వినాయక మండపాలకు నో పర్మిషన్ : ఎస్పీ

by Anukaran |
వినాయక మండపాలకు నో పర్మిషన్ : ఎస్పీ
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విపత్కర పరిస్థితులలో వినాయక నవరాత్రుల కోసం మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.

ఈ నెలలో వినాయక చవితి పర్వదినోత్సవం సందర్భంగా జిల్లాలో పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రులు నిర్వహించడానికి మండపాల నిర్వాహకులు సన్నద్ధమవుతున్న క్రమంలో ప్రస్తుత విపత్కర పరిస్థితులు, కరోనా వ్యాప్తి నియంత్రణ విషయంలో అన్ని స్థాయిలలో ప్రజలకు అవగాహన కల్పించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పోలీస్ శాఖతో కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు. భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రులను ఈ ఏడాది ప్రజలంతా తమ తమ ఇండ్లలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.

విగ్రహాల తయారీదారులు కొవిడ్ కేసులు, విపత్కర పరిస్థితుల క్రమంలో వినాయక విగ్రహాలను తయారు చేసి ఇబ్బందులు పడవద్దన్నారు. ఎట్టి పరిస్థితులలో నవరాత్రుల నిర్వహణకు పోలీస్ శాఖ నుండి అనుమతులు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉంటూ కరోనా వ్యాప్తి నియంత్రణకు తమతో సహకరించాలని ఎస్పీ రంగనాధ్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed