ఈ ఉద్యోగులకు పనిచేయకుండానే జీతం.. తెలుసా..?

by Shyam |   ( Updated:2020-11-30 03:40:56.0  )
ఈ ఉద్యోగులకు పనిచేయకుండానే జీతం.. తెలుసా..?
X

గతంలో క్షణం తీరిక లేకుండా గడిపిన వీఆర్‌ఓలు ప్రస్తుతం ఖాళీ చేతులతో తిరుగుతున్నారు. మూడు నెలలుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో కార్యాలయాలకే పరిమితమయ్యారు. ఇతర శాఖల్లోకి బదిలీలకు సంబంధించి క్లారిటీ లోపించింది.

దిశ, సూర్యాపేట: సుమారు మూడు నెలల క్రితం దాదాపుగా 24 గంటల పాటు విధి నిర్వహణలో నిమగ్నమైన వీఆర్వోలు ప్రస్తుతం ఖాళీ చేతులతో కార్యాలయానికే పరిమితమయ్యారు. తహసీల్దార్, ఆర్ఐఏ పని చెబితే దానినే చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో వీఆర్వో వ్యవస్థను ఇప్పటికీ ఏ శాఖలో విలీనం చేయలేదు. ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వీఆర్వోలు ఉదయాన్నే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తమకు ఏదైనా పని ఉంటే చెప్పాలని కోరుతున్నారు.

కేటాయింపుపై కసరత్తు..

జిల్లాలో వీఆర్వోలను పంచాయతీరాజ్, నీటిపారుదల ఉపాధి హామీ, సహకార శాఖకు బదిలీ చేస్తారని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,088 మంది వీఆర్వోలు ఉన్నారు. జిల్లాలో 279 గ్రామ రెవెన్యూలకు 219 మంది వీఆర్వోలు ఉన్నారు. వీరి సేవలో ఎలా వినియోగించుకోవాలనే విషయంపై సర్కార్ కసరత్తు చేస్తోంది.

కార్యాలయాల్లో ఖాళీగా..

వీఆర్వో పై గతంలో పని భారం ఉండేది. సాదాబైనామాల క్రమబద్దీకరణ, భూ వివాదాలు, ప్రభుత్వ పథకాలకు భూ సేకరణ వంటి పనులతో వీఆర్వోలు ఫుల్లు బిజీగా ఉండేవారు. ధ్రువీకరణ పత్రాల విచారణ, గ్రామాల్లో జరిగే ఘటనలపై నివేదిక తదితర పనులు కూడా చేసేవారు. ఈ లెక్కన కొందరు రోజుకు 18 గంటలు పని చేసేవారు. దీనికి తోడు ఒక్కొక్కరికీ 3 నుంచి 4 గ్రామాలకు కూడా ఇన్‌చార్జీలు వ్యవహరించేవారు. అలాగే సదస్సులు, భూ ప్రక్షాళనతో పనిభారాన్ని కూడా మోసేవారు. వీఆర్వో వ్యవస్థను రద్దుతో వారిపై భారం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్యాలయాల్లోనే ధ్రువీకరణ పత్రాల జారీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తులు, ఎమ్మెల్సీ ఓట్లు, ఓటర్ లిస్టు పరిశీలించడానికి పరిమితమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed