమ‌యానికి గుర‌వుతున్నారు. అధిష్టానం ఇలాంటి వాటి గురించి ప‌ట్టించుకుని అంద‌రినీ సంతృప్తి ప‌రుస్తామ‌ని ధీమా ఇచ్చినా వారంతా మ‌న‌స్సు పెట్టి ప‌ని చేయ‌లేక‌పోతున్నారు.

నామినేష‌న్ ర్యాలీ.. దుమారం రేగి..

ఆదిలాబాద్‌లో నిర్వహించిన నామినేష‌న్ ర్యాలీని అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి త‌గినంత ఆర్థిక వ‌న‌రుల‌ను సైతం స‌మీక‌రించింది. కేంద్రమంత్రి ప‌ర్యట‌న‌ను సైతం ఖ‌రారు చేసింది. ఆయ‌న అభ్యర్థి నామినేష‌న్ కార్యక్రమంలో పాల్గొనే స‌మ‌యంలో 25 వేల మందిపై చిలుకు మందితో ర్యాలీ నిర్వహించాల‌ని బీజేపీ నిర్ణయం. కానీ, కేంద్రమంత్రి రాలేదు. ర్యాలీకి అనుకున్న దానికంటే పావ‌లా వంతు జ‌నం సైతం రాక‌పోవ‌డం ఎమ్మెల్యేల మ‌ధ్య వివాదానికి దారి తీసింది. న‌గేష్ నామినేష‌న్ ర్యాలీలో న‌లుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జ‌నాన్ని చూసి వారే షాక‌య్యారు. ఇంత త‌క్కువ జ‌నం రావ‌డం ఏమిట‌ని లోక‌ల్ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దానికంటే ముందే ఓ ఎమ్మెల్యే కేంద్రమంత్రి ప‌ర్యట‌న ర‌ద్దైంద‌ని చెప్పడంతో నేను 25 వేల మందిని సిద్ధం చేశాన‌ని మంత్రి ప‌ర్యట‌న ఎలా ర‌ద్దు చేస్తార‌ని ఓ ఎమ్మెల్యే ప్రశ్నించ‌డంతో మిగ‌తా ఎమ్మెల్యేలు హ‌డావిడిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే క‌నీసం ఐదు వేల మంది కూడా లేక‌పోవ‌డంతో అవాక్కవ‌డం వారి వంత‌య్యింది.

ఓ ఎమ్మెల్యేపై మ‌రో ఎమ్మెల్యే సీరియ‌స్‌..

ర్యాలీ చూసిన ఎమ్మెల్యే మ‌రో ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జ‌నం ఇంత త‌క్కువ‌గా రావ‌డం ఏమిట‌ని ప్రశ్నించారు. అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంద‌ని, అన్ని ర‌కాల సౌక‌ర్యాలు క‌ల్పించింద‌ని, మాకు చెబితే ఓ 50 కార్లు తీసుకువ‌చ్చే వాళ్లం క‌దా..? అని దుయ్యబ‌ట్టారు. నామినేష‌న్ కార్యక్రమం తూతూ మంత్రంగా సాగింది. అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ముభావంగానే ఉండ‌టం గ‌మ‌నార్హం. అభ్యర్థి రిట‌ర్నింగ్ కార్యాలయంలోనే ఎమ్మెల్యేలంతా బ‌య‌ట‌కు వ‌చ్చి ప్రెస్‌మీట్ పెట్టారు. అందులోనూ మ‌హేశ్వర్ రెడ్డి, రామారావు ప‌టేల్ మొద‌ట‌గా మాట్లాడి వెళ్లేందుకు ప్రయ‌త్నించ‌గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ అన్నా.. మిత్రుడు మాట్లాడుతాడంటూ వారిని వెన‌క్కి పిలిచారు. ఈ క్రమంలోనే మ‌హేశ్వర్ రెడ్డి అస‌హ‌నం వ్యక్తం చేశారు. ఇదంతా వారి మ‌ధ్య ఉన్న అంత‌రాలు, బేష‌జాలు ప్రస్పుట‌మ‌య్యాయి.

అధిష్టానం ఆరా...

ఇలా ఆదిలాబాద్ పార్లమెంట్ ప‌రిధిలో నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న అంత‌ర్యుద్దంపై అధిష్టానం సీరియ‌స్‌గా దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా కొద్ది రోజులుగా ఇక్కడ జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై దృష్టి పెట్టి ఎప్పటిక‌ప్పుడు ఇన్‌పుట్స్ తెప్పించుకుంటోంది. అభ్యర్థి నామినేష‌న్ సంద‌ర్భంగా జ‌రుగుతున్న ప‌రిణామాల్లో ఒక ఎమ్మెల్యే చేసిన త‌ప్పిదాల‌ను సైతం అధిష్టానం కొంద‌రు నేత‌ల‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. అక్కడ జ‌రుగుతున్న ప‌రిణామాలు, అసంతృప్తి ఎలా కంట్రోల్ చేయాల‌నేదిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ విషయంలో నేత‌ల‌ను పిలిపించి మాట్లాడ‌నున్నట్లు స‌మాచారం.



Next Story

Most Viewed