- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అధికారుల అతి ‘తెలివి’.. కలిసిరాని ‘కాళేశ్వరం’
దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా కలిసి రావడం లేదు. లక్ష కోట్లకు పైగా ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వరుసగా మూడో ఏడాది కూడా ఫెయిల్యూర్ మూటగట్టుకుంది. గడిచిన వానాకాలం మొత్తం ఒక్క చుక్కను కూడా వాడుకునే అవసరం రాలేదు. పుష్కలంగా వర్షాలు కురువడంతో ఈ వానాకాలం సీజన్‌లో మోటార్లను ప్రారంభించే అవకాశాలు రాలేదు. ప్రాజెక్టును ప్రారంభించిన తొలి ఏడాది మాత్రం 169 టీఎంసీలు(సాగునీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం) ఎత్తిపోశారు.
ఈ ఏడాది మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుతో అవసరమే రాలేదు. ముందుగా వర్షాకాలం ప్రారంభం జూన్‌లో 20 రోజుల పాటు మోటర్లు నడిపించి 32 టీఎంసీలు లిఫ్టు చేసినా.. ఆ తర్వాత భారీ వర్షాలు పడి వరదలు రావడంతో ఎత్తిపోసిన నీళ్లన్నీ కిందికి వదిలేశారు. జూలై 4న మోటార్లను ఆఫ్చేసిన కాళేశ్వరం మోటర్లను ఇప్పటికీ ఆన్ చేయలేదు. గోదావరిపై ఎస్సారెస్పీ మొదలుకొని ఎల్లంపల్లి, మేడిగడ్డ వరకు, అటు మిడ్‌మానేరు మొదలుకొని ఎల్ఎండీ వరకు ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. వర్షాలతో వచ్చిన వరదతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఏటా 225 టీఎంసీల గోదావరి నీటిని లిఫ్ట్ చేసి 40 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2019‒20లో 169 టీఎంసీలు, 2020‒21లో కేవలం 32 టీఎంసీల నీళ్లనే లిఫ్ట్ చేసింది. 2019-20లో మొదట ఎత్తిపోసిన నీళ్లను భారీ వర్షాల కారణంగా కిందికి వదలాల్సి వచ్చింది. దీంతో మళ్లీ 2020–21 సీజన్ ప్రారంభంలో ప్రభుత్వం పంపులు ప్రారంభించాలనుకున్నా.. పాత ఘటనతో వెయిట్ చేశారు. అదే సమయంలో భారీ వర్షాలు కురిశాయి.
ఇక ఈసారి రుతుపవనాలు త్వరగా ప్రవేశించడంతో జూన్ ప్రారంభంలోనే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. మహారాష్ట్రలో కూడా వానలు పడటంతో ప్రాణహిత నదికి వరదలు వచ్చాయి. దీంతో జూన్ 16న మోటర్లు స్టార్ట్ చేసి, జూలై 4 దాకా నడిపించారు. మొత్తం 20 రోజుల్లో 32 టీఎంసీల నీళ్లను అన్నారం బ్యారేజీలోకి, అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీలోకి 29.72 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేశారు. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు 23.32 టీఎంసీలు ఎత్తిపోశారు. కానీ భారీ వర్షాల కారణంగా జూలై మూడోవారంలో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేయడంతో ఎత్తిపోసిన నీళ్లన్నీ కిందికి వదిలేశారు.
ఎత్తుడు.. వదులుడు..
కరెంట్ బిల్లులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్లన్నీ సముద్రంలోకి చేరాయి. 2019లో ప్రారంభించినప్పటి నుంచి మొదలు పెడితే ఈ వానాకాలం వరకు కింది నుంచి నీళ్లు ఎత్తిపోసుడు.. ఎగువ నుంచి వరద రాగానే ఆ నీళ్లను మళ్లీ నదిలోకి వదిలి పెట్టుడు పరిపాటిగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్ 21న అధికారికంగా ప్రారంభించగా, అదే ఏడాది జూలై 6న కన్నెపల్లి పంపుహౌస్‌లో ఒక పంపును నడిపి ఎత్తిపోతలు ప్రారంభించారు.
