హైకోర్టు మొట్టికాయలు వేస్తేనే ప్రభుత్వానికి తెలిసోస్తుందా : విజయశాంతి

by Shyam |
హైకోర్టు మొట్టికాయలు వేస్తేనే ప్రభుత్వానికి తెలిసోస్తుందా : విజయశాంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో స్కూళ్ల ఓపెనింగ్ విషయంలో ప్రభుత్వానికి ముందు చూపులేదని, హైకోర్టు మొట్టికాయలు వేస్తేనే ప్రభుత్వానికి తెలిసోస్తుందా? అని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం ఆమె ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో విద్యాసంస్థల్ని తెరిచి ప్రత్యక్ష తరగతుల్ని నిర్వహించే విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృష్టితో ఆలోచించాలని సూచించారు. కొవిడ్ తీవ్రత ఇంకా ఉందని, సెప్టెంబరు, అక్టోబరులో 3వ దశ పొంచి ఉందన్న హెచ్చరికలను న్యాయమూర్తులు గుర్తు చేశారన్నారు.

గురుకులాలు, హాస్టళ్లల్లో ప్రత్యక్ష బోధన వద్దని, హాస్టళ్లను తెరవొద్దని, అక్కడి వసతులపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. అధిక పాఠశాలల్లో ఫర్నిచర్ లేదని, గోడలు-పైకప్పులు తడిచాయని, తాగునీరు-మరుగుదొడ్ల సౌకర్యాలు లేవని, కొన్ని బడుల్లో కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ నిలిపివేత తదితర సమస్యల్ని ప్రస్తావించిందన్నారు. భావితరానికి భవిష్యత్ ఇవ్వాల్సిన సర్కారే ఆలోచనారాహిత్యంగా వ్యవహరించడం దురదృష్టకరం అన్నారు.

ఉస్మానియా మాజీ డీన్ అధ్యయనంలో బయటపడిన పలు అంశాలపై తెలంగాణ సర్కారు ఇప్పటికీ పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థల్లో శానిటైజేషన్, భౌతికదూరం, మాస్కుల ధారణ వంటి చర్యలు సక్రమంగా అమలవుతాయా?… అనే ఆందోళన విద్యావేత్తలు, వైద్యులు, తల్లిదండ్రుల్లో నెలకొందన్నారు. ఇవన్నీ వీలైనంత త్వరలో సరిదిద్దాకే విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించే విషయమై ఆలోచన చేయాలని కోరారు. వసతులపై నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశంలోని ఆంతర్యాన్ని పాలకులు ఇకనైనా అర్థం చేసుకుని ముందుకెళ్లాలని కోరారు.

Advertisement

Next Story