సమస్యలు పరిష్కరించండి.. NTPC అధికారులను నిలదీసిన గ్రామస్తులు

by Sridhar Babu |   ( Updated:2021-10-21 06:23:31.0  )
సమస్యలు పరిష్కరించండి.. NTPC అధికారులను నిలదీసిన గ్రామస్తులు
X

దిశ, గోదావరిఖని : ఎన్టీపీసీ యాజమాన్యం తమ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని అంతర్గాం మండలం ఎన్టీపీసీ దత్తత గ్రామం కుందనపల్లి గ్రామ ప్రజలు నిరసన తెలిపారు. గురువారం రామగుండం పట్టణం అక్బర్ నగర్ సమీపంలోని బూడిద చెరువు పనులను అడ్డుకుని గ్రామస్తులు గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధిత గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చాలని, కనీస వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు.

20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, గ్రామ మాజీ సర్పంచ్ మేకల సరస్వతీ మైసయ్యలు ఆందోళనకు మద్దతు తెలుపుతూ గ్రామస్తులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీపీసీ అధికారులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించినప్పటికీ కనీస అవసరాలైన మంచినీరు రాక నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదురైతే అధికారులు.. ఎన్టీపీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తే నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారు తప్ప.. నీటి సరఫరాలో శాశ్వత పరిష్కారం చూపించలేదని మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏ అధికారిని కలవాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

దత్తత గ్రామాల ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం, అభివృద్ధి పనులు చేపట్టడం యాజమాన్యం కనీస బాధ్యత కాదా అని అధికారులను నిలదీశారు. తమ గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, డిపెండెంట్ ఉద్యోగాల నియామకం, మౌలిక వసతుల కల్పనపై కచ్చితమైన హామీ ఇచ్చేంత వరకు తమ ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. కాగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అధికారి డి.ఎస్ కుమార్, వాటర్ సెక్షన్ అధికారులు రాజశేఖర్, రాజేశం.. వారం రోజుల్లోగా మంచినీటి సరఫరాను పునరుద్ధరిస్తామని, శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.

మౌలిక వసతుల కల్పన, ఇతర అంశాలపై మళ్లీ గురువారంలోపు అధికారులు, గ్రామ ప్రజలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని కచ్చితమైన హామీ ఇచ్చి వారి ఆందోళన విరమింపజేశారు. అయితే, వారం రోజుల్లోపు కుందనపల్లి 20వ డివిజన్ పరిధిలోని మల్యాలపల్లి బాధిత గ్రామాల ప్రజల మంచినీటి సరఫరా, సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయకపోతే మళ్లీ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అప్పుడు ఎటువంటి అడ్డంకులు సృష్టించినా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరసన విరమించబోమని అధికారులకు తేల్చి చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు ఇఫ్తికార్, తంబాడి శంకర్, ఇంతియాజ్, కుమార్, శేఖర్, శ్రీనివాస్, కొండల రాజేందర్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed