గదుల కేటాయింపుల్లో గందరగోళం

by Sridhar Babu |
గదుల కేటాయింపుల్లో గందరగోళం
X

దిశ, ఇల్లెందు : ఇల్లందు పట్టణంలోని మోడల్ మార్కెట్ భవనంలోని గదుల కేటాయింపు విషయంలో గందరగోళం నెలకొంది. నూతన భవనంలో గదుల కేటాయింపునకు బుధవారం వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గదుల కేటాయింపు విషయంలో ఏకపక్ష నిర్ణయాలు సరికావంటూ పలువురు వ్యాపారులు మున్సిపల్ అధికారులను, చైర్మన్ దమ్మలపాటి వెంకటరావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి లిస్టులో తమ పేరు లేదంటూ సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటున్న ఆసక్తిదారులు అసహనం వ్యక్తం చేశారు. గదుల నిర్మాణానికి దశాబ్దాల వ్యాపారం చేసుకున్న తమ ఆవాసాలను సైతం మోడల్ మార్కెట్ నిర్మాణానికి ఇచ్చామని మొదటి ప్రాధాన్యత తమకు ఇచ్చాకే ఇతరులకు గదులను కేటాయించాలని నిర్వాసితులు ఆందోళన చేశారు.

నిర్వాసితులమైన తమకు నూతన గదులను కేటాయించాకే కొత్తవారికి అవకాశం కల్పించాలని చైర్మన్ ను నిలదీశారు. కూరగాయల వ్యాపారులకు ప్రాధాన్యం ఇచ్చి నిర్వాసితులైన తమను విస్మరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభం నుంచి రసాభాసగా మారడంతో ఏం చేయాలో తెలియక పాలకులు, అధికారులు సందిగ్ధంలో పడ్డారు. లిస్టులో వచ్చిన పేరు ఫైనల్ కాదని పూర్తిస్థాయి విచారణ చేసి గదులను కేటాయిస్తామని చైర్మన్ ఎంత చెప్పినా స్థానిక వ్యాపారులు వినలేదు. నూతన భవన నిర్మాణం కోసం ఇన్ని సంవత్సరాలు వేచి చూసిన తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుంటే గదుల కేటాయింపుల్లో పారదర్శకత చూపించని పక్షంలో ఆందోళనకు సిద్ధపడతామంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తలనొప్పిగా మారిన కేటాయింపులు

మోడల్ మార్కెట్ పేరుతో పట్టణంలోని నడిబొడ్డున నిర్మించిన భవన గదుల కేటాయింపులు తలనొప్పిగా మారాయి. కూరగాయలు, మాంసం, ఆకుకూరలు, జనరల్ స్టోర్స్, చేపల విక్రయాలు చేపట్టేందుకు 196 గదులతో మోడల్ మార్కెట్ భవనాన్ని నిర్మించారు. భవన నిర్మాణం పూర్తయినప్పటికీ గదుల కేటాయింపు విషయంలో ఎవరికివారు కింది గది తమకు కేటాయించాలంటూ బెట్టు చేస్తున్నారు. దశాబ్దాలుగా కూరగాయల వ్యాపారం చేసుకునే కొంతమంది ఒకే దుకాణంపై నాలుగైదు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నామని, తమకు అదనపు గదులు కేటాయించాలంటూ పట్టుబడుతున్నారు.

దీంతో నూతన గదుల కేటాయింపు మున్సిపల్ పాలకవర్గానికి, అధికారులకు కాస్త కష్టంగా మారింది. నిర్మాణ సమయంలోనే పలాన గదులు పలానా వ్యాపారానికి అంటూ కేటాయింపులు చేస్తే ఈ సమస్య ఉండేది కాదని హలో గురు వ్యాపారులు పేర్కొంటున్నారు. గదులు సైతం చిన్నగా ఉండడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా రెండు మూడు రోజుల్లో గదుల కేటాయింపు సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు పాలకులు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed