టీకా కేంద్రాలను పెంచాలి : కేంద్రం

by Shamantha N |
టీకా కేంద్రాలను పెంచాలి : కేంద్రం
X

న్యూఢిల్లీ: మూడో దశ టీకా పంపిణీ మే 1వ తేదీ నుంచి మొదలుకానున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక సూచనలు చేసింది. పెద్దసంఖ్యలో అర్హులకు టీకా వేయడానికి అనువుగా అదనపు టీకా కేంద్రాలను గుర్తించాలని సూచించింది. అలాగే, ఫీల్డ్ హాస్పిటళ్లనూ ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. వీటికోసం డీఆర్‌డీవో, సీఎస్ఐఆర్ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలు, లేదా ప్రైవేటు సంస్థల సహకారాన్ని తీసుకోవాలని పేర్కొంది. టీకా కొనుగోలు చేసిన ప్రైవేటు హాస్పిటళ్లను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని వివరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, కొవిడ్-19 డేటా మేనేజ్‌మెంట్, టెక్నాలజీ సాధికారిక గ్రూపు చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మలు శనివారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మూడో దశ టీకా పంపిణీ అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరోగ్యవ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని తెలియజేయడంతోపాటు అందుకు అవసరమైన సూచనలను చేశారు. ప్రస్తుతం కొవిన్ ప్లాట్‌ఫామ్ నూతన దశ టీకా పంపిణీకి సిద్ధంగా ఉన్నదని, పెద్ద సంఖ్యలో అర్హులను నమోదుచేసుకోవడానికి అనుగుణంగా అభివృద్ధి చేశామని, అంతరాయం లేకుండా భారీ సంఖ్యలో పేర్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు. అయితే, సరైన సమాచారాన్ని సరైన సమయానికి అప్‌లోడ్ చేయడం ముఖ్యమని, తప్పుడు సమాచారాన్ని అప్‌లోడ్ చేస్తుంటే మొత్తం వ్యవస్థనూ ప్రభావితం చేయవచ్చునని పేర్కొన్నారు.

అదనపు ప్రైవేటు టీకా కేంద్రాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు అధికారులు తెలియజేశారు. టీకా కొనుగోలు చేసిన హాస్పిటళ్లను పర్యవేక్షించాలని, అవి టీకాల నిల్వలు, ధరలను కొవిన్‌లో అప్‌లోడ్ చేశాయా? లేదా? పరిశీలిస్తూ ఉండాలని వివరించారు. టీకా పంపిణీ కేంద్రాల వివరాలను అర్హులకు అర్థమయ్యేలా పొందుపరచాలని సూచించారు. 18 నుంచి 45ఏళ్ల మధ్య గల అర్హులు టీకా కోసం కేవలం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉందన్న విషయాన్ని ప్రచారం చేయాలని తెలిపారు. టీకా కేంద్రాల్లో ప్రజలు గుమిగూడకుండా సరిపడా స్థలముండేలా నిర్ణయాలు తీసుకోవాలని వివరించారు. వీలైనన్ని కొవిడ్ డెడికేటెడ్ హాస్పిటళ్లను గుర్తించాలని, ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ సరఫరాలు సరిపడా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed