టీడీపీపై టీమిండియా క్రికెటర్ ఫౌండేషన్ ఆగ్రహం

by srinivas |
టీడీపీపై టీమిండియా క్రికెటర్ ఫౌండేషన్ ఆగ్రహం
X

దిశ, స్పోర్ట్స్: తెలుగు దేశం పార్టీపై ప్రముఖ క్రికెటర్ హనుమ విహారికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల తిరుపతిలో భారీ వర్షాలు, వరదల కారణంగా వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోకి నీరు చేరి తిండి, ఆశ్రయం లేక నానా ఇబ్బందులు పడ్డారు. వీరికి విహారి ఫౌండేషన్ సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. సదరు స్వచ్చంద సంస్థకు చెందిన వాలంటీరు తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ ఆహారంతో పాటు ఇతర సహాయాన్ని అందించారు. అయితే ఆ ఫొటోలనే టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్ట్ సంస్థలు తమ సేవా కార్యక్రమాలుగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాయి.

దీనిపై హనుమ విహారి స్వచ్చంద సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీకి చెందిన రవి, లోకేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్ ట్రస్ట్‌కు చెందిన టీ షర్టులను ధరించి కార్యాక్రమాల్లో తాము పిలవకపోయినా వచ్చి పాల్గొన్నారని.. అవే ఫొటోలను టీడీపీ సాయం చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టు చేసి.. ఏపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారని విహారి ఫౌండేషన్ ఆరోపించింది. టీడీపీని విమర్శిస్తూ ఘాటుగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. పచ్చ టీషర్టులు వేసుకొని వచ్చినంత మాత్రాన తెలుగు దేశం సహాయం చేస్తున్నట్లు కాదని ట్వీట్ చేసింది. అయితే ఏం జరిగిందో కానీ కాసేపటి తర్వాత విహారి ఫౌండేషన్ సదరు ట్వీట్లను డిలీట్ చేసింది. అయితే అప్పటికే కొన్ని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Advertisement

Next Story