‘వ్యాక్సిన్ టూరిజం’ న్యూ ట్రావెల్ ట్రెండ్

by Anukaran |
‘వ్యాక్సిన్ టూరిజం’ న్యూ ట్రావెల్ ట్రెండ్
X

దిశ, ఫీచర్స్ : జీవితం నుంచి మనం తప్పించుకోవడానికి చేసేది ‘విహారం’ కాదు.. జీవితం మన నుంచి తప్పించుకోకుండా చేసేదే ‘టూర్’ అనే మాటల్లో నిజం లేకపోలేదు. అలానే ‘టు ట్రావెల్ ఈజ్ టు లైవ్’ (ప్రయాణించడమంటే జీవించడం) అంటుంటారు. అయితే ఈ పదాలను ప్రస్తుత పరిస్థితులకు కూడా అన్వయించుకోవచ్చు. అర్థం కాలేదు కదా! కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని ‘వ్యాక్సిన్’ అనేది తెలిసిన విషయమే. అయితే ఇప్పటికీ చాలా దేశాల్లో వ్యాక్సిన్స్ అందుబాటులో లేదు. దీంతో ‘వ్యాక్సినేషన్’ కోసం ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీన్నే ‘వ్యాక్సిన్ టూరిజం’ అంటున్నారు. లాక్‌‌డౌన్ తర్వాత చాలా దేశాలు పర్యాటకులను తమ తమ దేశాలకు ఆహ్వానిస్తుండగా.. COVID-19 వ్యాక్సిన్ టూరిజం అతి తక్కువ కాలంలోనే గ్లోబల్ ఇండస్ట్రీగా అభివృద్ధి చెందింది.

టీకా టూరిజం 2020 డిసెంబరులో మొదలవగా.. చాలామంది భారతీయ సంపన్నులు ‘వ్యాక్సినేషన్’ కోసం న్యూయార్క్, లండన్ దేశాలకు వెళ్లినట్లు ఇండియన్ టూరిజం ఆపరేటర్లు వెల్లడించారు. ఒక నివేదిక ప్రకారం ఈ టూర్ ప్యాకేజీలో ఒక వ్యక్తికి 1777 యూఎస్ డాలర్లు కాగా సదరు వ్యక్తి అవసరమైన కాలానికి క్యారంటైన్‌లో ఉండటానికి వీలు కల్పిస్తుంది. ప్యాకేజీలో భాగంగానే ఆరోగ్య కేంద్రంలో కస్టమర్‌కు ‘ఫైజర్ బయోఎన్‌టెక్ టీకా’ అందిస్తారు. అదే విధంగా యూరోపియన్ టూర్ ఆపరేటర్లు కూడా ‘స్పుత్నిక్ టీకా’ కోసం రష్యాకు కూడా ప్రత్యేక ‘వ్యాక్సిన్ టూర్’ ప్యాకేజీలు అందిస్తున్నారు. టర్కీ కూడా ఈ జాబితాలో ఉంది. దీంతో ‘వ్యాక్సిన్ టూరిజం’ న్యూ ట్రావెల్ ట్రెండ్‌గా మారిపోయింది. ఇందులో భాగంగా పర్యాటకుడు విదేశంలో హాలీడేను ఎంజాయ్ చేస్తూనే కరోనా నుంచి ప్రాణాలను కాపాడే టీకా పొందవచ్చు. ఇండియా, థాయిలాండ్ వంటి దేశాలు వైద్య లేదా సౌందర్య శస్త్రచికిత్సలకు చిరునామాగా నిలిస్తే కొత్త రకమైన పర్యాటక రంగం ఆవిర్భావానికి కొవిడ్ పాండెమిక్ కారణమైంది. నార్వేయన్ ట్రావెల్ ఏజెన్సీ వరల్డ్ విజిటర్ రష్యాకు అనేక రకాల టీకా పర్యటనలను అందిస్తున్నట్లు సమాచారం.

జర్మన్ ట్రావెల్ ఏజెన్సీ ఫిట్ రీసెన్ (లేదా ‘ఫిట్ ట్రావెల్’) ఫిబ్రవరిలో ‘వ్యాక్సిన్ వెకేషన్స్’ ఇవ్వడం ప్రారంభించింది . అయితే ‘టీకా డ్రైవ్’ సమయంలో వ్యాక్సిన్ వెకేషన్ నిలిపేసింది. త్వరలోనే మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తామని ఫిట్ రీసెన్ ప్రతినిధి డ్యూయిష్ వెల్లెలొ ఇటీవలే పేర్కొన్నాడు. ఆస్ట్రియన్ కంపెనీ ‘ఇంఫ్ఫ్రైసెన్’ ట్రావెల్ కంపెనీ కూడా ప్రత్యేక వెకేషన్ ట్రావెల్ ప్యాకేజీలను ప్రకటించింది. అయితే రష్యా ప్రభుత్వం మాత్రం తమ పౌరులకు టీకాలు ఇచ్చిన తర్వాత, విదేశీయులకు టీకా అందించే కార్యక్రమం జూలై నుంచి ప్రారంభించే అవకాశముందని ప్రకటించింది. ఇక ఫైజర్ వ్యాక్సిన్‌కు యూకె ప్రభుత్వం గత డిసెంబర్‌లో ఆమోదం తెలిపింది. ‘వ్యాక్సిన్ టూర్’ కోసం ఇంగ్లాండ్ వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగిందని కోల్‌కతాలోని ‘జెనిత్ హాలిడేస్’, ముంబైలోని ‘జెమ్ టూర్స్ & ట్రావెల్స్’, బెంగళూరులోని ‘చారిట్ వరల్డ్ టూర్స్’ వంటి ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి.

