టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు రూ.1.69 కోట్ల ఫైన్

by srinivas |
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు రూ.1.69 కోట్ల ఫైన్
X

దిశ, ఏపీ బ్యూరో : గుంటూరు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ​నాలుగేళ్ల నుంచి అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్నట్లు విజిలెన్స్​ అధికారులు గుర్తించారు. దీంతో ఆయనకు ఏకంగా రూ.1.69 కోట్ల అపరాధ రుసుం విధించారు. దీనికి సహకరించిన విద్యుత్​ అధికారులపై కూడా ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీధర్​కు సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో శ్రీనాగమల్లేశ్వరి స్పిన్‌టెక్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో స్పిన్నింగ్‌ మిల్లు, గాయత్రి శ్రీనారాయణస్వామి జిన్నింగ్‌ మిల్లు ఉన్నాయి. జిన్నింగ్‌ మిల్లుకు సంబంధించి సర్వీసు నంబరు జీఎన్‌టీ 3231కి విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోవడంతో 2016 డిసెంబర్‌ 15న అధికారులు తనిఖీ చేశారు. బిల్లు చెల్లించనందుకు డీఫాల్ట్‌ చేసి నోటీసులిచ్చారు. రూ.19 లక్షల విద్యుత్‌ బిల్లు, రూ.ఐదు లక్షల సర్‌చార్జీ కలిపి మొత్తం రూ.24 లక్షలు పెండింగ్‌ ఉండటంతో విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించారు. ఆ తర్వాత కూడా కొమ్మాలపాటి ఆ బిల్లును చెల్లించలేదు.

కొమ్మాలపాటి ఆ సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం, అప్పటి వినుకొండ ఎమ్మెల్యే, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు స్వయానా వియ్యంకుడు కావడంతో ఎవరూ ఆయనవైపు కన్నెత్తి చూడలేదు. జిన్నింగ్‌ మిల్లుకు విద్యుత్‌ సరఫరా నిలిపేయడంతో కొమ్మాలపాటి దొడ్డిదోవను ఎంచుకున్నారు. అక్కడికి 500 మీటర్ల దూరంలో ఉన్న స్పిన్నింగ్‌ మిల్లు నుంచి భూగర్భంలో విద్యుత్‌ లైను ఏర్పాటు చేసి జిన్నింగ్‌మిల్లుకు కనెక్షన్‌ ఇచ్చారు. విద్యుత్‌ మాల్‌ప్రాక్టీస్‌కు తెర తీశారు. ఈ విషయం తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు.

విద్యుత్‌ శాఖ మాచర్ల ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు సీహెచ్‌ఏ ఆర్మ్‌స్ట్రాంగ్‌ బిల్లు చెల్లించని కనెక్షన్లను తనిఖీ చేయాలని నవంబర్‌ 16, 17 తేదీల్లో ఏడీఈలు, ఏఈలను ఆదేశించారు. దీంతో నవంబరు 23న అధికారులు తనిఖీ చేయగా భూగర్భ విద్యుత్‌ లైను బయటపడింది. తర్వాత 24, 25, 26 తేదీల్లో విజిలెన్స్‌ అధికారులు కొమ్మాలపాటి శ్రీధర్‌కు చెందిన జిన్నింగ్, స్పిన్నింగ్‌ మిల్లుల్లో తనిఖీలు చేశారు. భూగర్భ మార్గం నుంచి విద్యుత్‌ మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. సుమారు నాలుగేళ్ల నుంచి అక్రమంగా విద్యుత్​వాడుకుంటున్నట్లు గుర్తించారు. జిన్నింగ్‌ మిల్లుకు విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌చేసి నోటీసులిచ్చారు.

Advertisement

Next Story