ఆరెప‌ల్లిలో అన్న‌దాతల‌ ఆందోళ‌న

by Kalyani |
ఆరెప‌ల్లిలో అన్న‌దాతల‌ ఆందోళ‌న
X

దిశ‌, హ‌న్మ‌కొండ/ వ‌రంగ‌ల్‌ : వ‌రంగ‌ల్ జిల్లా ఆరెప‌ల్లి గ్రామ శివారులోని కొత్త‌పేట క్రాస్ రోడ్డు వ‌ద్ద రైతులు, నివాస స్థ‌లాలు కోల్పోతున్న వారు శ‌నివారం ఆందోళ‌న చేశారు. బై పాస్ రోడ్డు స‌ర్వేకు వ‌చ్చిన అధికారుల‌ను రైతులు అడ్డుకున్నారు. రెండు పంట‌లు పండే త‌మ విలువైన భూములను బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ఎట్టి ప‌రిస్థితుల్లో ఇవ్వ‌బోమ‌ని తేల్చి చెప్పారు. దీంతో అధికారులు స‌ర్వేను నిలిపివేసి వెనుదిరిగారు. ఈ సంద‌ర్భంగా రైతులు మాట్లాడుతూ… ఆరెప‌ల్లి శివారులోని ఇస్కాన్ టెంపుల్‌కు స‌మీపం జాతీయ ర‌హ‌దారి 163 అనుసంధానం చేస్తూ ఇంట‌ర్న‌ల్ రింగ్ రోడ్డు (ఐఆర్ ఆర్‌)ను కుడా మాస్ట‌ర్ ప్లాన్ 2041లో ప్ర‌తిపాదించారన్నారు. మళ్లీ పైడిపల్లి నుంచి ఆరెపల్లి మీదుగా కొత్త‌పేట క్రాస్ రోడ్డు వ‌ర‌కు మ‌రోక బైపాస్ రోడ్డును ప్ర‌తిపాదించడంతో విలువైన త‌మ పంట‌పొలాల న‌ష్ట‌పోతున్నామ‌న్నారు.

ఒక మాజీ ఎమ్మెల్యేకు, ఒక స్కూల్‌, ఆస్ప‌త్రి యాజ‌మాన్యానికి, కొంద‌రు రాజ‌కీయ నేతలు, వ్యాపారులకు మేలు చేసేలా బైపాస్ రోడ్డును పచ్చ‌ని పంట పొలాల మ‌ధ్య నుంచి వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని రైతులు ఆరోపించారు. ఐ ఆర్ ఆర్ నుంచి ఓ ఆర్ ఆర్‌కు అనుసంధానం చేస్తూ ఈ బై పాస్ రోడ్డును నిర్మిస్తామ‌ని కుడా అధికారులు చెబుతున్న‌ప్ప‌టికీ ఈ రోడ్డును ఓ ఆర్ ఆర్‌కు అనుసంధానం చేయ‌కుండా ఓ ఆస్ప‌త్రి వెనుక నుంచి సుమారు 90 డిగ్రీల కోణం వంక (క్రాస్‌)తో అశాస్త్రీయంగా జాతీయ ర‌హ‌దారికి క‌ల‌పే ప్ర‌య‌త్నం చేయడం అనేక అనుమానుల‌కు తావిస్తోంద‌న్నారు. వ‌రంగ‌ల్ ఆర్డీవో, త‌హ‌సీల్దార్ గ‌తంలో విడుద‌ల చేసిన‌ స‌ర్వే నెంబ‌ర్ల తో కూడిన భూ సేక‌ర‌ణ జాబితా ప్ర‌కారం కాకుండా, కొత్త‌గా రెండు సార్లు మార్కింగ్ మార్పు చేయ‌డం వెనుక అధికారుల అవినీతి దాగుంద‌ని రైతులు ఆరోపించారు.

