వ్యాక్సిన్ తయారు చేస్తాం.. కానీ ప్రజలకు ఇవ్వం: చైనా

by vinod kumar |
వ్యాక్సిన్ తయారు చేస్తాం.. కానీ ప్రజలకు ఇవ్వం: చైనా
X

దిశ, వెబ్ డెస్క్: చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటి వరకు సరైన చికిత్సా విధానం లేని ఈ కోవిడ్-19 వ్యాధికి వ్యాక్సిన్ తయారీనే సరైన పరిష్కారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఈ నేపథ్యంలో పలు దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. కాగా, కరోనా పుట్టిన చైనాలో వైరస్ పూర్తిగా కట్టడి అయిన తర్వాత ఇప్పుడు మళ్లీ తిరగబడుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా బీజింగ్, షాంఘై నగరాల్లో కరోనా బాధితులు పెరిగిపోతున్నారు.

మరోవైపు చైనా ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేస్తోంది. చైనా శాస్త్రవేత్తలు నిరంతరం వ్యాక్సిన్ పరిశోధనల్లో మునిగిపోయారు. కాగా, వ్యాక్సిన్ తయారు చేసినా ముందు దీన్ని వైద్యులు, ఇతర సిబ్బందికి మాత్రమే ఇస్తామని.. సామాన్య ప్రజలకు ఇప్పుడే ఇవ్వబోమని చైనా ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం పలు నగరాల్లో రెండో దఫా కరోనా కేసులు బయటపడుతున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని.. అప్పుడు దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించక తప్పదని అధికారులంటున్నారు. అదే కనుక జరిగితే ముందుగా వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని రక్షించుకోవడమే ముఖ్యం. కాబట్టి వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని చైనా చెబుతోంది.

చైనాలో సోమవారం కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు విదేశాల నుంచి రాగా, మిగిలిన ఏడుగురికి స్థానికంగానే వైరస్ సోకింది. ముఖ్యంగా రష్యా సరిహద్దుల్లో ఉన్న హేలియాంగ్ జియాంగ్‌లో కరోనా కేసులు పెరగడం చైనాను కలవరపెడుతోంది. ఇది ఇంకా విజృంభిస్తే చలికాలం వచ్చే నాటికి మరింత ప్రమాదకరంగా మారడం ఖాయమని చైనా ప్రభుత్వం అంచనా వేస్తోన్నది. అప్పుడు రోగులకు సరైన చికిత్స అందించాలంటే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అవసరం ఉంటుంది. కాబట్టి వారందరికీ ముందుగానే వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా, ప్రస్తుతం చైనా సైన్యానికి చెందిన వైద్య విభాగం ఎడినో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్‌ను శరవేగంగా తయారు చేస్తోంది. ఇప్పటికే 500 మందిపై రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జరిపారు. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి.. వ్యాక్సిన్ బయటకు రావడానికి డిసెంబర్ అవుతుందని చైనా వ్యాధి నియంత్రణ సంస్థ తెలిపింది. కాబట్టి అంతకన్నా ముందే వ్యాక్సిన్ సిద్ధం చేయడానికి శరవేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యాధి నియంత్రణ సంస్థ డైరెక్టర్ గావో పు తెలిపారు.

Tags: China, Vaccine, Gao Pu, Abroad, Corona Virus

Advertisement

Next Story