ప్రతి నీటి చుక్కకి 'బిల్లు' కట్టాల్సిందే…!

by Anukaran |
ప్రతి నీటి చుక్కకి బిల్లు కట్టాల్సిందే…!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మిషన్ భగీరథ’ను ప్రైవేట్‌పరం చేసే అంశం తేటతెల్లమవుతోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. పథకం నిర్వహణ భారమవుతుందని, నిధుల కొరత ఏర్పడుతోందని స్పష్టం చేశారు. దీనికి కేంద్రం రూపాయి కూడా ఇవ్వడం లేదంటూ విమర్శించారు. ఈ క్రమంలో కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ మిషన్ భగీరథను ప్రైవేట్ కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే అంశం మీద ‘ఇక నుంచి వాటర్ బిల్లు’ అంటూ దిశలో బుధవారం వచ్చిన కథనం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. దీనికి స్పందించే మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్‌కు అప్పగించే అంశాలపై మాత్రం మంత్రి పెదవి విప్పలేదు.

అన్నీ రుణాలే…

హడ్కో, నాబార్డు నుంచి తీసుకున్న రుణాలను తీర్చేందుకు గ్రామీణ ప్రజల నుంచి కచ్చితంగా వాటర్ బిల్లులు వసూలు చేస్తారని రూఢీ అవుతోంది. అప్పులను తీర్చేందుకు మరో మార్గం లేదని సంబంధిత శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. ఇప్పటికే నిర్వహణ భారాన్ని తగ్గిచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ పథకంలో పని చేసే సిబ్బందిని తొలగించింది. మిషన్ భగీరథ పథకానికి ఏటా రూ.2,110 కోట్లు కావాలి. కరెంటు, మరమ్మత్తులు, పంపింగ్, ఇతర పనులు, పర్యవేక్షణ కోసం ఈ నిధులు అవసరమవుతున్నాయి. నిర్వహణ కోసం కూడా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ప్రభుత్వం నుంచి ఈ పథకాన్ని భరించడం కష్టమనే నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.ఈ నేపథ్యంలోనే ప్రైవేట్‌కు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే నివేదిక కూడా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story