రాజకీయాలకు వల్లభనేని గుడ్ బై?

by srinivas |
రాజకీయాలకు వల్లభనేని గుడ్ బై?
X

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలను వీడుతున్నారా? పార్టీ మొత్తం పరాజయం పాలైనా విజయబావుటా ఎగురవేస్తూ వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వల్లభనేని వంశీ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నారా? రాజకీయాల్లో నువ్వా? నేనా? అంటూ సవాలు విసరగల నాయకుడిగా పేరొందిన వంశీ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వెనుక కారణమేంటి? ఇంతకీ ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకుంటున్నారా? లేక జిల్లా రాజకీయాల్లో లేచిన పుకారా? అన్న వివరాల్లోకి వెళ్తే…

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.. సినీ నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. 2009లో పున్నమినాగు సినిమాను నిర్మించారు. ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో తీసిన సినిమా లాభాలనే ఆర్జించింది. 2010లో జూనియర్ ఎన్టీఆర్‌తో తీసిన అదుర్స్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ లాభాలనార్జించింది. 2018లో టచ్‌చేసి చూడు సినిమాకి సహనిర్మాతగా వ్యవహరించారు. 2010లో పరిచయంతో జూనియర్ ఎన్టీఆర్ సిఫారసుతో టీడీపీ టికెట్ పొందారు. దీంతో గన్నవరంలో 2014లో పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో పొసగక పార్టీతో అంటీముట్టనట్టు ఉన్నారు. 2017లోనే ఆయన పార్టీ మారుతారంటూ ఊహాగానాలు వచ్చినప్పటికీ ఆయన పార్టీ మారింది లేదు. దీంతో మరోసారి పార్టీ అధిష్ఠానం ఆయనకే టికెట్ ఇచ్చింది. దీంతో 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం జగన్‌పై విశ్వాముంచి ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. వంశీ మాత్రం మరోసారి గెలిచి ఆకట్టుకున్నారు.

అనంతరం పార్టీతో దూరం పెరిగింది. అపాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వలేదంటూ అధినేతపై అలిగి పార్టీకి రాజీనామా చేయకుండా వైఎస్సార్సీపీతో అంటకాగారు. దీంతో పార్టీ బహిష్కరించడంతో ఆగ్రహానికి గురై అధినేతపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. అయితే ఆయన ఆ పార్టీలో కూడా ఇమడలేకపోతున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఫేస్ బుక్ లో ‘పద్నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నా కష్టసుఖాలలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ వంశీ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీలో కూడా వల్లభనేని వంశీ ఇమడలేకపోతున్నారా? రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నారా? అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వాస్తవానికి వంశీ వైఎస్సార్సీపీలో అధికారికంగా చేరలేదు. కానీ, ముఖ్యమంత్రి జగన్ కు మద్దతిస్తూ, అసెంబ్లీలో సైతం ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీలపై ఆయన చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న వంశీ ఫేస్‌బుక్ పోస్టుతో పెద్ద చర్చను లేవదీశారు. ఇంతకీ వంశీ అధికార పార్టీతో ఉంటారా? దీనిపై అధికారిక ప్రకటన రానుందా? అందుకే ఇంతకాలం టీడీపీలో తనతో పని చేసిన వారికి ధన్యవాదాలు చెబుతున్నారా?.

లేక మరోసారి టీడీపీవైపు మొగ్గుతారా? అదీకాక రాజకీయాలను పూర్తిగా వదిలేస్తున్నారా? వైఎస్సార్సీపీలో సొంత నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత లభించడం లేదా? అందుకే కినుక వహించి రాజకీయాల నుంచి తప్పుకుందామని భావిస్తున్నారా? అన్న చర్చ ప్రారంభమైంది. అయితే ఈ పోస్టు పెట్టిన కాసేపటికే వంశీ దానిని డిలీట్ చేశారు. ఇది కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకి వంశీ ప్లాన్ ఏంటి? అన్నది తెలియాలంటే కొంత కాలం ఓపిక పట్టాల్సిందే.

tags:vallabhaneni vamsi mohan, vamshi, gannavaram, krishna district, ap, tdp, ysrcp, politics

Advertisement

Next Story

Most Viewed