టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shyam |
Utham
X

దిశ, నేరేడుచర్ల : టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ల్యాండ్స్, శ్యాండ్స్, మైన్స్, వైన్స్‌ల్లో దోచుకుంటూ మాఫియా నడిపిస్తున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్ పరిశ్రమల్లో కార్మికులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటుందని విమర్శించారు. గతంలో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పారితోషికం అందించాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాదిరిగానే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పోలీసుల ద్వారా నడిపిస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎస్ఐ, సీఐ, డీఎస్పీ బదిలీలు కావాలంటే స్థానిక ఎమ్మెల్యేలకు రూ.5 నుంచి 20 లక్షలు ఇవ్వాల్సిందేనని అన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు త్వరలోనే తిరగబడి గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. రుణమాఫీని అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని, వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతులకు ఫారెస్ట్ భూముల హక్కులు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. పరిశ్రమల నుండి వచ్చే మైనింగ్ ఫండ్‌ను ఆ మండలాల్లోనే ఖర్చుచేయాలని తెలిపారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోందని, వారికి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఈ విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన జాన్‌పహాడ్ మాజీ ఎంపీటీసీ గన్నె సైదా కుటుంబాన్ని, కోమటికుంట మాజీ సర్పంచ్ భర్త రాములు మరణించగా వారి కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎర్రగాని నాగన్న గౌడ్, ఎంపీపీ భూక్యా గోపాల్, పాలకవీడు, నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారావు, కొణతం చిన్న వెంకటరెడ్డి, నాయకులు జితేందర్ రెడ్డి, మాలోతు మోతీలాల్, సప్పిడి నాగిరెడ్డి బెల్లంకొండ నరసింహారావు, నీమా నాయక్, దావీద్ పాల్గొన్నారు.

Advertisement

Next Story