రోడ్డుకు అడ్డంగా చెట్టు.. పక్కకు జరిగిన రోడ్డు!

by Shyam |
రోడ్డుకు అడ్డంగా చెట్టు.. పక్కకు జరిగిన రోడ్డు!
X

ప్రకృతిని ప్రేమించాలి.. అంటూ ప్రచారం చేస్తే సరిపోదు, దాన్ని పాటించగలగాలి. ముఖ్యంగా వారసత్వంగా వస్తున్న ప్రకృతి అందాలను కాపాడుకోవడంలో ఈ ప్రేమను నిలకడగా ఉంచుకోగలగాలి. మానవ అవసరాల కోసం ప్రకృతి ప్రసాదాలను కాదనుకోవడం నిజంగా పొరపాటే. అడవిని పడగొట్టి పార్కులు కట్టడం కన్నా బుద్ధి తక్కువ చర్య మరొకటి ఉండదేమో! ఇంచుమించు ఇలాంటి సమస్యే మహారాష్ట్ర, సంగ్లీ జిల్లాలోని భోసే గ్రామ ప్రజలకు ఎదురైంది. కానీ వారు మాత్రం ‘తామేం బుద్ధి తక్కువ వాళ్లం కాదని’ నిరూపించుకున్నారు. 400 ఏళ్ల నాటి మర్రిచెట్టును ఆందోళనలు చేసి మరీ రక్షించుకున్నారు. లాక్‌డౌన్ కాబట్టి పెద్ద ఎత్తున ధర్నాలు చేయలేకపోయారు గానీ, వర్చువల్‌గా తమ వంతు ప్రయత్నం చేసి విజయం సాధించారు. ఇంతకీ ఆ కథ ఏంటి?

రహదారుల నిర్మాణంలో భాగంగా రత్నగిరి-సోలాపూర్ హైవేకు అనుసంధానంగా రాష్ట్ర హైవే 166 రహదారి భోసే గ్రామం గుండా వెళ్తోంది. అయితే ఈ రోడ్డు ప్లాన్‌లో భాగంగా ఎల్లమ్మ గుడి దగ్గరి మర్రిచెట్టును తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోడ్డు పడితే ఆ ఊరికి రవాణా పెరుగుతుంది. అందరూ అభివృద్ధి చెందుతారు. కానీ అది జరగాలంటే 400 ఏళ్ల నాటి మర్రిచెట్టును తొలగించాలి. ఎన్నో పక్షులు, సరీసృపాలకు నిలయమై, పక్కనే ఎల్లమ్మ దేవతతో సమానంగా పూజలు అందుకునే ఆ మర్రిచెట్టును పోగొట్టుకోవడానికి ఆ ఊరి ప్రజలకు మనసు రాలేదు. 400 చదరపు అడుగుల వైశాల్యాన్ని ఆక్రమించిన ఆ చెట్టును యంత్రాలతో 4 నిమిషాల్లో నేలమట్టం చేసి, అక్కడ రోడ్డు వేస్తారన్న ఆలోచనే వారిలో కలవరం సృష్టించింది. దీంతో దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాలని అంతా నిర్ణయించుకున్నారు.

ఇప్పుడు లాక్‌డౌన్ కాబట్టి ధర్నాలు, బహిరంగ ఆందోళనలు చేయలేరు. అందుకే సోషల్ మీడియాను వారధిగా చేసుకున్నారు. ‘సహ్యాద్రి సంఘటన్’ పేరుతో ఒక ఫేస్‌బుక్ గ్రూప్ క్రియేట్ చేసి, అందులో ఆ మర్రిచెట్టు ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని కీర్తిస్తూ వీడియోలు చేసి పెట్టారు. ఒకప్పటి చిప్కో ఉద్యమం రీతిలో ఒకరి చేతులు ఒకరు తాళ్లతో పట్టుకుని సామాజిక దూరం పాటిస్తూ చెట్టు చుట్టూ నిలబడి వీడియో తీశారు. రోడ్డు వల్ల తమ వారసత్వ సంపద పోతుందని పోస్టులు పెట్టారు. ఊరంతా కలిసి గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం తీసుకుని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. అందరూ ఒక్క తాటి మీద నిలబడి మర్రిచెట్టు గురించి వైరల్ చేశారు. అంతే.. వారి సమస్య చేరాల్సిన చోటికి చేరింది.

జులై 16న రాష్ట్ర పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాక్రే.. ఈ విషయం గురించి స్పందించారు. ఎలాగైనా చెట్టును కాపాడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చినట్లుగానే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఈ విషయం గురించి చర్చించారు. వెంటనే అధికారులకు ఆదేశాలు వచ్చాయి. చెట్టును కదల్చకుండా, ఎలాంటి హాని తలపెట్టకుండా కొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలనేది ఆ ఆదేశాల సారాంశం. అందుకే రోడ్డుకు అడ్డంగా ఉందని చెట్టును తొలగిద్దాం అనుకుంటే రోడ్డే పక్కకు జరిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అందరూ అంటున్నారు.

Advertisement

Next Story