- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడియో గేమ్స్ ఆడితే ఆరోగ్యం!
దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడు చూసినా ఇంట్లో కూర్చుని వీడియో గేమ్‌లు ఆడుతుంటాడు.. కనీసం ఒక్కసారి కూడా బయటికి రాడు.. అని తల్లిదండ్రులు తిడుతుంటారు. అంతేకాకుండా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అందుకు కారణం వీడియో గేమ్‌లు ఆడటమేనని ఆరోపిస్తారు. అంటే అతిగా వీడియో గేమ్‌లు ఆడటం వల్ల నష్టాలు ఉన్నాయనుకోండి.. అది వేరే విషయం. కానీ, రోజుకు రెండు నుంచి మూడు గంటల పాటు వీడియో గేమ్‌లు ఆడటం వల్ల ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వీడియో గేమ్‌లు ఆరోగ్యానికి మంచివేనని, వీటి వల్ల ఒంటరితనం పెరగడం, స్థూలకాయం రావడం, హింసాత్మక ధోరణి అభివృద్ధి చెందడం లాంటివి దుష్ప్రయోజనాలు కాకుండా మానసిక సామర్థ్యం పెరగడం, వయస్సు తగ్గినట్లు కనిపించడం, ఆందోళన తగ్గడం లాంటి మంచి ఆరోగ్య లాభాలు ఉన్నాయని ఈ పరిశోధనల్లో తేలింది. మరి వీడియో గేమ్‌ల వల్ల కలిగే లాభాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
వీడియో గేమ్‌లు ఆడటం వల్ల కలిగే మొదటి లాభం ఏంటంటే కనుచూపు మెరుగుపడుతుంది. అదేంటీ.. ఎక్కువసేపు స్క్రీన్‌ను చూడటం వల్ల కళ్లు దెబ్బతింటాయని అంటారు కదా కనుచూపు మెరుగుపడుతుందని అంటారేంటని అనుకోవద్దు. ఇక్కడ అంటున్నది కళ్ల ఆరోగ్యం గురించి కాదు. ఎక్కువసేపు ఆడటం వేరు, రోజూ కొద్దిసేపు ఆడటం వేరు. అలాగే కళ్ల ఆరోగ్యం వేరు, కనుచూపు మెరుగుపడటం వేరు. వీడియోగేమ్‌లు ఆడే వాళ్లు ప్రతి సందర్భాన్ని లోతుగా విశ్లేషించగలుగుతారు. చాలా వివరణాత్మకంగా, నిషితంగా పరిస్థితిని పరిశీలించి, అందుకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
రెండో లాభం ఏంటంటే ఆందోళన తగ్గుతుంది. ఆందోళన వల్లనే మనిషి శరీరం సగం నష్టపోతుంది. భౌతికంగా ఆరోగ్యానికి కలిగే నష్టాల కన్న మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల ఎన్నో హానికారకరోగాలు వస్తాయి. వీడియో గేమ్‌లు ఆడటం వల్ల ఈ ఆందోళన కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. వీడియో గేమ్‌లలో వేగంగా కదిలే బొమ్మలు, యాక్షన్, క్లిష్టపరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం లాంటి పరిస్థితులు లక్ష్యం మీద దృష్టి సారించగల ప్రవృత్తిని పెంపొందిస్తాయి. తద్వారా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒకే దాని మీద దృష్టిసారించి మిగతా వాటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇలాంటి అలవాటు వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.
అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించే లాభం ఏంటంటే బరువు తగ్గడం. అవును… వీడియోగేమ్‌లు ఆడేవాళ్లు ఎక్కువసేపు కూర్చొని ఉంటారు, ఏది పడితే అది తింటారు, సరిగా నిద్రపోరు కాబట్టి చిన్నవయస్సులోనే స్థూలకాయత్వం వస్తుందని చెబుతుంటారు. కానీ, ఒక్లహామా యూనివర్సిటీకి చెందిన హెల్త్ సైన్సెస్ సెంటర్ వారు 10 నుంచి 13 ఏళ్ల వయస్సు గల వారిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం నిజం కాదని తేలింది. పైగా వీడియో గేమ్‌లు ఆడటం వల్ల కూడా కేలరీలు ఖర్చవుతాయని, తద్వారా స్థూలకాయత్వం రాకపోవడమే కాకుండా, బరువు కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
ఇవి కాకుండా వీడియో గేమ్‌లు ఆడటం వల్ల మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్, క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ వారు 70 మంది వలంటీర్ల మీద చేసిన ఓ పరిశోధనలో యాక్షన్ వీడియో గేమ్‌లు ఆడిన వారు చాలా తెలివిగా ప్రవర్తించినట్లు తెలిసింది. అయితే ఈ తెలివితేటలు శాశ్వతమా? తాత్కాలికమా? అనే కోణంలో ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. యాక్షన్ గేమ్‌లలో ఉండి, సాధారణ గేమ్‌లలో లేనిది ఏంటని వారు అధ్యయనం చేస్తున్నారు. అలాగే వీడియో గేమ్‌లు ఆడేవారు తమ ఆఫీసు పనుల్లో కూడా చురుకుగా ఉంటారని నవంబర్ 2012లో టెక్సాస్ యూనివర్సిటీ చేసిన సర్వేలో వెల్లడైంది. పని పూర్తయ్యేవరకు దాని వెంటపడి ఎలాగైనా పూర్తి చేస్తారని తెలిసింది. వీడియో గేమ్‌లు ఆడేవాళ్లు ఎప్పుడూ ఒంటరిగా ఉండి ఇతరులతో కలవరు అనే ఒక అపోహ ఉంది. అయితే వాళ్లు ఇతరులతో కలవకపోయినా ఆన్‌లైన్‌లో తోటి వీడియో గేమర్‌లతో వారు ఏర్పరుచుకునే బంధం చాలా బలంగా ఉంటుందని, ఇది కూడా ఒక రకమైన సోషలైజేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా వీడియో గేమ్‌లు మంచివే.. కాకపోతే అతిగా ఆడకపోతే మరింత మంచివి అని అర్థం చేసుకోవాలి.