పేరుకు ఎమ్మెల్యే.. పెత్తనమంతా కొడుకుదే.. అసహనంలో పార్టీ కేడర్

by Sridhar Babu |   ( Updated:2021-06-27 08:47:36.0  )
Vanama-Raghava
X

దిశ ప్రతినిధి, ఖమ్మం : ఆయన ప్రజాప్రతినిధి కాదు.. ఏదైనా పదవి ఉందా అంటే అదీ లేదు.. అయినా ఆయనంటే అందరికీ హడలే.. ఆయనే పర్యటనలు చేస్తాడు.. ప్రారంభోత్సవాలు చేస్తాడు.. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తాడు.. పార్టీ కార్యక్రమాలకూ అతనే పెద్ద.. అన్నింట్లో తానై వ్యవహరిస్తాడు. అధికారులకు ఆర్డర్లు వేస్తాడు.. ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తన తండ్రి ఎమ్మెల్యే అయినా.. ఆయనే ఓ పెద్ద లీడర్‌లా వ్యవహరిస్తారు.. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా..? కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ రావు. నియోజకవర్గంలో పేరు తండ్రిది అయినా.. పెత్తనం మాత్రం తాను చేస్తుంటాడు.. రాఘవ తీరుతో సొంత పార్టీ నేతలతో పాటు, అధికారులు సైతం అసహనానికి గురవుతున్నారట.

వివాదాలకు కేంద్ర బిందువుగా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధికార ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున గెలిచి అనంతరం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేడర్, ద్వితీయ శ్రేణి నాయకులంతా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో వనమా తనయుడు రాఘవేందర్ రావు నియోజకవర్గంలో ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడుస్తోందని పలువురు సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. అన్నింట్లో తలదూర్చుతూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా ఎవరూ ఏం మాట్లాడకపోవడం విశేషం. వర్గాలను ప్రోత్సహిస్తూ గ్రూపు రాజకీయాలకు తావిస్తుంటాడనే విమర్శలు ఉన్నాయి.

పర్యాటనలు.. సమావేశాలు..

నియోజకవర్గంలో ఎమ్మెల్యే హోదాలో తన తండ్రి ఏ పర్యటన చేయాలన్నా రాఘవనే ఫిక్స్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. వెంకటేశ్వరరావు ఎక్కడికి వెళ్లినా తన తనయుడు కూడా ఉండాల్సిందే. ఎక్కువగా రాఘవనే నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేస్తుంటారట. అంతేకాదు.. స్థానిక ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీ కేడర్ వద్ద ఈయన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారనే విమర్శలూ ఉన్నాయి. రాఘవ తీరుతో చాలా మంది అసహనంగా ఉన్నారని, అయినా ఎవరూ బయట పడడంలేదనే టాక్ పార్టీ వర్గాల్లోనే ఉంది. తమతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారని, ఆదేశాలు జారీ చేస్తారని కొందరు వాపోతున్నారు.

అధికారులకు ఆర్డర్లు..

నియోజకవర్గంలో ఏదైనా పనులకు సంబంధించి వనమా రాఘవనే డీల్ చేస్తుంటారట. అధికారులతో మాట్లాడడం, వారితో సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం అంతా ఆయన పనే.. అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక వారికి ఆర్డర్లు సైతం జారీ చేస్తుంటారట. తమకు ఆయన ఏ హోదాలో ఆర్డర్లు జారీ చేస్తున్నారని కిందిస్థాయి అధికారులు వాపోతున్నారు. ఏం చెప్పినా ఎమ్మెల్యే హోదాలో ఉన్న వనమా వెంకటేశ్వరరావు చెప్పాలని, అంతేకానీ ఆయన కొడుక్కు ఏం పనంటూ అసహనంగా ఉన్నారట.

ఏపనైనా ముందు చెప్పాల్సిందే..

నియోజకవర్గంలో ఎవరైనా సరే.. ఏదైనా సమస్య ఉండి ఎమ్మెల్యేను కలవాల్సిన పరిస్థితి వస్తే, మొదట రాఘవనే కలవాలని, లేకుంటే ఎమ్మెల్యేను కలవడం అసాధ్యమని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరైనా మాట వినకుంటే తన అనుచరులు బెదిరింపులకు గురిచేయడం, అవసరమైతే దాడులకు కూడా పాల్పడుతుంటారని విమర్శిస్తున్నారు. ప్రతీ పని తనకుచెప్పి పెద్దాయన్ను కలవాలంటే ఎలా, కొన్ని చెప్పకూడని పనులు కూడా ఉంటాయి కదా అంటూ ఓ స్థానిక ప్రజాప్రతినిధి రాఘవ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

గ్రూపులను ప్రోత్సహించడం..

ముఖ్యంగా రాఘవ గ్రూపులను ప్రోత్సహించడం, తన అనుచరులతో వివాదాల్లో తలదూర్చడం చేస్తుంటాడని స్థానికులు విమర్శిస్తున్నారు. భూ తగాదాలు, పంచాయితీలు, సెటిల్మెంట్లు.. ఇలా ఏదైనా సరే వనమా రాఘవనే తన అనుచరులతో డీల్ చేపిస్తుంటారనే అపవాదు ఉంది. అంతేకాదు పార్టీలోనూ వర్గాలను ప్రోత్సహించడం, మరో వర్గంపై కక్ష సాధింపు చర్యలకు దిగడం వంటివి చేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి.

విసిగిపోతున్న కేడర్..

వనమా రాఘవ తీరుతో ఓ వర్గం నేతలు, అధికారులు, కాడర్ మొత్తం అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయమై ఎవరూ ప్రస్తుతానికి నోరు మెదపకపోయినా నియోజకవర్గంలో చాలా వరకు విసిగిపోయి ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో పార్టీకి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. అంతేకాదు అధిష్టానం దృష్టిసారించి వనమా రాఘవను కట్టడి చేయాలని, లేకుంటే నియోజకవర్గంలో చాలామంది పార్టీ కేడర్.. పార్టీకి దూరం అయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు. ఇప్పటికిప్పుడు దాని ప్రభావం ఏమీ లేకపోయినా భవిష్యత్తులో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు.

పెద్దాయన ఏం చేస్తున్నట్లో..

నియోజకవర్గంలో ఏం జరిగినా అది రాఘవ చేతుల మీదుగానే జరిగిపోతుండడం, అన్నింట్లో అతనే వేలు పెడుతుండడంతో అసలు ఎమ్మెల్యేగారు ఏం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొడుకు ఏం చెప్పినా తండ్రి తలూపే పరిస్థితే ఉందని, ఎక్కడికి వెళ్లాలన్నా రాఘవనే షెడ్యూల్ ఖరారు చేస్తున్నారని ఇది ఎంత వరకు కరెక్ట్ అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే ఎమ్మెల్యే ప్రణాళికలు వేస్తున్నారని, అందుకే అతన్ని అలా వదిలేశారిని ఓ వర్గం నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాఘవనే పోటీలోకి దించే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా తండ్రీ కొడుకుల తీరుతో నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story