అన్నారం బ్యారేజీలోకి ఆరు టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోశారు. జూలై 31న మేడిగడ్డ(కన్నెపల్లి) నుంచి ఎత్తిపోతలు బంద్ చేశారు. ఆగస్టు 5న ఎల్లంపల్లికి ఎగువ నుంచి భారీ వరద వచ్చింది. అదే రోజు సుందిళ్ల పంపుహౌస్‌లో ఒక మోటారును కొద్దిసేపు నడిపించి ఆఫ్ చేశారు. 2020లో కూడా మొత్తంగా 32 టీఎంసీలను ఎత్తిపోశారు. ఈ ఏడాది జూలై రెండో వారంలో గోదావరి బేసిన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ముందే అంచనా వేశారు. అయినా ప్రభుత్వం హడావుడిగా జూన్ 16న ఎత్తిపోతలు మొదలుపెట్టి జూలై 7 వరకు మోటార్లు నడిపించింది.
మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజీకి 35 టీఎంసీలు, అక్కడి నుంచి సుందిళ్లకు 30.72, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి 32, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు 23.45 టీఎంసీలు ఎత్తిపోశారు. మిడ్ మానేరు గేట్లు ఎత్తి ఎల్‌ఎండీకి 12.71 టీఎంసీలు తరలించారు. ఇదే సమయంలో వరద పెరగడంతో ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. దీంతో మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోసిన ఆరు టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఎల్లంపల్లికి ఎగువ నుంచి వచ్చిన వరద నీటిలో 12.50 టీఎంసీలు లింక్ -2 ద్వారా మిడ్ మానేరుకు ఎత్తిపోశారు. ఈ రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో నీళ్లు నిలిపేందుకు ప్రయత్నించడంతో కట్టకు బుంగపడి రాత్రికి రాత్రే గేట్లు ఎత్తాల్సి వచ్చింది. ఆ నీళ్లన్నీ ఎల్‌ఎండీలోకి చేరాయి. లోయర్ మానేరు డ్యాంకు ఎగువ నుంచి వరద రావడంతో గేట్లు ఎత్తి ఆ నీటిని మానేరు నదిలోకి వదిలేయాల్సి వచ్చింది.
కరెంట్ బిల్లులు దండుగ..
కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలతో గత ఏడాది వరకు రూ. 2,090 కోట్ల కరెంట్ బిల్లులు రాగా.. ఈ ఏడాది 35 టీఎంసీలు ఎత్తిపోసేందుకు రూ. 990 కోట్లు బిల్లు చెల్లించాల్సి వచ్చింది. సగటున ప్రతీ యూనిట్‌కు రూ. 5.80 నుంచి రూ. 6 వరకు వెచ్చించాల్సి వస్తోంది. వరదలు వచ్చే అవకాశాలున్నాయని ముందస్తుగా హెచ్చరిస్తున్నా.. అధికారులు మోటార్లు ఆన్ చేస్తున్నారు. నీటిని ఎత్తిపోసిన తర్వాత కూడా మళ్లీ సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో కరెంట్ బిల్లులకు వృధాగా ఖర్చు చేస్తున్నట్లేనని ఆరోపణలున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు రూ. లక్ష కోట్ల పైనే ( ఇప్పటికే రూ. 80 వేల కోట్ల పనులు కంప్లీట్)
ప్రాజెక్టును ప్రారంభించింది 2019
తొలి ఏడాది ఎత్తిపోసింది 169 టీఎంసీలు
రెండో ఏడాది 32 టీఎంసీలు
మూడో ఏడాది 35 టీఎంసీలు. ఎత్తిపోసిన నీళ్లు మళ్లీ సముంద్రంలోకి వదిలారు
గోదావరి నుంచి ఎత్తిపోయాలనుకున్న నీరు ఏటా 225 టీఎంసీలు.