‘దర్శనమే దొరకని సీఎం చేతికి ఆరోగ్య శాఖ’

by Anukaran |
‘దర్శనమే దొరకని సీఎం చేతికి ఆరోగ్య శాఖ’
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సీఎం కేసీఆర్ చేతిలోకి వెళ్లడంపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుత పరిణామాల్లో రాష్ట్ర ప్రజలు భీతిల్లిపోయే పరిస్థితి ఉందని, రాష్ట్రంలో కరోనా కట్టడి తీరుపై హైకోర్టులో మందలింపులు, హెచ్చరికలకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు వైద్యారోగ్య శాఖ సీఎం కేసీఆర్ చేతుల్లోకి వెళ్లిందని, ఈ పరిణామంతో రాష్ట్ర ప్రజలు మరింత భయపడిపోయే పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. సీఎం దర్శనం దొరకడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో వైద్య శాఖ లాంటి కీలక శాఖ సీఎం కేసీఆర్ చేతుల్లోకి వెళ్లిందని ఎద్దేవా చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అత్యున్నత స్థాయి అధికారులకు సైతం కేసీఆర్ అందుబాటులో ఉండరని, అలాంటి వారి చేతుల్లోకి ఆరోగ్య శాఖ వెళ్లడం ప్రజల్ని కలవరానికి గురి చేస్తోందని విజయశాంతి సెటైర్ వేశారు.

Advertisement

Next Story