గ‌తంలో జాతీయ ర‌హ‌దారి నిర్మాణం కోసం త‌మ రైతుల పంట పొలాలు పోయాయ‌ని, మాస్ట‌ర్ ప్లాన్‌ 2041లో మ‌ళ్లీ 200 ఫీట్ల బై పాస్ రోడ్డు, 300 ఫీట్ల ఓర్ ఆర్ ఆర్ ను ప్ర‌తిపాదించ‌డంతో ఎక్కువ మొత్తంలో త‌మ పంట పొలాల‌ను కోల్పోయే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్నారు. రైతుల‌కు, మ‌ధ్య‌, పేద త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు తీవ్ర న‌ష్టం చేకూర్చే విధంగా అశాస్త్రీయంగా రూపొందించిన బై పాస్ రోడ్డుకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ భూములు ఇవ్వ‌బోమ‌ని, బై పాస్ రోడ్డు నిర్మాణ‌ ప్ర‌తిపాద‌న‌ను వెంట‌నే విర‌మించుకోవాల‌ని కోరారు. కొత్తపేట 100 ఫీట్ల రోడ్డు ను గానీ, పానాది బాటను గాని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గడంతో పాటు ప్రజలందరికీ మేలు జరుగుతుందని వారు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో పైడిప‌ల్లి, ఆరెప‌ల్లి, కొత్త‌పేట త‌దిత‌ర గ్రామాల రైతుల‌, నివాస స్థ‌లాల వారు పాల్గొన్నారు.

బైపాస్ రోడ్డును ర‌ద్దు చేయాలి : కుడా వైస్ చైర్మ‌న్‌కు రైతుల విన‌తి

పైడిప‌ల్లి నుంచి ఆరెప‌ల్లి మీదుగా కొత్త‌పేట క్రాస్ రోడ్డు వ‌రకు ప్ర‌తిపాదించిన బై పాస్ రోడ్డుతో త‌మ పంట పొలాలు న‌ష్ట‌పోనున్నాయ‌ని, ప్ర‌తిపాదిత బైపాస్ రోడ్డును ర‌ద్దు చేయాల‌ని ఆరెప‌ల్లి, పైడిప‌ల్లి గ్రామాలకు చెందిన రైతులు కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథార‌టీ (కుడా) వైస్ చైర్మ‌న్ అశ్వినీని కోరారు. బై పాస్ రోడ్డు నిర్మాణంతో పంట పొలాల‌ను కోల్పోతున్న‌ రైతులు, నివాస స్థ‌లాలు కోల్పొతున్న సుమారు 50 మంది ప్ర‌జ‌లు కుడా వైస్ చైర్మ‌న్ అశ్వినిని ఆమె కార్యాల‌యంలో శ‌నివారం క‌ల్సి విన‌తి ప‌త్రాన్ని అంద‌జేశారు.

మాజీ ఎమ్మెల్యేకు, ఒక స్కూల్‌, ఆస్ప‌త్రి యాజ‌మాన్యానికి, కొంద‌రు వ్యాపారుల‌కు ల‌బ్దీ చెందే విధంగా అశాస్త్రీయంగా సుమారు 90 డిగ్రీల కోణంలో వంక‌తో రూపొందించిన బై పాస్ రోడ్డు ప్ర‌తిపాద‌న‌ను విర‌మించుకోవాల‌ని ఆమెను కోరారు. ఇప్ప‌టికే జాతీయ ర‌హ‌దారి నిర్మాణం కోసం త‌మ పంట‌పొలాల‌ను కోల్పోయామ‌ని, మ‌ళ్లీ 200 వంద‌ల ఫీట్ల ఐఆర్ ఆర్ బై పాస్ రోడ్డును, 300 ఫీట్ల ఓఆర్ ఆర్ ను ప్ర‌తిపాదించ‌డంతో త‌మ‌కు తీర‌ని న‌ష్టం క‌ల‌గ‌నుంద‌ని వారు ఆవెద‌న వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నెమ‌ర‌గొమ్ముల వెంగ‌ళ్‌రావు, బుద్దె గ‌ణేశ్‌, శ్రీనివాస్‌, సుంక‌రి ప్ర‌శాంత్‌, రామెంద‌ర్ రెడ్డి, బుద్దె కృష్ణ‌మూర్తి, జితేంద‌ర్‌, క్రాంతి, తదిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed