వైద్య సదుపాయాలు లేకపోయినా కరోనాను ఎదుర్కొన్నాం : సీఎం జగన్

by srinivas |   ( Updated:2021-07-16 08:17:53.0  )
cm-jagan mohanreddy
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనాను ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుత పనితీరు కనబరిచిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోడీకి తెలిపారు. శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ పరిస్థితి, వ్యాక్సినేషన్‌ అంశాలపై ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్ ప్రధాని మోడీకి తెలియజేశారు. కరోనా కట్టడికి కేంద్రం ప్రభుత్వం చేస్తున్న సహాయనికి సీఎం జగన్ ముందుగా కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు లేవని తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపీలో లేవని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొవిడ్‌ను ధీటుగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్‌ నివారణలో కీలక పాత్ర పోషించినట్లు వివరించారు. ఇప్పటి వరకు 12 సార్లు ఇంటింటికీ ఫీవర్‌ సర్వే చేశామని.. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి కొవిడ్ టెస్ట్‌లు చేయించినట్లు తెలిపారు. ఫలితంగా కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగామని తెలిపారు.

వ్యాక్సినేషన్ అనేది కొవిడ్‌ నివారణకు సరైన పరిష్కారమని తెలిపారు. అయితే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్ డోసులను సమర్ధవంతంగా వేసినట్లు తెలిపారు. అయితే జూలై నెలలో రాష్ట్రానికి 53,14,740 వ్యాక్సిన్లు ఇవ్వగా.. ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నాయని తెలిపారు. జూన్‌ నెలలో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా 4,20,209 మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన స్టాకు కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని సీఎం కోరారు. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుంది. కరోనా కట్టడి విషయంలో మీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతామని సీఎం జగన్ ప్రధాని మోడీకి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed