- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే టర్మ్‌లో గెలుపు గులాబీదే.. పాలిటిక్స్ మాకు టాస్క్.. వారికి గేమ్
దిశ, తెలంగాణ బ్యూరో : ‘దళిత బంధులో రాజకీయాలు లేవు.. ఓట్ల కోసం తెచ్చిన పథకం కాదు.. తమాషా కోసం పెట్టిన పథకం కాదు.. ఓట్లు వేసేటప్పుడు ఇష్టం వచ్చిన పార్టీకి ఓట్లు వేసుకోవచ్చు.. దళిత బంధు దళిత జాతి ఉద్దరణ కోసమే.. లబ్ధిదారులు కేసీఆర్ ఫొటో పెట్టుకోవాలనే బలవంతమేమీ లేదు.. ఆరు నూరైనా దళిత బంధును అమలు చేసి తీరుతాం’- సీఎం కేసీఆర్
‘తెలంగాణ ప్రజల బతుకులు తెలుసు.. ఏ వర్గానికి ఏం అక్కర ఉందో అది పరిష్కరిస్తున్నాం.. చేతులెత్తి దండం పెడుతున్నా.. అందరం కలిసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం.. అన్ని వర్గాలను అభివృద్ధి చేసుకుందాం.. గొడవలు, కొట్లాటలు మనకు అక్కర్లేదు’– సీఎం కేసీఆర్
వచ్చే టర్మ్ మనమే గెలుస్తాం.. దాంట్లో అనుమానమే లేదు.. వచ్చే ఏడేళ్లలో తెలంగాణకు 23 లక్షల కోట్లు ఖజానాకు వస్తుందని, ఖర్చు చేస్తామని.. అందులో దళిత బంధుకు లక్షా70వేల కోట్లు ఓ లెక్క అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దళితులందరికీ దళిత బంధును అందజేయగానే.. గిరిజనులు, బీసీ, ఈబీసీలకు బంధును వర్తింపజేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని కులాల కంటే దళితులే వెనుకబడి ఉన్నారని, రాష్ట్రంలో 70 లక్షల మంది దళితుల చేతిలో 13 లక్షల భూమి ఉందని అన్నారు. గిరిజనులు జనాభాలో 9 శాతం ఉంటే 22 లక్షల ఎకరాల భూమి వారికి ఉందని.. అందుకే మొదటగా దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ భవన్‌లో సోమవారం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌లో చేరారు. మోత్కుపల్లికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఇతర పార్టీలకు రాజకీయాలు క్రీడ… టీఆర్ఎస్‌కు టాస్క్ అన్నారు. దళిత బంధు లాగా అన్ని కులాలకు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు చేయూత నిచ్చే పథకాలు తప్పనిసరిగా ప్రవేశపెడతామన్నారు. సంపద పెరిగితే అది తప్పనిసరిగా పేదలకు పంచాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎంత ధైర్యంతో ముందుకు సాగామో.. అంతకన్నా ఎక్కువ ధైర్యంతో.. ప్రాణం పోయినా సరే దళితబంధును వదలబోమని వెల్లడించారు. దళిత బంధుకు లక్షా 70వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఖర్చు చేపట్టడానికి దమ్ము, ధైర్యం ఉండాలని.. ఆ ధైర్యం మాకు ఉందన్న నమ్మకంతోనే దళిత బంధును విజయవంతం చేస్తామన్నారు. దళిత బంధు పథకం కింద అందజేసే లక్షా 70వేల కోట్లతో 10 లక్షల కోట్లు సంపాదన వస్తుందని.. దీంతో దళితులకు ఆత్మగౌరవం.. ధైర్యం వస్తుందన్నారు.
యావత్ దళిత కుటుంబాలకు దళిత బంధును వర్తింప చేస్తామని.. అది సామాజిక బాధ్యత అన్నారు. చిల్లర మల్లర రాజకీయాల కోసం కాదని, ఆరునూరైనా ముందుకు పోదాం.. దళిత బంధును విజయవంతం చేద్దామని వెల్లడించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు కమిటీలను వేస్తామని, అందరం విజ్ఞానంతో ఆలోచించి లొల్లిలేకుండా విజయవంతం చేద్దామని పిలుపు నిచ్చారు. 10 లక్షల రూపాయలు ఇచ్చి టాటా చెప్పబోమని, నిరంతరం వాచ్ చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కోట్ల రూపాయలు దళిత రక్షణ నిధికి సమకూరుతుందన్నారు. అదే విధంగా గిరిజన, బీసీ రక్షణ నిధులు కూడా త్వరలోనే పెట్టుకోనున్నట్లు వెల్లడించారు. ప్రజల సహకారంతో ముందుకు పోతామన్నారు.
