రూ.90కోట్ల రుణం పేరుతో రూ.20 లక్షలకు టోకరా..

by Sumithra |
రూ.90కోట్ల రుణం పేరుతో రూ.20 లక్షలకు టోకరా..
X

దిశ, క్రైమ్ బ్యూరో : బ్యాంకర్లకు అప్పులు చెల్లించేందుకు రుణం పొందాలని భావించిన ఓ కంపెనీ యాజమానిని లక్షల రూపాయలకు టోపీ పెట్టారు కేటుగాళ్లు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి నగరానికి చెందిన ఓ ఏజెన్సీ రూ.90 కోట్లు రుణం ఇప్పిస్తామని చెప్పి.. రూ. 20 లక్షలను కాజేసింది. ఇంకా మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయినట్టుగా గ్రహించిన బాధితుడు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. పశ్చిమ గోదావరి జిల్లా తిరుమల మండలంలో సింధూర పేపర్ కంపెనీని 2008 నుంచి పాలేటి నాగేశ్వర రావు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వ్యాపారం తీవ్రంగా నష్టాలు వచ్చాయి.

పలు బ్యాంకర్లకు బకాయిలు పడటంతో బకాయిల చెల్లించాలని బ్యాంకర్ల నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఈస్ట్ ఆనంద్ బాగ్2లోని లీలా కాంత్ ద్వారా వర్చువల్ హైర్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ నిర్వహించే నాగరాజును, కొండాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద శ్రీవీరా ఏజెన్సీ నిర్వహించే చింటేశ్వర్ రావులను 2020 మార్చిలో సంప్రదించాడు. దీంతో వారు వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి రూ.90 కోట్ల రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ప్రాసెస్ తదితర ఖర్చులకు రూ.15 లక్షలను నాగేశ్వరరావు తన ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి చెల్లించాడు.

ఆ తర్వాత మరో రూ.5 లక్షలను చెల్లించాడు. అయితే, నాగేశ్వరరావు నమ్మేందుకు గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రుణం మంజూరు అయినట్టుగా ఓ నకిలీ లేఖను సృష్టించారు మోసగాళ్ళు. అనంతరం మరో రూ.20 లక్షలు డిమాండ్ చేయడంతో మోసంగా అనుమానించిన బాధితుడు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు డీఐ కె.నాగయ్య తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed