మీ త్యాగాలను మరువలేం.. వీర జవాన్లకు క్రికెటర్ల నివాళి

by Shyam |
మీ త్యాగాలను మరువలేం.. వీర జవాన్లకు క్రికెటర్ల నివాళి
X

దిశ, స్పోర్ట్స్: ఇండో-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయ ప్రాంతంలో చోటుచేసుకున్న తీవ్ర హింసాత్మక ఘటనలో ఆర్మీ కల్నల్ సంతోష్ బాబు సహా మరో 19 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. ఈ ఘటనపై యావత్ దేశం చైనాపై మండిపడుతోంది. డ్రాగన్ కంట్రీపై తమ ఆగ్రహాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టు క్రికెటర్లు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అమర జవాన్ల కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు.

గాల్వాన్ లోయలో దేశ రక్షణ కోసం పోరాడి అమరులైన జవాన్లకు నా పాదాభివందనం. సైనికులను మించిన నిస్వార్థులు, ధైర్యవంతులు అసలు లేరు. వీర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని ఆశిస్తున్నా – విరాట్ కొహ్లీ

దేశం కోసం పోరాడుతూ సరిహద్దుల్లో వీరమరణం పొందిన మన రియల్ హీరోలకు సెల్యూట్. మరణించిన వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా – రోహిత్ శర్మ

గల్వాన్ లోయలో దేశం కోసం పోరాడి మరణించిన భారత జవాన్లారా.. మీ త్యాగాలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం – ఇర్ఫాన్ పఠాన్

మాతృభూమి రక్షణ కోసం రాత్రనకా, పగలనకా కష్టపడుతున్న వీర జవాన్లకు నా బిగ్ సెల్యూట్. ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి – ఇషాంత్ శర్మ

గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో వీర మరణం పొందిన కర్నల్ సంతోష్ బాబుకు నా హృదయపూర్వక సంతాపం ప్రకటిస్తున్నా. ఒక వైపు దేశం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే మరో వైపు ఇలాంటి ఘోరాలు జరగడం బాధకరం. ఇదే చివరిది కావాలని కోరుకుంటున్నా – వీరేంద్ర సెహ్వాగ్

చైనా సరిహద్దు గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన జవాన్ల ధైర్యానికి నా సెల్యూట్. ఈ దారుణాలన్నీ ఆగిపోవాలి. ఎంతో విలువైన మానవ జీవితానికి అవసరమైన శాంతియుత ప్రపంచం కావాలి. అమరులైన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా – యువరాజ్ సింగ్

గాల్వాన్ లోయలో ప్రాణాలు వదిలిన వీర జవాన్లకు నా నివాళులు. మీ త్యాగం నేను, ఈ దేశం ఎప్పటికీ మరవదు. సెల్యూట్ హీరోస్, జైహింద్ – అమిత్ మిశ్రా

ఇప్పటికైనా డ్రాగన్ కంట్రీ చేసిన దారుణానికి బదులివ్వాలి, ఆ దేశ ఉత్పత్తులను నిషేధించాలి– హర్భజన్ సింగ్

ఇరవై మంది సైనికులు వీర మరణం పొందడం బాధాకరం. సోదరులారా మీ ఆత్మకు శాంతి కలగాలి. మీ ధైర్యసాహసాలకు నా వందనం. మీ త్యాగం మరువలేనిది. దేశం మొత్తం ఐక్యంగా నిలబడాల్సిన సమయం ఇది – సురేష్ రైనా

Advertisement

Next Story

Most Viewed