తెలంగాణ వస్తే నక్సలైట్లు ఏకే 47లు పట్టుకొని తిరుగుతారని అపోహలు సృష్టించారు. పెట్టుబడులు కూడా రావన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కొందరు మిత్రులు చంపేస్తారని కూడా హెచ్చరించారు. అయినా భయపడలేదు. తెలంగాణ కోసం జాతీయ పార్టీలను ఒప్పించి రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. ఒక్క మాయావతినే తెలంగాణ కోసం 19 సార్లు కలిశానని తెలిపారు. అప్పటికీ ఇప్పటికీ తెలంగాణలో ఎంతో మార్పు కనిపిస్తోంది. పల్లెల వైపు పట్టణాల్లో ఉండే ప్రజలు చూస్తున్నారన్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఒక సారి గెలుస్తుండొచ్చు, మరోసారి ఓడుతుండొచ్చు.. దీంతో తెలంగాణ అభివృద్ధి ఆగదు అన్నారు.
తెలంగాణ రాష్ట్రం తెచ్చినంక నేను పక్కకు జరుగుదామనుకున్న.. అయితే, కొత్త రాష్ట్రం ఎవరి చేతిలో పెడితే ఎలా ఉంటుందో అన్న ఆందోళన కొందరు వ్యక్తం చేయడంతో నేను పగ్గాలు చేపట్టానని స్పష్టం చేశారు. ఏడ్చేటోడు ఎప్పుడూ ఏడుస్తుంటాడని.. వారిని లెక్క చేయకుండా తెలంగాణను ఓ దారిలో పెట్టానని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ దళిత బంధు గొప్పతనం వివరించాలని సూచించారు. కల్యాణలక్ష్మి ద్వారా వచ్చే సాయానికి అదనంగా మరింత కట్నం ఇవ్వాలని అడిగే వారి దవడ పగల గొట్టాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు.
విద్యార్థి దశ నుంచే క్రియాశీలక రాజకీయాల్లోకి మోత్కుపల్లి నర్సింహులు వచ్చారని, ఆయనకు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని, అట్టడుగు వర్గాలకు సేవ చేయాలని తపించే వ్యక్తి అని, నాకు సన్నిహితుడు అని కేసీఆర్ పేర్కొన్నారు. కరెంటు మంత్రిగా పని చేసి మోత్కుపల్లి తెలంగాణ కరెంటు కష్టాలు చూశారన్నారు. తెలంగాణ కష్టాలు చూసే ఆనాడు రాష్ట్ర ఉద్యమం మొదలు పెట్టానని, మంచి నీళ్ళు కూడా కొనుక్కొని తాగే పరిస్థితి ఉండేదన్నారు. నర్సింహులు టీఆర్ఎస్‌లో చేరికను ఓ రాజకీయంగా చూడొద్దని, ఆయన ఎన్నో పదవులు చేపట్టారని, మోత్కుపల్లి సేవలను వాడుకుంటామన్నారు. భువనగిరిలో ఎంపీగా బూర నర్సయ్య గౌడ్ ఓడిపోయాడు. ఈసారి గెలవాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దేవుళ్లు, నదులకు కూడా పాలకులు అన్యాయం చేశారన్నారు. యాదాద్రిని గొప్పగా పునర్నిర్మించుకున్నాం, ప్రారంభానికి ముహూర్తం కూడా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. యాదాద్రి ప్రపంచంలోనే గొప్ప పుణ్యక్షేత్రమని పురోహితులు చెబుతున్నారని పేర్కొన్నారు. అది చేస్తాం.. ఇది చేస్తామని కాదు.. అన్ని చేసుకుంటామని.. విజయం సాధించే వరకు కథానాయుకుల్లా పనిచేద్దామని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ లింగయ్య యాదవ్, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, యాదాద్రి జడ్పీ చైర్మన్ వెలిమినేటి సందీప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.