హైకోర్టు సీజే వ్యాఖ్యలతోనైనా కేసీఆర్ ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలి.. విజయశాంతి

by Shyam |
vijaya shanthi
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ ధనిక రాష్ట్రంగా చెప్పుకునే రాష్ట్ర రాజధాని.. విశ్వనగరంగా ఆయన పదే పదే డబ్బా కొట్టుకునే హైదరాబాద్ నగరంలోని పురాణ కాలపు మూసీనది, చారిత్రక హుస్సేన్ సాగర్ నిర్వహణ తీరుతెన్నులపై హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ చేసిన వ్యాఖ్యలతోనైనా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని బీజేపీ నేత విజయశాంతి బుధవారం ట్విట్టర్​వేదికగా పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ వద్ద వెలువడుతున్న దుర్వాసనతో 5 నిమిషాలు కూడా నిలబడలేకపోయానని.. హైకోర్టు పక్కనున్న మూసీని చూసి మురుగునీటి నాలా అనుకున్నానని.. ఆయన అన్న మాటలు తెలంగాణ సర్కారుకు ప్రజారోగ్యంపై ఉన్న శ్రద్ధ ఏంటన్నది అర్థమవుతోందని విమర్శించారు. ఇది చాలక.. ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై సండే.. ఫన్ డే పేరిట ఏదో పర్యాటకాన్ని ఉద్ధరిస్తున్నట్టు జనాన్ని రప్పించి, నాలుగు షాపులు పెట్టించి ఆ దుర్వాసన మధ్య వారందరినీ ఆనారోగ్యం పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇప్పటికే జంటనగరాల్లో నాలుగు చినుకులు పడితే ప్రతి ప్రాంతం ఒక చెరువులా మారిపోయి కనీసం వారం పాటు తేరుకునే పరిస్థితి లేదన్నారు. రాజధానిని డల్లాస్.. ఇస్తాంబుల్ ఇంకేవేవో చేస్తానని గుంత కనబడితే రూ.వెయ్యి ఇస్తామని కబుర్లు చెప్పారని మండిపడ్డారు. జనాన్ని బురిడీ కొట్టించడంలో తెలంగాణ పాలకులు ఆరితేరిపోయారని విమర్శలు చేశారు. గుజరాత్‌లోని బీజేపీ సర్కార్​అక్కడి సబర్మతీ నదిని స్వర్గతుల్యంగా మార్చిన తీరును.. కేసీఆర్ గ్రహించాలని సూచించారు. అవసరమైతే పీసీబీ బృందాలను పంపి అధ్యయనం చేయించాలన్నారు.

ఒకనాడు లేక్ సిటీగా దాదాపు 600 పైచిలుకు చెరువులతో అలరారిన హైదరాబాద్ నగరం నేడు నరకానికి నకలుగా మారిందన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆవేదనను ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణలోని చాలా చెరువులు ఆక్రమణలకు గురై దాదాపు కనుమరుగైన పాపంలో అధికార పార్టీ నేతల పాత్ర కూడా ఉందనడం కాదనలేని సత్యమని ఆమె చురకలంటించారు.

Advertisement

Next Story

Most Viewed