ఇప్పుడు ఆసియా అంతటా కొవిడ్ కేసులు పెరిగేకొద్దీ, ప్రజలకు టీకా పర్యాటకం పెద్ద వ్యాపారంగా మారుతోంది. టీకా రేట్ల కంటే కొవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న దేశాలలో ట్రావెల్ ఏజెన్సీలు విదేశాలలో వ్యాక్సిన్ ట్రిప్ స్వీకరించడానికి వందలాది అభ్యర్థనలను అందుకుంటున్నాయి. ప్రతి వ్యక్తికి 75,000 బాట్ (baht), 200,000 బాట్ (2,400 డాలర్లు, 6,400 డాలర్లు) మధ్య, థాయ్‌లాండ్‌కు చెందిన యూనిథాయ్ ఏజెన్సీ యూఎస్‌కు “టీకా పర్యటన” అందిస్తోంది. ఇక్కడ పర్యాటకులు జాన్సన్/ జాన్సన్ జబ్ లేదా రెండు మోతాదుల ఫైజర్ వ్యాక్సిన్‌ను పొందవచ్చు. ఇక మరో థాయ్‌లాండ్ ట్రావెల్ ఏజెన్సీ ‘మై జర్నీ ట్రావెల్ ’ స్పెషల్ యూఎస్ వ్యాక్సిన్ టూరిజం ప్యాకేజీలు అందిస్తోంది. ఇతర ట్రావెల్ కంపెనీలు సెర్బియా, రష్యాకు వ్యాక్సిన్ టూర్లను అందిస్తున్నాయి. ఇక్కడ పర్యాటకులు స్పుత్నిక్ వి టీకాను పొందవచ్చు.

ఇండియాలో కరోనా ఉధృతితో పాటు, ఇక్కడి కొవిడ్ వేరియంట్‌పై ఇతర దేశాలు భయపడటంతో భారతీయుల రాకపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీకా తీసుకున్న వాళ్లను మాత్రమే వివిధ దేశాలు పర్యటకానికి ఆహ్వానిస్తున్నాయి. ఇందుకోసం ‘వ్యాక్సిన్ పాస్‌పోర్ట్’ చూపించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ల కారణంగా ఆర్థికంగా నష్టపోయిన దేశాలతో సహా అనేక దేశాలు వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులను అంగీకరించడానికి ఆసక్తి చూపుతున్నాయి. వీటిలో గ్రీస్, పోర్చుగల్, సైప్రస్, ఎస్టోనియా, ది సీషెల్స్, ఐస్లాండ్, రొమేనియా, లెబనాన్, జార్జియా, పోలాండ్ ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, క్యూబా దేశాలు ఇటీవల టీకా పర్యాటక ప్రచారాన్ని ప్రారంభించడం విశేషం.

ఎక్స్-ఎర్ట్ అనే టర్కిష్ సంస్థ సెర్బియాకు వ్యాక్సిన్ యాత్రలు ప్రారంభించిన తరువాత, సెర్బియా ప్రధానమంత్రి అనా బ్రనాబిక్, నివాస అనుమతి లేని విదేశీయులు తమ దేశానికి రాకూడదని పేర్కొన్నాడు. యుఎఈలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఆసియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది టీకాలు అందుకోవాలనే ఆశతో అక్కడికి వెళ్లారు. కానీ యుఎఈ ప్రభుత్వం నివాస అనుమతి ఉన్నవారికి మాత్రమే కొవిడ్ వ్యాక్సిన్లను పొందవచ్చని చెప్పారు. కానీ ఇందుకు భిన్నంగా U.S. లోని టీకా కేంద్రాలు మాత్రం విదేశాల నుండి వ్యాక్సిన్ పర్యాటకులను స్వాగతిస్తున్నాయి. ఏప్రిల్‌లో, స్థానిక ప్రయాణ సంస్థలు నిర్వహించిన పర్యటనల్లో భాగంగా కొవిడ్ జబ్‌లను స్వీకరించడానికి వేలాది మంది సంపన్న మెక్సికన్లు ఉత్తర అమెరికా వెళ్లగా.. కెనడియన్లు దక్షిణ అమెరికా వైపు వెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed