పార్లమెంటులో ఆందోళన చేస్తాం: ఎంపీ బడుగుల

by Sridhar Babu |   ( Updated:2021-11-26 03:35:57.0  )
badugula-1
X

దిశ, సూర్యాపేట: ఈ నెల 29 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలలో ఉమ్మడి నల్గొండ జిల్లా సమస్యలైన జాతీయ రహదారి, రైల్వే సమస్యలు, ధాన్యం కొనుగోలుతోపాటు తెలంగాణ రాష్ట్ర సమస్యలపై గళం ఎత్తుతామని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వానా కాలంలో పండిన‌ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే యాసంగి పంటలో ఎంత కొనుగోలు చేస్తారో చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ తో రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు సమావేశమై ధాన్యం కొనుగోలు చేయాలని చర్చించినట్లు ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం కొనుగోలు చేయలేమని స్పష్టంగా చెప్పారని అన్నారు. యాసంగి ధాన్యంతోపాటు గతంలో కొనవలసిన ఐదు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్డత ఇవ్వాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మూడు నల్ల చట్టాలతోపాటు విద్యుత్ చట్టం రద్దు చేసే వరకూ పార్లమెంట్ లో ఆందోళన చేస్తామన్నారు. హైదరాబాద్ లో గురువారం జరిగిన రైతు ధర్నాలో జాతీయ రైతు సంఘం నేత టికాయత్.. కేసీఆర్ పాలనను ప్రశంసించారని, కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story