ఎమ్మెల్సీ పదవికి దేశపతి పనికిరాడా..? కేసీఆర్‌పై ఉద్యమనేత విఠల్ ఫైర్​

by Sridhar Babu |
vittal-1
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆత్మగౌరవం సంగతి పక్కన పెడితే టీఆర్ఎస్​లో ఉద్యమకారులకు కనీస గుర్తింపు కూడా దక్కట్లేదని ఉద్యమ నేత విఠల్ కేసీఆర్​ప్రభుత్వంపై ఫైరయ్యారు. హైదరాబాద్ లో గురువారం ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఉద్యమకారుల హక్కు అని పేర్కొన్నారు. ఉద్యమకారులంతా బీజేపీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. టీఎస్ పీఎస్సీలో ఖాళీగా ఉన్న 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్​చేశారు. ఉద్యోగాల భర్తీపై మాట్లాడాలని అడిగితే ముఖ్యమంత్రి తనకు సమయం కూడా ఇవ్వలేదన్నారు.

ఎమ్మెల్సీ పదవికి ఉద్యమకారుడు దేశపతి పనికిరాడా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందని దాదాపు ఏడాది కాలంగా తాను ఎదురుచూసినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్ తన స్థాయిని తానే తగ్గించుకున్నాడని చురకలంటించారు. తెలంగాణను.. కాంగ్రెస్ ఇచ్చి‌న మాట వాస్తవం.. కానీ ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ తీవ్రంగా విఫలమైందన్నారు. యావత్​తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన వెల్లడించారు. బీజేపీలో మాత్రమే ఆత్మగౌరవం దక్కుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. జాతీయ పార్టీలో నాయకత్వం ఇచ్చిన ఏ పని అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed