కార్యదర్శులపై ఫుల్ వర్క్‌ప్రెషర్..!

by Shyam |   ( Updated:2020-09-09 03:52:45.0  )
కార్యదర్శులపై ఫుల్ వర్క్‌ప్రెషర్..!
X

పంచాయతీ కార్యదర్శులకు పనిభారం పెరుగుతోంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులు ప్రతి పనికి కార్యదర్శులను బాధ్యులను చేస్తున్నారు. పని ఒత్తిడికి కార్యదర్శులు విధులు నిర్వహించేందుకు మూడు అడుగులు ముందుకు, ఏడు అడుగులు వెనకకు వేస్తున్నారు. ‘మూలిగేనక్కపై తాటిపండు పడినట్లు’ పని ఒత్తిడితో సతమతమవుతున్న కార్యదర్శులకు పంచాయతీలో ప్రతి నెల మొదటి 15 రోజుల్లో 75శాతం పన్నులు వసూలు చేయాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో కార్యదర్శులు కొట్టుమిట్టాడుతున్నారు.

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో 560, వికారాబాద్ జిల్లాలో 565 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి సమస్య పంచాయతీ కార్యదర్శిని బాధ్యుడిని చేస్తూ నిర్ణయాలు తీసుకుంది. దీంతో పూర్తి స్థాయిలో కార్యదర్శుల పోస్టులు భర్తీ చేశారు. పైఅధికారుల ఒత్తిడి తట్టుకోలేక అనేక మంది ఉద్యోగం వదులుకున్న సంఘటనలు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 560 పంచాయతీ కార్యదర్శులకు 532 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 28 మంది వివిధ కారణాలతో ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఖాళీలను భర్తీ చేశారు. కానీ మళ్లీ నలుగురు ఉద్యోగులు లాంగ్​లీవ్ పెట్టారు. ఇలాంటి సమస్యలతో ఉద్యోగం చేయడం ఏలా అనే ప్రశ్న కార్యదర్శులో మొదలైంది.

పన్నుల వసూలు..

ప్రతి గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తిపై తీసుకోవాల్సిన చర్యలపై నిత్యం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పరిశీలన చేయాల్సి ఉంది. దీంతో పాటు పన్నులు వసూలు చేయాలని కార్యదర్శులను కలెక్టర్, డీపీవోలు ఆదేశించారు. ఆగస్టు 26వరకే 75 శాతం పన్ను వసూలు చేయాలని, లేకపోతే సంజాయిషీ ఇవ్వాలన్నారు. దీంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పనిచేసే కార్యదర్శులతో ముందుగానే ఈ నెల 9లోపు పన్ను వసూలు పూర్తి చేస్తామ ని సంజాయిషీ తీసుకున్నారు. కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారులు సెప్టెంబర్ 31వరకు లక్ష్యం చేరుకుంటామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో గ్రామాల్లో కార్యదర్శులు వసూళ్లకు ఇండ్లకు వెళ్తుంటే ప్రజలు కరోనా కాలంలో పన్నులు ఎలా కడుతామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వాపోతున్నారు. నిర్దేశిత లక్ష్యం చేరుకోవడం కష్టమేనని పేర్కొంటున్నారు.

విధి నిర్వహణ భారంగా మారింది..

ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఇలాంటి సమయంలో గ్రామాల్లో ప్రజలు ఉపాధి లేక పన్నులు చెల్లించలేక పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ వ్యవసాయంపై ఆధారపడిన వారే. ఇప్పుడే పంటల కోసం పెట్టుబడి పెట్టారు. వారికి డబ్బు లేకపోవడంతో పంటలు చేతికి వచ్చిన తర్వాతనే పన్నులు చెల్లిస్తామని చెబుతున్నారు. అధికారులు మాత్రం కార్యదర్శులపై ఒత్తిడి పెంచి నిర్ధేశించిన సమయంలో పన్నులు వసూలు చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో కార్యదర్శులకు విధులు నిర్వహించడం భారంగా మారింది.

–సురేష్ గౌడ్, రాష్ట్ర పంచాయతీ, కార్యదర్శుల ఆర్గనైజింగ్ సెక్రెటరీ

Advertisement

Next Story

Most Viewed