ఏపీలో బ్లాంక్ జీవోల రగడ.. గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు

by srinivas |   ( Updated:2021-08-13 03:59:41.0  )
tdp leader varla ramayya
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం అర్థరాత్రి బ్లాంక్ జీవోలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. బ్లాంక్, రహస్య జీవోల వ్యవహారంపై గవర్నర్ బీబీ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై ఫిర్యాదు చేశారు. జగన్ సర్కార్ తప్పుడు పనులు చేయడంలో రికార్డులు సృష్టిస్తోందని, ఆర్థిక నేరాల్లో గొప్పపేరు ప్రఖ్యాతులు పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలంతా నోళ్లు వెల్లబెట్టేలా మితిమీరి ప్రవర్తిస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.

గతంలో అడ్రస్ లేని కంపెనీలతో లక్షల కోట్లు పోగేసిన వ్యక్తి, ఇప్పుడు ముఖ్యమంత్రయ్యాక అడ్రస్ లేని జీవోలిస్తూ, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రభుత్వం 12 రోజుల్లో 50 బ్లాంక్ జీవోలు ఇచ్చినట్లు ఆరోపించారు. పారదర్శక పాలన ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. తాము ఫిర్యాదు చేసిన బ్లాంక్ జీవోలను చూసి గవర్నర్ సైతం ఆశ్చర్యపోయారని వర్ల రామయ్య తెలిపారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న బ్లాంక్, రహస్య జీవోల గోప్యతతో గందరగోళం నెలకొందని..దీని ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై అనేకసార్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని అయినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతోపాటు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తోపాటు ఇతర నేతలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed