చిన్నారులకు ఇంటి వద్దకే టీకా!

by Shyam |   ( Updated:2021-10-12 23:02:51.0  )
చిన్నారులకు ఇంటి వద్దకే టీకా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: చిన్నారుల టీకా అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి విధి,విధానాలు రాగానే పంపిణీని ప్రారంభిస్తామని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. దీన్ని పల్స్​పోలియో తరహాలో అందించాలని భావిస్తున్నది. నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి టీకాలు ఇవ్వాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నది. అయితే కేంద్ర మార్గదర్శకాలు వచ్చే లోపల జిల్లాల వారీగా 2 నుంచి 18 ఏళ్ల మధ్యస్థుల వివరాలను సేకరించనున్నారు. ఆయా జిల్లాల్లో వ్యాక్సినేషన్​పై అవగాహన ఎలా ఉన్నది? అనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు. అంతేగాక స్పెషల్ క్యాంపులు ఎలా నిర్వహించాలి? రీయాక్షన్లు తేలితే ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలపై వైద్యశాఖ ప్రత్యేక ప్లాన్​ను తయారు చేస్తున్నది. రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల మంది పిల్లలకు వ్యాక్సిన్​ అందించాల్సి వస్తుందని ఆరోగ్యశాఖ ప్రాథమికంగా అంచనా వేస్తున్నది. అయితే ఇప్పటి వరకు 18 ఏళ్ల పై బడిన వారికి విజయవంతంగా వ్యాక్సిన్​అందిస్తున్న ఆరోగ్యశాఖ , చిన్నారులకు పంపిణీనీ విజయవంతం చేస్తామనే ధీమాతో ఉన్నది.

అనుమతే తరువాయి…

2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులకు తాను తయారు చేసిన కొవాగ్జిన్​టీకాను ఇచ్చేందుకు భారత్​ బయోటెక్​ డ్రగ్​ కంట్రోల్​ ఆఫ్ జనరల్​ ఆఫ్ ఇండియా కు దరఖాస్తు చేసుకున్నది. 525 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై చేసిన పరిశోధన ఫలితాలను పొందుపరించింది. అత్యవసర అనుమతులతో దీన్ని మార్కెట్లోకి పంపిణీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. పూర్తి స్థాయి పరిశీలన తర్వాత త్వరలో అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉన్నది. అయితే ఈ టీకాను జబ్బకు ఇంజక్షన్​ రూపంలో ఇవ్వనున్నారు. దీంతో పాటు 12 నుంచి 18 ఏళ్ల మధ్య వారికి అత్యవసర కింద జైడుస్​ వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది కూడా జబ్బకే ఇవ్వనున్నారు కానీ దీనికి సూది ఉండదని రాష్ర్ట వైద్యాధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి ఏ కంపెనీకి చెందిన టీకాలు వచ్చినా, పంపిణీ చేసేందుకు రెడీ గా ఉంటామని రాష్ర్ట వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ​

ఇప్పుడే అసలైన సవాల్​…

చిన్నారుల టీకా పంపిణీనే వైద్యారోగ్యశాఖకు పెద్ద సవాల్​ గా మారనుంది. ముఖ్యంగా అవగాహన కల్పించడమే పెద్ద సమస్యగా మారబోతున్నది. ఈ మేరకు ఇప్పటి వరకు శ్రమించిన కష్టం కంటే రెట్టింపు స్థాయిలో పనిచేయాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అంతేగాక ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో టీకా వేసుకునేందుకు చిన్నారులు ముందుకు వస్తారా? లేదా? అనే ది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో ఏ విధంగా ముందుకు పోతే చిన్నారుల పంపిణీ సజావుగా కొనసాగుతుందని అధికారులు మెడికల్​ నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటున్నారు.

పిల్లలకూ వేగంగా పంపిణీ చేస్తాం :డీహెచ్​ డా శ్రీనివాసరావు

కరోనా నియంత్రణలో భాగంగా చిన్నారులకూ టీకా ఇచ్చేందుకు ప్రయోగాలు పూర్తయ్యాయి. డీసీజీఐ కూడా వేగంగా అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నది. కేంద్ర నుంచి మార్గదర్శకాలు రాగానే పంపిణీకి ప్లాన్​ చేస్తాం. వేగంగా పూర్తి చేసేందుకు పల్స్​ పోలియో తరహాలో వ్యాక్సిన్లు వేస్తాం. రాష్ట్రంలో సుమారు 1.05 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. వారందరికీ వేగంగా ఇస్తాం. ఇప్పటికే పెద్దల్లో విజయవంతంగా వ్యాక్సినేషన్​నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో చిన్నారులకు అదే వేగంతో అందిస్తాం. ప్రస్తుతం ఉన్న వ్యాప్తి, కేసులను పరిశీలిస్తుంటే అతి త్వరలో కరోనా అంతం అవుతుందనే భరోసా కలిగింది. ప్రజలు మరిన్ని రోజులు సహకరించాలని కోరుతున్నాను.

Advertisement

Next Story