ఉస్మానియాలో సీన్ మారలేదు..

by Anukaran |   ( Updated:2020-07-23 03:53:45.0  )
ఉస్మానియాలో సీన్ మారలేదు..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వలన ఉస్మానియా ఆస్పత్రిలో నీరు చేరింది. దీంతో రోగులతో పాటు వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు నీరు సజావుగా వెళ్లి పోయే నాలాలు మూసుకుపోవడంతో ఆస్పత్రి పాత భవనంలోకి భారీగా నీరు చేరిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎంఈ ఉస్మానియా పాత భవనంలోని అన్ని విభాగాలతో పాటు రోగులను ప్రత్యామ్నాయ భవనాలలోకి తరలించి భవనాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. ఐయితే, డీఎంఈ ఆదేశాల కంటే ముందే పాత భవనంలో చికిత్స పొందుతున్న రోగులను కులీకుతుబ్ షా భవనంలోకి తరలించడంతో ఖాళీగా మారింది. కాగా, గురువారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి పాత భవనంలోకి మరోమారు వరద నీరు వచ్చింది. రోగులను ముందే తరలించడంతో ఇబ్బందులు తప్పాయి. ఇదిలా ఉండగా సూపరింటెండెంట్ కార్యాలయం ఎక్కడికి తరలించాలనే విషయంలో స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతం పాత భవనంలోనే కొనసాగుతోంది. కాగా, డోమ్ గేటు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

కులీకుతుబ్ షా భవనంలోకి వర్షం నీరు..
కులీ కుతుబ్ షా భవనంలోకి కూడా వర్షం నీరు చేరడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. భవనంలో నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, కార్డియో థోరాసిక్, న్యూరో సర్జరీ హెచ్‌ఓడీ విభాగాలు ఉన్నాయి. ఇవే కాకుండా బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, పాథాలజీ, రేడియాలజీ ల్యాబులు ఉన్నాయి. గురువారం తెల్లవారు జామున కురిసిన వర్షంతో ఆయా విభాగాల సిబ్బంది ఇబ్బందులకు గురి కాగా, రోగులు వారి సహాయకులు పడరాని పాట్లు పడ్డారు. సిబ్బంది వర్షం నీరును తోడి పోసినా సమస్య మాత్రం యథావిధిగా ఉంది. మరోమారు వర్షం కురిస్తే మళ్లీ కులీ కుతుబ్ షా భవనాన్ని నీరు ముంచెత్తే ప్రమాదం లేకపోలేదు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యమే వల్లే ఉస్మానియా కొత్త భవనాల్లో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డాక్టర్స్ క్యాంటిన్ కు వర్తించదా …?
ఉస్మానియా పాత భవనంకు సీల్ చేయాలని డీఎంఈ ఆదేశాలు జారీ చేసినా.. డాక్టర్స్ క్యాంటిన్ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలు క్యాంటిన్‌కు వర్తించవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ పాతభవనం ప్రవేశంలోనే సెక్యూరిటీ కార్యాలయం దాటగానే డాక్టర్స్ క్యాంటిన్ ఏర్పాటు చేశారు.

ఇంజినీరింగ్ అధికారులకు సమాచారమిచ్చాం..
కులీ కుతుబ్ షా భవనంలోకి వర్షం నీరు వచ్చిన విషయమై టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులకు సమాచారమిచ్చాం. ఇంజినీరింగ్ విభాగం అధికారులు సమస్యను గుర్తించి నీరు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో సమస్యకు పరిష్కారం లభించనుంది. పాత భవనంలో కేవలం సూపరింటెండెంట్ కార్యాలయం మాత్రమే ప్రస్తుతం పనిచేస్తోంది. పాత భవనాన్ని అనుసరించి ఉన్నా.. బయట ఉన్నందువల్లనే డాక్టర్స్ క్యాంటిన్‌ను మూసి వేయలేదు.
-ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ పాండు నాయక్..

Advertisement

Next Story

Most Viewed