వ్యాధి లక్షణాలు ఉండవు.. కానీ వ్యాపింపజేస్తారు

by sudharani |   ( Updated:2020-03-01 01:06:55.0  )
వ్యాధి లక్షణాలు ఉండవు.. కానీ వ్యాపింపజేస్తారు
X

దిశ, వెబ్‌‌డెస్క్:

కరోనా, సార్స్, జికా ఇలా వైరస్ ఏదైనా కానివ్వండి, అతి వేగంగా వ్యాపించడానికి కొంతమంది ప్రధాన కారణమవుతారు. అయితే ఆ కొంతమందిలో వైరస్ సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వారి ద్వారా వైరస్ సోకిన వాళ్లు ముందుగా అస్వస్థతకు గురవుతారు. ఇలా వైరస్ బారిన పడకుండా ఇతరులకు వేగంగా వ్యాప్తి చెందించే వాళ్లనే వైద్య పరిభాషలో సూపర్ స్ప్రెడర్స్ అంటారు. కరోనా వైరస్ ఇలా తక్కువ సమయంలో అన్ని దేశాలకు వ్యాప్తి చెందడానికి కారణం కూడా వారేనని వైద్యనిపుణులు అంటున్నారు.

విమానాశ్రయాల్లో ఎన్ని రకాల చెకింగ్‌లు పెట్టినప్పటికీ ఈ సూపర్ స్ప్రెడర్లను గుర్తించడం చాలా కష్టం. పరీక్షల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ఒకరికి వ్యాధి సోకిందని ఆరోపించడం సబబు కాదు. కాబట్టి ఈ సూపర్ స్ప్రెడర్లు పరీక్షల నుంచి సులువుగా బయటపడతారు. కానీ ఆ వ్యక్తులకు కూడా తెలియదు వారు సూపర్ స్ప్రెడర్ అని. అందుకే పరోక్షంగా వారు వ్యాధి వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతారు.

వ్యాధి వ్యాప్తి విషయంలో అందరికీ ఒకేలా భాగస్వామ్యం ఉండదని రెండు దశాబ్దాల క్రితమే కనుక్కున్నారు. 20 బై 80 నియమం ప్రకారం ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే వ్యాధిని వేగంగా వ్యాప్తి చెందిస్తారు. వారినే సూపర్ స్ప్రెడర్‌గా పరిగణించవచ్చు.

సూపర్ స్ప్రెడర్‌గా ఎలా మారతారు?

ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. కానీ ఒకరు సూపర్ స్ప్రెడర్‌గా మారడానికి వారి వ్యాధి నిరోధక శక్తి కారణమని ఒక అంచనా. వైరస్ సోకిన తర్వాత శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండటంతో లక్షణాలు నియంత్రణలో ఉంటాయి. కానీ వైరస్ వృద్ధి మాత్రం పరోక్షంగా జరుగుతూనే ఉంటుంది. తద్వారా సంబంధిత వ్యక్తిలో లక్షణాలు కనిపించనప్పటికీ వైరస్ నిగూఢంగా దాగి ఉంటుంది. ఇదే వైరస్ అతని నుంచి తక్కువ వ్యాధి నిరోధక శక్తి గల వ్యక్తికి సోకినపుడు ప్రభావం పెరుగుతుంది. అలాగే ఎక్కువ మొత్తంలో పాథోజన్ సోకిన వారు కూడా సూపర్ స్ప్రెడర్‌గా మారే అవకాశం ఉంటుంది.

కరోనా వైరస్‌కి ఉన్నారా?

అవుననే అనిపిస్తోంది. సింగపూర్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్ వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సదస్సుకి చైనాలోని వుహాన్ నుంచి ఒక ప్రతినిధి వచ్చారు. ఆయన దగ్గరి నుంచి ఒక బ్రిటిష్ వ్యక్తి వైరస్ సోకింది. ఆ బ్రిటిష్ వ్యక్తి తర్వాత ఫ్రాన్స్ వెళ్లాడు. అక్కడ అతని కుటుంబంతో గడిపాడు. ఇప్పుడు వారి కుటుంబంలోని ఐదుగురి కరోనా వైరస్ సోకింది. అలాగే ఇంకో ఇద్దరు బ్రిటిషర్లను కూడా సూపర్ స్ప్రెడర్లుగా ఆ దేశం గుర్తించగలిగింది.

గతంలో కూడా జరిగిందా?

జరిగింది. 1900ల్లో ఒక మహిళ ఎలాంటి లక్షణాలు చూపించకుండా 51 మందికి టైఫాయిడ్ అంటించింది. 1998లో ఫిన్లాండ్ ఓ యువకుడు తనకు తెలియకుండానే 22 మందికి మీజిల్స్ సోకడానికి కారణమయ్యాడు. ఇక 2003 సార్స్ వ్యాధికి అయితే ఒక్కో సూపర్ స్ప్రెడర్ పది మందికి వ్యాధిని అంటించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed