పోలీసులను పొలిమేర వరకు తరిమిగొట్టిన గ్రామస్తులు

by Sumithra |
పోలీసులను పొలిమేర వరకు తరిమిగొట్టిన గ్రామస్తులు
X

దిశ, బాల్కొండా: కమ్మర్ పల్లి మండలం హసకొత్తూర్‌ గ్రామంలో సిద్ధార్థ (18) అనే యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హత్యకు కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బాధితులు శుక్రవారం హసకోత్తుర్‌లో ఆందోళనకు దిగారు. సిద్ధార్థను ఇంటినుంచి తీసుకువెళ్లిన అతని స్నేహితుడిని గ్రామస్థుల సమక్షంలోనే విచారించాలని పట్టుబట్టారు. సిద్ధార్థ హత్యకు గల కారణాలను బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు. వారిని సముదాయించేందుకు పోలీసులు యత్నించారు. ప్రధాన సాక్షిని స్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

ఆ వెంటనే గ్రామస్తులు రాళ్లతో పోలీస్ వాహనాలపై దాడి చేయగా పెట్రోలింగ్ వాహనం ధ్వంసమైంది. అంతకుముందు పోలీసులు శుక్రవారం సీన్ రిక్రియేషన్ కోసం ప్రయత్నించగా ఈ ఘటన చోటుకుంది.చివరకు గ్రామస్తులు మూకుమ్మడిగా పోలీసులు గ్రామంలో ఉండవద్ధని, వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఊరి పొలిమేర వరకు తరిమిగొట్టారు. పోలీసులను వెనక్కి పంపి తిరిగి వస్తున్న క్రమంలో నిందితుడి ఇంటి వద్దకు చేరిన గ్రామస్తులు అతని ఇంటి గేటును ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఇంట్లోకి వెళ్లి కుర్చీలు, కూలర్‌‌ వంటి ఇతర వస్తువులను బయటకు తెచ్చి తగలబెట్టారు.

ఏసీపీ హామీతో ఆందోళన విరమణ..

ఈ పరిణామాల తరువాత ఏసీపీ రఘు గ్రామస్తులతో మాట్లాడుతూ.. మీ ఆధినంలో ఉన్న బాలుడిని మాకు అప్పజెప్పితే కేసును విచారణ చేపట్టడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులు ఎంతటివారైన వదిలిపెట్టమని చట్ట ప్రకారం వారిని కఠినంగా శిక్షిస్తామని ఏసీపీ రఘు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు సాక్షిని పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed